‘రూ.31 లక్షలకే అల్లావుద్దీన్‌ అద్భుత దీపం’ | UP Doctor Buy Allavuddin Lamp By 31 Lakh Rupees | Sakshi
Sakshi News home page

మీరట్‌ వైద్యుడిని బురిడీ కొట్టించిన నిందితులు

Published Sat, Oct 31 2020 1:15 PM | Last Updated on Sat, Oct 31 2020 2:36 PM

UP Doctor Buy Allavuddin Lamp By 31 Lakh Rupees - Sakshi

లక్నో: పిల్లలు నుంచి పెద్దల వరకు అల్లావుద్దీన్‌ అద్భుత దీపం గురించి తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ప్రసిద్ధ మధ్య ప్రాచ్య జానపద కథల నుంచి వచ్చిన మాయా కళా ఖండం ఇది. ఈ దీపాన్ని రుద్దితో అందులో నుంచి ‘జీనీ’ బయటకు వస్తాడు. మనం కోరిన కోరికలు తీరుస్తాడు. ఇదంతా కేవలం కథల్లోనే జరుగుతుంది. నిజంగా అలాంటి మాయా దీపాలు ఉండవు. ఒకవేళ ఉంటాయని నమ్మితే ఈ డాక్టర్‌ మాదిరిగానే భారీగా నష్టపోవాల్సి వస్తుంది. ఉత్తరప్రదేశ్ మీరట్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు అల్లావుద్దీన్‌ దీపాన్ని పోలిన వస్తువును ఒక దాన్ని డాక్టర్‌కు ఏకంగా 31 లక్షల రూపాయలకు అమ్మారు. డాక్టర్‌ని బురిడీ కొట్టించడం కోసం ఏకంగా అల్లావుద్దీన్‌నే రంగంలోకి దించారు. దాంతో వారి మాటలు నమ్మిన డాక్టర్‌ 31 లక్షల రూపాయలు చెల్లించి నిట్ట నిలువునా మునిగాడు. 

వివరాలు.. డాక్టర్‌ ఎల్ఏ ఖాన్‌కు ఇక్రముద్దీన్‌, అనీన్‌ అనే ఇద్దరు వ్యక్తులు పరిచయం అయ్యారు. తమ తల్లికి ఆరోగ్యం బాగాలేదు.. ఇంటికి వచ్చి చూడాల్సిందిగా ఖాన్‌ను కోరారు. దాంతో వారి ఇంటికి వెళ్లి అనారోగ్య తల్లిగా వర్ణించిన స్త్రీకి చికిత్స చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలో నిందితులిద్దరు డాక్టర్‌తో పరిచయం పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో నిందితులిద్దరు ఓ బాబా గురించి డాక్టర్‌కు చెప్పారు. ఒకసారి ఆయన వారి ఇంటికి కూడా వచ్చినట్లు తెలిపారు. ఆయనకు ఎన్నో అతీత శక్తులున్నాయని.. బాబాను కలవాల్సిందిగా డాక్టర్‌కు బ్రెయిన్‌ వాష్‌ చేశారు. దాంతో డాక్టర్‌ సదరు బాబాని కలుసుకున్నాడు. ఈ నేపథ్యంలో వీరు ముగ్గురు కలిసి తమ దగ్గర అల్లావుద్దీన్‌ అద్భుత దీపం ఉందని.. దాంతో సంపద, ఆరోగ్యం, అందం లభిస్తాయని తెలిపారు. కోటిన్నర రూపాయలకు అమ్ముతామని డాక్టర్‌కు తెలిపారు. అయితే వైద్యుడు మొదట ఈ మాటలు నమ్మలేదు. (చదవండి: సైకో డాక్టర్‌.. భార్య కాపురానికి రాలేదని..)

దాంతో వారు ఒకసారి ఏకంగా ‘అల్లావుద్దీన్’‌ ఇతడే అంటూ ఓ వ్యక్తిని డాక్టర్‌ ముందు ప్రవేశపెట్టారు. దాంతో నిజమేనని నమ్మిన డాక్టర్‌ ఆ దీపాన్ని తనకు అమ్మాల్సిందిగా కోరాడు. అయితే వారు చెప్పినట్లు కోటిన్నర రూపాయలు ఇవ్వలేనని.. 31 లక్షల రూపాయలు చెల్లించగలనని తెలిపాడు. నిందితులు ఆ మొత్తం తీసుకుని ‘అల్లావుద్దీన్‌ దీపం’ అని పిలవబడే వస్తువును డాక్టర్‌కి ఇచ్చారు. ఇంటికి వెళ్లి దాన్ని పరీక్షించిన ఖాన్‌ అది డమ్మీదని తెలిసి ఒక్కసారి షాక్‌కు గురయ్యాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఖాన్‌ కంప్లైంట్‌ మేరకు పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా మీరట్‌ సీనియర్‌ అధికారి అమిత్‌ రాయ్‌ మాట్లాడుతూ.. ఈ గ్యాంగ్‌ తంత్ర విద్యల పేరు చెప్పి నగరంలో ఇప్పటికే చాలా మందిని మోసం చేశారు. దీనిలో ముగ్గురి ప్రమేయం ఉన్నట్లు తెలిసింది. ఇద్దరిని అరెస్ట్‌ చేశాం. ఒక మహిళ పరారీలో ఉంది అని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement