సాక్షి, కొత్తూరు(భువనేశ్వర్): భామిని మండలంలో సంచలనం సృష్టించిన టైలర్ నల్లకేవటి కుమారస్వామి హత్య కేసును పోలీసులు ఛేదించారు. భర్త హత్యకు భార్యే సూత్రధారని నిగ్గుతేల్చారు. ఈ ఘటనలో ముగ్గురిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో మైనర్ కూడా ఉండడం గమనార్హం. ప్రేమాయణమే ప్రాణం తీసేందుకు ఉసుకొల్పిందని పోలీసులు వివరించారు. భామిని మండలం దిమ్మిడిజోల సమీపంలో ఈ నెల 25వ తేదీన నడిరోడ్డుపై ఇదే మండలం లోహజజోల గ్రామానికి చెందిన నల్లకేవటి కుమారస్వామి దారుణహత్యకు గురయ్యారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు కొత్తూరు సీఐ మజ్జి చంద్రశేఖర్, బత్తిలి ఎస్సై కేవీ సురేష్‌లు తమ సిబ్బందితో కలసి అయిదు రోజుల్లో హంతకులను పట్టుకొన్నారు. వారిని కొత్తూరులో విలేకరుల ముందు శుక్రవారం ప్రవేశపెట్టారు. సీఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. కుమారస్వామికి మాలతితో 2012లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు.
పెళ్లికి ముందు మాలతి తాతగారి గ్రామమైన పాతపట్నం మండలం గంగువాడలో ఉండేది. ఈ సమయంలో అదే గ్రామానికి చెందిన పెనుబాకల హేమసుందరావు(శ్యామ్), మాలతిలు ప్రేమించుకున్నారు. అయితే ఇద్దరిదీ వేర్వేరు సామాజిక వర్గాలు కావడంతో పెళ్లి చేసుకోవడానికి వీలు కాలేదు. కుటుంబీకులు అదే ఏడాదిలో వారి సమాజికవర్గాలకు చెందినవారితో పెళ్లిళ్లు చేసేశారు. అయితే వివాహాలైనప్పటికీ హేమసుందరరావు, మాలతి మధ్య ప్రేమ పోలేదు. రెండు కుటుంబాలు వేర్వేరుగా బతుకు తెరువు కోసం హైదరాబాద్ వెళ్లారు. వీరిలో హేమసుందరరావు తాపీ మేస్త్రీగా పని చేసేవాడు. హత్యకు గురైన కుమారస్వామి టైలర్ వృత్తి చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అక్కడ కూడా ఇద్దరి ప్రేమ కొనసాగేదని.. దీంతో రెండు కుటుంబాల మధ్య తరచూ తగాదాలు జరిగేవని సీఐ వివరించారు. ఈ నేపథ్యంలోనే కుమారస్వామి భార్య మాలతి, పిల్లలను తీసుకొని స్వగ్రామం లోహరజోల తిరిగి వచ్చేశాడు. అయితే మాలతి, హేమసుందరరావు ప్రేమ వ్యవహారం ఫోన్ ద్వారా కొనసాగుతుండేది. తమ ప్రేమకు భర్త కుమారస్వామి అడ్డుగా ఉంటున్నారని భావించిన వారు అతని ప్రాణాన్ని తీసి అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఈ నెల 25 తేదీన పర్లాకిమిడిలోని పెద్దమ్మ ఇంటికి వెళ్లాలని భర్త కుమారస్వామికి మాలతి చెప్పడంతో నిజమని నమ్మాడు. ఇద్దరి పిల్లలను తీసుకొని ద్విచక్ర వాహనంపై బయలు దేరాడు. అయితే తమ ప్రయాణ సమాచారాన్ని ప్రియుడు హేమసుందరరావుకు చేరవేయడంతో అతను కూడా ఓ మైనర్ బాలుడిని వెంట తీసుకొని బైక్‌పై అదేమార్గంలో వస్తూ.. కుమారస్వామి బైక్ రాక పోకలను గమనించాడు. దిమ్మిడిజోల సమీపంలోకి వచ్చేసరికి కుమారస్వామి బైక్‌ను ఆపి కత్తులతో అతన్నిపొడిచి.. హత్య చేసి అక్కడ నుంచి పరారయ్యాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మాలతిపై అనుమానంతో అమె ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. భర్త హత్యను పక్కదారి పట్టించడానికి మాలతి చేసిన ప్రయత్నాన్ని పోలీసులు పసిగట్టారు. తమదైన శైలిలో దర్యాప్తు ప్రారంభించడంతో చివరకు హంతకుడిని పట్టుకున్నారు. ఈ ఘటనలో హేమసుందరరావు, అతని వెంట వచ్చిన మైనర్ బాలుడిని, ప్రధాన సూత్రధారి మాలతిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్టు సీఐ వివరించారు. హత్యకు ఉపయోగించిన కత్తులను పాతపట్నంలో హంతకుడు కొనుగోలు చేసినట్లు సీఐ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment