పోలీసులు అరెస్టు చేసిన నిందితులు..
కుషాయిగూడ(హైదరాబాద్): తమ ప్రేమకు అడ్డు చెప్తున్నాడని ఓ కూతురు ప్రియుడితో కలసి తండ్రిని హత్య చేసింది. కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జూలైలో జరిగిన ఈ ఘటనపై పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పోలీసులు విచారణ జరిపారు. ఈ దర్యాప్తులో అసలు కథ బయటపడింది. ఇన్‌స్పెక్టర్ మన్మోహన్ శుక్రవారం దీనికి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. పల్సం రామకృష్ణ (49) భార్య, కూతురుతో కాప్రాలో నివాసం ఉంటూ స్థానిక గ్యాస్ ఏజెన్సీలో ఉద్యోగం చేస్తున్నారు.
రామకృష్ణ (ఫైల్)
గత జూలై 20న తలకు బలమైన గాయాలతో రామకృష్ణ స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మరో పెద్దాసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు. ఇంట్లో జారిపడి తలకు గాయమైందని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఆ మేరకు కేసు నమోదు చేశారు.
ఆశ్చర్యపర్చిన పోస్టుమార్టం నివేదిక..
అయితే, రామకృష్ణ పోస్టుమార్టం నివేదికలో ఆశ్యర్యపరిచే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. మృతుడి గొంతు నులిమినట్లుగా, బలంగా కొట్టినట్లుగా గాయాలు ఉన్నట్లుగా తేలింది. దీంతో అనుమా నం వచ్చిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించి.. మృతుడి భార్య, కుటుంబసభ్యులను విచారించారు. దీంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. గతంలో నారాయణగూడలోని ఓ అపార్ట్‌మెంట్‌లో వీరు ఉండేవారు. రామకృష్ణ కూతురు (మైనర్ బాలిక) అపార్ట్‌మెంట్ వాచ్‌మన్ కొడుకు చెట్టి భూపాల్ (20)తో ప్రేమలో పడింది.
విషయం తెలిసిన బాలిక తండ్రి పలుమార్లు మందలించారు. ఈ క్రమంలో భూపాల్ ఆ బాలికకు మాయమాటలు చెప్పి.. రామకృష్ణ ఇంట్లో రూ.1.75 లక్షలు చోరీ చేశాడు. ఖరీదైన బైక్, సెల్‌ఫోన్, బట్టలు కొనుక్కొని మైనర్ బాలికతో జల్సాలు చేశాడు. దీనిపై రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు భూపాల్‌ను రిమాండ్ తరలించారు.
కూతురి ప్రేమ వ్యవహారం బయటపడుతుందని...
అనంతరం రామకృష్ణ కాప్రాకు మకాం మార్చాడు. గత జూలైలో జైలు నుంచి విడుదలైన భూపాల్ తిరిగి బాలికతో మాట్లాడటం మొదలుపెట్టాడు. అతడినే పెళ్లి చేసుకోవాలని బాలిక కూడా నిర్ణయించుకుంది. దీంతో తమ ప్రేమకు అడ్డుగా ఉన్న రామకృష్ణను హత్యచేయాలని భావించారు. భూపాల్ తన ఇద్దరు మిత్రులతో కలసి రామకృష్ణ హత్యకు పథకం వేశాడు. తినే ఆహారంలో మత్తు మందు కలిపితే హత్య చేయడం సులువుగా ఉంటుందని ఆలోచించారు.
జూలై 19 సాయంత్రం వీరు మత్తుగోలీల పౌడర్‌ను కూతురుకు అందజేశారు. తల్లిదండ్రులు తినే ఆహారంలో ఆ పౌడర్‌ను ఆమె కలపడంతో వారు నిద్రలోకి వెళ్లిపోయారు. భూపాల్ తన మిత్రులతో రాత్రి ఒంటి గంట సమయంలో కాప్రాకు చేరుకున్నాడు. నిద్రలో ఉన్న రామకృష్ణ ముఖంపై భూపాల్, గణేష్ బ్లాంకెట్ వేసి అదిమిపట్టుకోగా, ప్రశాంత్ కత్తితో తలపై బలంగా పొడిచాడు. నొప్పితో మేల్కొన్న రామకృష్ణను చూసిన నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.
తేరుకున్న కుటుంబసభ్యులు రామకృష్ణను ఆసుపత్రికి తరలించగా మృతిచెందారు. కూతురి ప్రేమ విషయం బయటకు వస్తుందన్న ఆలోచనతో మృతుడి కుటుంబసభ్యులు పోలీసులకు చెప్పకుండా దాచారు. అయితే, పోస్టుమార్టం నివేదికతో దర్యాప్తు జరిపిన పోలీసులు వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చారు. తండ్రి హత్యకు ఫ్లాన్ చేసిన కూతురు, భూపాల్, గణేష్, ప్రశాంత్‌తో పాటుగా ప్రశాంత్‌ను రక్షించాలనే ప్రయత్నం చేసిన అతడి తండ్రి విజయ్‌పాల్‌ను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment