
సాక్షి, విశాఖపట్నం : నర్సీపట్నంలో కలకలం రేగింది. స్థానిక పెద్ద చెరువులో దుప్పటితో కట్టిన మృతదేహాన్ని స్తానికులు మృతదేహాన్ని సోమవారం సాయంత్రం గుర్తించారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే మృతదేహం చెరువులో పడేసి నాలుగు రోజులు అయి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. మృతుడిని నర్సీపట్నంకు చెందిన గారా కిషోర్ గా గుర్తించారు. ఘటనను పరువుహత్యగా భావిస్తున్నారు. కిషోర్ గత కొంతకాలంగా ఓ కానిస్టేబుల్ కుమార్తెను ప్రేమించాడని, ఇది ఇష్టం లేకే పరువుహత్య చేశారని కిషోర్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. రెండేళ్లుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని, అబ్బాయి అడ్డు తొలిగించేందుకే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పట్టణ సీఐ స్వామినాయుడు మాట్లాడుతూ కిషోర్ తల్లిదండ్రులు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.