నెలన్నర క్రితం భార్యాబిడ్డలను చంపేసిన డాక్టర్
ఆపై కారు చెట్టును ఢీకొన్నట్లుగా చిత్రీకరణ
పోలీసుల విచారణలో తేలిన నిజాలు
రఘునాథపాలెం: ఓ యువతితో కొనసాగిస్తున్న వివాహేతర సంబంధానికి భార్య, ఇద్దరు కుమార్తెలు అడ్డుగా ఉన్నారని భావించిన డాక్టర్.. తనకు ఉన్న విషయ, వైద్య పరిజ్ఞానంతో ముగ్గురినీ మట్టుబెట్టాడు. భార్య అనారోగ్యంతో ఉందని చెప్పడంతో చికిత్స పేరిట అధిక మోతాదులో మత్తు మందు ఇచ్చిన ఆ దుర్మార్గుడు ..ఆపై ఇద్దరు చిన్నారుల ముక్కు, నోరు మూసి చంపేశాడు.
రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని అందరినీ నమ్మించే యత్నం చేసినా పోలీసులు సాంకేతిక ఆధారాలతో విచారణ చేపట్టి నిందితుడిని ఆదివారం అరెస్ట్ చేశారు. ఈమేరకు వివరాలను రఘునాథపాలెం పోలీసు స్టేషన్‌లో ఖమ్మం ఏసీపీ రమణమూర్తి, సీఐ శ్రీహరి, ఎస్‌ఐ రాము వెల్లడించారు.
హైదరాబాద్‌లో డాక్టర్... నర్స్‌తో సంబంధం
రఘునాథపాలెం మండలం బావోజితండాకు చెందిన బోడా ప్రవీణ్ హైదరాబాద్‌లో ఫిజియోథెరపీ డాక్టర్‌గా పని చేస్తున్నాడు. భార్య కుమారితో పాటు నాలుగేళ్ల లోపు కుమార్తెలు క్రుషిక, కృతిక ఉన్నారు. అతను పనిచేసే ఆస్పత్రిలోనే కేరళ కు చెందిన నర్స్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది.
ఈ విషయం భార్య కుమారికి తెలియడంతో నిలదీస్తూ వచ్చి0ది. ప్రవీణ్ తల్లితండ్రులు, కుమారి తల్లితండ్రులు హైదరాబాద్‌కు వెళ్లి ఇరువురికీ పలుమార్లు నచ్చచెప్పారు. హైదరాబాద్ వదిలేసి వైద్య వృత్తిని ఖమ్మంలోనే కొనసాగించాలని అతని తల్లిదండ్రులు సూచించారు. అయితే ఇవేమీ పట్టని ప్రవీణ్ భార్యాబిడ్డలను ఎలాగైనా మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈక్రమంలోనే భార్యాపిల్లలను తీసుకుని స్వగ్రామమైన బావోజీ తండాకు మే నెల రెండో వారంలో వచ్చాడు.
కలిసొచ్చిన భార్య అనారోగ్యం..
స్వగ్రామానికి వచ్చాక కుమారికి ఒంట్లో నలతగా ఉందని చెప్పడంతో అదును కోసం చూస్తున్న ప్రవీణ్‌కు కలిసొచ్చినట్లయింది. ఆమెకు చికిత్స పేరిట మే 27న ఇంజక్షన్ వేశాడు. ఆ తర్వాత ఆధార్ కార్డులో తప్పులు సరిదిద్దేందుకు కారులో వెళ్లి వస్తుండగా 28న కూడా ఆమె ఒంట్లో సుస్తీగా ఉందనడంతో చికిత్స కోసం వేస్తున్న ఇంజక్షన్‌తో పాటు అప్పటికే కారులో దాచిన మత్తు మందు హైడోస్ కలిపి ఇచ్చాడు. దీంతో ఆమె స్పృహ కోల్పోయి కన్నుమూసింది.
కాగా, తల్లికి ఇంజక్షన్ వేసిన విషయాన్ని పిల్లలు చూడడంతో వారి ముక్కు, గొంతు మూసి హత్య చేశాడు. ముగ్గురూ చనిపోయారని నిర్ధారించుకున్న ప్రవీణ్ కారును తీసుకెళ్లి రోడ్డు పక్కన చెట్టుకు ఢీకొట్టి ప్రమాదంలో చనిపోయినట్లుగా చిత్రీకరించాడు.
బంధువులు నమ్మకపోవడంతో...
కారు చెట్టును ఢీకొట్టిన ఘటనలో ప్రవీణ్‌కు స్వల్పగాయాలే కావడంతో అక్కడి నుంచి హాస్పిటల్‌కు తరలించారు. అయితే, ఘటనాస్థలికి చేరుకున్న కుమారి తల్లిదండ్రులు, బంధువులు మాత్రం తమ అల్లుడి వ్యవహార శైలి తెలియడంతో అతనే చంపేశాడని అనుమానిస్తూ ఆందోళన చేయడమే కాక పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించారు. ఘటన తర్వాత అంత్యక్రియలకు హాజరైన ప్రవీణ్ ఆ తర్వాత ముఖం చాటేయడం ఈ ఆరోపణలకు బలం చేకూర్చింది.
గూగుల్ హిస్టరీతో బయటపడిన నిర్వాకం
ఘటనపై తొలుత రోడ్డు ప్రమాదంగా కేసు నమోదు చేసిన పోలీసులు మృతుల ఒంటిపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో పోస్టుమార్టం వచ్చేవరకు వేచిచూశారు. అందులో కుమారి శరీరంలో మత్తు మందు అధికంగా ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆపై కారులో ప్రవీణ్ ఉపయోగించిన ఇంజక్షన్ నీడిల్ లభించగా మత్తుమందు ఆనవాళ్లు కనిపించాయి. ఏ మత్తు మందు వాడితే శరీరంపై ఎంతసేపు ప్రభావం ఉంటుందనే వివరాలను ప్రవీణ్ గూగుల్‌లో వెతికినట్లు హిస్టరీ ద్వారా గుర్తించారు.
ఈమేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా ముగ్గురిని హత్య చేసినట్లుగా ఒప్పుకున్నట్లు ఏసీపీ రమణమూర్తి తెలిపారు. ప్రవీణ్‌తో పాటు హత్యకు ప్రేరేపించిన అతని ప్రియురాలు సోనీ ఫ్రాన్సిపైనా కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. కేసు విచారణలో కీలకంగా వ్యవహరించిన రఘునాథపాలెం సీఐ శ్రీహరి, ఎస్సై సురేశ్, సిబ్బందిని అభినందించిన ఏసీపీ రివార్డుకు ప్రతిపాదించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment