సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) మ్యాచుల్లో బెట్టింగ్ వ్యవహారంపై సీబీఐ దూకుడు పెంచింది. ఈ మేరకు రెండు కేసులు నమోదు చేసినట్టు తెలిసింది. 2019లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో భారీగా బెట్టింగ్ జరిపినట్టు పక్కా సమాచారం అందటంతో శనివారం దేశంలోని నాలుగు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. దేశ రాజధాని ఢిల్లీతోపాటు జోధ్‌పూర్, జైపూర్, హైదరాబాద్‌లో సోదాలు నిర్వహించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
బెట్టింగ్‌లో వచ్చిన డబ్బు కోసం బ్యాంక్ అకౌంట్లు సైతం తీసినట్టు సీబీఐ గుర్తించింది. దీనితో పలు ప్రైవేట్ వ్యక్తులతోపాటు అనుమానిత ప్రభుత్వ ఉద్యోగులపై కేసులు నమోదుచేసినట్టు ఏజెన్సీ వర్గాలు వెల్లడించాయి. మ్యాచ్‌ల గెలుపు ఓటములను సైతం నిర్ణయించేలా బెట్టింగ్ మాఫియా పాకిస్తాన్ నుంచి కథ నడిపించినట్టు సీబీఐ అనుమానిస్తోంది.
లావాదేవీల నిర్వహణ కోసం ఫోర్జరీ, నకిలీ డాక్యుమెంట్లతో బ్యాంకు అకౌంట్లు తెరవడంతోపాటు కేవైసీ(నో యువర్ కస్టమర్) డాక్యుమెంట్లలో పలువురు బ్యాంకు అధికారుల పాత్ర ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. ఇలా ఒక గ్యాంగ్ రూ.11 కోట్లకు పైగా లావాదేవీలు జరపగా, మరో గ్యాంగ్ రూ.1.5 కోట్ల మేర లావాదేవీలు నిర్వహించినట్టు సీబీఐ ఆధారాలు సేకరించింది.
రెండు ఎఫ్‌ఐఆర్‌లు
పాకిస్తాన్‌లోని వఖాస్ మాలిక్ అనే వ్యక్తితో రెండు గ్యాంగులు బెట్టింగ్ దందా సాగించినట్టు సీబీఐ అనుమానిస్తోంది. రూ.11 కోట్ల మేర లావాదేవీ నడిపిన కేసులో హైదరాబాద్‌కు చెందిన దిలీప్ కుమార్, గుర్రం సతీశ్, గుర్రం వాసును నిందితులుగా చేర్చినట్టు తెలిసింది. వీరు 2013 నుంచి ఐపీఎల్ బెట్టింగ్ పాల్పడుతున్నట్టు సీబీఐ అనుమానిస్తోంది.
మరో ఎఫ్‌ఐఆర్‌లో ఢిల్లీ, జోధ్‌పూర్, జైపూర్‌కు చెందిన సజ్జన్ సింగ్, ప్రభులాల్‌మీనా, రామ్ అవతార్, అమిత్ కుమార్ శర్మతోపాటు మరికొంత మంది గుర్తుతెలియని ప్రభుత్వ ఉద్యోగులను నిందితుల జాబితాలో చేర్చినట్టు తెలిసింది. వీరు 2010లో కూడా ఐపీఎల్ మ్యాచ్‌ల్లో బెట్టింగ్ పాల్పడినట్టు సీబీఐ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment