
ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ: జ్ఞాపకశక్తి పెంచే ఇంజక్షన్ అంటూ విద్యార్థులను, తల్లిదండ్రులను మోసం చేసిన ఓ ట్యూటర్‌ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. ఢిల్లీ మండవాలి పోలీస్ స్టేషన్ పరిధిలో సందీప్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. బీఏ రెండో సంవత్సరం చదువుతోన్న సందీప్ పాకెట్ మనీ కోసం చుట్టుపక్కల ఉన్న విద్యార్థులకు ట్యూషన్ చెప్పేవాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం సందీప్ తన దగ్గర జ్ఞాపకశక్తి పెరిగే ఇంజక్షన్ ఉందని.. అది తీసుకుంటే.. విద్యార్థుల మెమరీ పవర్ చాలా బాగా వృద్ధి చెందుతుందని నమ్మించాడు. అతడి మాటలు నమ్మిన విద్యార్థులు ఆ ఇంజక్షన్‌ను తీసుకునేందుకు ఎగబడ్డారు.
ఈ క్రమంలో ఓ విద్యార్థి తల్లిదండ్రులకు దీని గురించి తెలిసింది. అసలు జ్ఞాపకశక్తి పెంచే ఇంజక్షన్ ఏంటి అంటూ వారు సందీప్‌ని ఆరా తీశారు. అతడు సెలైన్ వాటర్‌ని విద్యార్థులకు ఇస్తే.. అది వారి జ్ఞాపకశక్తిని పెంచుతుందని తెలిపాడు. ఈ విషయాన్ని తాను యూట్యూబ్‌లో చూశానని.. అందుకే విద్యార్థుల జ్ఞాపకశక్తిని పెంచడానికి తాను సెలైన్‌ని ఇచ్చానని వెల్లడించాడు. దీని గురించి విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సందీప్‌పై కేసు నమోదు చేసి.. అతడిని అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment