సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో ఆసక్తికర అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఢిల్లీలో మద్యం వ్యాపారంలో సాధించిన లాభాలతో హైదరాబాద్‌లో భూములు కొనుగోలు చేశారని, ఇందులో సౌత్‌గ్రూపుదే కీలకపాత్ర అని పేర్కొంది. భూముల కొనుగోలు వ్యవహారంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్‌కుమార్ ప్రమేయం ఉందని తెలిపింది. గౌతమ్ మల్హోత్రా, అమన్‌దీప్, మాగుంట రాఘవ, అరుణ్ పిళ్లై వాంగ్మూలాల ఆధారంగా రెండు చార్జిషీట్లను సోమవారం ఈడీ ప్రత్యేక కోర్టుకు సమర్పించింది.
మరిన్ని వివరాలు రాబట్టేందుకు నిందితుల్ని కస్టడీలోకి ఇవ్వాలని ఈడీ కోరింది. రౌజ్ అవెన్యూ ప్రత్యేక కోర్టు జడ్జి ఎంకే నాగ్‌పాల్ ఈడీ చార్జిషీట్లను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ చార్జిషీట్లలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, శరత్‌చంద్రారెడ్డి, కవిత సన్నిహితుడు వి.శ్రీనివాసరావు, ఆంధ్రప్రభ పబ్లికేషన్స్, ఇండియా అహెడ్, ఫీనిక్స్ గ్రూపు, ఎన్‌గ్రోత్ క్యాపిటల్, క్రియేటివ్ డెవలపర్స్ తదితరుల పేర్లను ప్రస్తావించింది. నిందితుల వాంగ్మూలాల ఆధారంగా అసాధారణ అంశాలు వెలుగులోకి వచ్చాయని చెప్పింది.
చార్జిషీటులోని ముఖ్యాంశాలు
ఆప్ నేతలకు సౌత్‌గ్రూపు రూ.100 కోట్లు హవాలా రూపంలో ముడుపులిచ్చింది. తద్వారా మద్యం విధానం తమకు అనుకూలంగా ఉండేలా చూసుకుంది.
► అరుణ్‌పిళ్‌లైకి క్రియేటివ్ డెవలపర్స్ భాగస్వాములు, రవిశంకర్ చెట్టి రూ.5 కోట్లకు హైదరాబాద్‌లో భూమి అమ్మారన్న ఆరోపణలున్నా వారెవరూ అరుణ్‌పిళ్‌లైను కలవలేదు. ఈ ఒప్పందాన్ని ఫీనిక్స్ రియల్ ఎస్టేట్ గ్రూప్‌నకు చెందిన శ్రీహరి చర్చలు జరిపి ఖరారు చేశారు. భూమి కొనుగోలు నిమిత్తం సంస్థకు ఒకరు డబ్బులు బదిలీ చేస్తారని చెప్పిన శ్రీహరి.. ఎవరు డబ్బులు బదిలీ చేశారనేది రవిశంకర్ చెట్టికి చెప్పలేదు. అయితే, ఎన్‌గ్రోత్ కాపిటల్ పేరుతో ఫీనిక్స్ గ్రూపునకు చెందిన శ్రీహరి ఆ భూమిని కొనుగోలు చేసినట్లు బుచ్చిబాబు తన వాంగ్మూలంలో చెప్పారు.
ఆ సమయంలో ఫీనిక్స్ గ్రూపునకు సీవోవోగా శ్రీహరి ఉన్నారు. దీంట్లో కవిత భర్త అనిల్‌కుమార్ కూడా భాగస్వామి. కవిత తెలంగాణలో పెద్ద రాజకీయ నాయకురాలు కావడంతో మార్కెట్ రేటు కంటే తక్కువకే భూమి కొనుగోలు చేశారు. దీంతోపాటు కవిత మరో ప్రాపర్టీ కూడా కొనుగోలు చేశారు. 25వేల చదరపు అడుగుల ప్రాపర్టీకి సంబంధించిన పేపర్ వర్క్‌ను బుచ్చిబాబు, శ్రీహరి పూర్తిచేశారు.
మార్కెట్ ధర చదరపు అడుగు రూ.1,760 ఉంటే రూ.1,260 మాత్రమే చెల్లించారు. కవితతో గణనీయమైన ఆర్థిక లావాదేవీలున్న వ్యక్తి రవిశంకర్‌తో భూమి కొనుగోలుకు చర్చలు జరిపినట్లు నిర్ధారణకు వచ్చాం. ఇండోస్పిరిట్స్‌లో కవిత తరఫున అరుణ్ పిళ్‌లై ప్రతినిధిగా వ్యవహరించి రూ.32.86 కోట్లు అందుకున్నారు. పిళ్‌లై సూచన మేరకు రూ.25.5 కోట్లు నేరుగా ఇండోస్పిరిట్స్ నుంచి పిళ్‌లై ఖాతాకు బదిలీ అయ్యాయి.
► ఢిల్లీ ఎయిర్‌పోర్టులో మద్యం దుకాణం నిమిత్తం ఎన్‌వోసీ కోసం జీఎంఆర్ గ్రూపునకు చెందిన బీవీ నాగేశ్వరరావుతో మాగుంట రాఘవ, ఎంపీ ఎంస్ రెడ్డి చర్చలు జరిపారు. ఎంఎస్ రెడ్డి వాట్సాప్ సందేశాల ద్వారా ఇది వెల్లడైంది. వ్యాపారంలో భాగస్వాములై ఎన్‌వోసీ ఇవ్వాలని జీఎంఆర్‌ను కోరినట్లు తేలింది. ఇండోస్పిరిట్స్‌లో అరుణ్ పిళ్‌లై ప్రాక్సీ భాగస్వామి. ఇండోస్పిరిట్స్ నుంచి లాభాలు తన నుంచి కవితకు చేరడంపై అరుణ్‌పిళ్‌లై సేట్‌మెంట్ల ద్వారా వెల్లడైంది.
► ఏప్రిల్ 2022లో ఢిల్లీలోని ఓ హోటల్లో విజయ్‌నాయర్‌తో కవిత, అరుణ్‌పిళ్‌లై సమావేశమయ్యారు. వ్యాపార కార్యకలాపాలు కుంటుపడుతున్న నేపథ్యంలో చెల్లించాల్సిన లంచాలు రికవరీ చేయడంపై చర్చించారు. హోటల్ రికార్డుల దీన్ని ధ్రువీకరించుకున్నాం. దినేష్ ఆరోరా, అరుణ్‌పిళ్‌లై వాంగ్మూలాలు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి.
► కిక్‌బ్యాక్‌ల రూపంలో సొమ్ములు వెనక్కి మళ్లించే పనులను అభిషేక్ బోయినపల్లి, అరుణ్ పిళ్‌లై నిర్వహించినట్లు ఆడిటర్ బుచ్చిబాబు వాంగ్మూలమిచ్చారు. సౌత్‌గ్రూప్ నుంచి కిక్‌బ్యాక్‌లను విజయనాయర్ అందుకుంటున్నారన్నారు. విజయ్‌నాయర్‌కు డబ్బు అవసరమని బుచ్చిబాబు ఫోను నంబర్ల ద్వారా చేసిన వాట్సాప్ సందేశాల ద్వారా ధ్రువీకరణ అయింది. దీంట్లో ‘వీ’కి డబ్బు కావాలి అంటే విజయ్‌నాయర్‌కు డబ్బు అవసరమని అర్థమని బుచ్చిబాబు తెలిపారు.
► ఢిల్లీ, హైదరాబాద్ హోటళ్లలో జరిగిన సమావేశాల్లో సౌత్‌గ్రూపు నుంచి విజయ్‌నాయర్‌కు డబ్బులు పంపడంపై ప్రధానంగా చర్చ జరిగినట్లు కూడా బుచ్చిబాబు తెలిపారు. క్రియేటివ్ డెవలపర్స్ ఖాతాకు డబ్బు మళ్లించడం కూడా బుచ్చిబాబు నోట్స్ ద్వారా తెలిసింది. కవిత తరఫున ఇండోస్పిరిట్స్ నుంచి వచ్చిన లాభాలను అరుణ్ పిళ్‌లై అందుకొని ఆమె ఆదేశాల మేరకు పెట్టుబడులు పెట్టాల్సి ఉందని ధ్రువీకరణ అయింది.
భూముల కొనుగోలులో శ్రీహరి సూచనల మేరకు కవిత తరఫున సొమ్ములు బదిలీ చేయడం వరకే పిళ్‌లై పాత్ర పరిమితమని తేలింది. అయితే, మే 2022 నుంచి రిజిస్టర్ కాకుండా ఉన్న భూమి 11.10.22న అరుణ్‌పిళ్‌లై భార్య పేరు మీద రిజిస్టర్ కావడం అరుణ్‌పిళ్‌లై ప్రయోజనం కోసమేనని, కవితకు లాభదాయకం కాదని దర్యాప్తులో తేలింది. అరుణ్‌పిళ్‌లై ఆదేశాల మేరకే ఇండో స్పిరిట్స్ నుంచి ఆంధ్రప్రభ పబ్లికేషన్స్, ఇండియా అహెడ్‌లకు రూ.కోటి, రూ.70 లక్షలు బదిలీ చేసినట్లు సమీర్ మహేంద్రు తెలిపారు.
దీనికి మద్దతుగా ఎలాంటి రికార్డు లేదు. అయితే, అరుణ్ పిళ్‌లై చెప్పినట్లుగా ఈ సంస్థలు ఇండో స్పిరిట్స్ లేదా అరుణ్ పిళ్‌లైకి ఎలాంటి ఈవెంట్ నిర్వహించలేదు. ఆయా సంస్థలకు ఇచ్చిన సొమ్ము ఇప్పటివరకూ వెనక్కి ఇవ్వలేదు. గౌతమ్ ముత్తాకు అరుణ్‌పిళ్‌లై బదిలీ చేసిన రూ.4.76 కోట్లు, అభిషేక్‌కు రూ.3.85 కోట్లు బదిలీ రుణం తిరిగి ఇవ్వమని చెప్పినప్పటికీ కాలక్రమేణా ఎలాంటి రుణం లేదని పిళ్‌లై పేర్కొన్నారు.
ఢిల్లీలో వ్యాపారం..హైదరాబాద్‌లో ఆస్తులు
Published Tue, May 2 2023 5:26 AM | Last Updated on Tue, May 2 2023 10:07 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment