డాక్టర్ చంద్రశేఖర్(ఫైల్)
కేపీహెచ్‌బీకాలనీ(హైదరాబాద్)/మెదక్ జోన్: బీజేపీ నేత కటికె శ్రీనివాస్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పిల్లల వైద్యుడు హైదరాబాద్ కేపీహెచ్‌బీకాలనీలోని హోటల్ గదిలో ఆదివారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కుమారుడి నీట్ పరీక్ష కోసం ఇక్కడికి భార్యతో కలసి వచ్చి హోటల్‌లో దిగారు. ఆదివారం ఉదయం కొడుకును నిజాంపేటలోని పరీక్షా కేంద్రం వద్ద దింపారు. భార్యను తిరిగి మెదక్‌లోని ఆసుపత్రికి పంపి హోటల్ గదికి వచ్చి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
కేపీహెచ్‌బీ సీఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ వైద్యుడు చంద్రశేఖర్ (50) ఆదివారం ఉదయం భార్య డాక్టర్ అనురాధ, కొడుకు సాయివెంకట రామకృష్ణప్పలతో కలసి కేపీహెచ్‌బీ కాలనీలోని సితార గ్రాండ్ హోటల్‌కు వచ్చారు. నిజాంపేట్‌లోని పరీక్ష కేంద్రంలో కొడుకు పరీక్ష రాసి.. తిరిగి వచ్చేవరకు వేచి ఉండటం కోసం ఉదయం 8 గంటలకు హోటల్‌లో గదిని అద్దెకు తీసుకున్నారు. 9 గంటలకు కొడుకును పరీక్షా కేంద్రం వద్ద వదిలిపెట్టారు. అనురాధను మెదక్‌లోని ఆసుపత్రిలో రోగులను చూసేందుకు పంపించి.. 11 గంటల ప్రాంతంలో హోటల్ గదికి తిరిగి వచ్చారు.
మధ్యాహ్నం 2.30 గం. సమయంలో అనురాధ.. చంద్రశేఖర్‌కు పలుమార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు. దీంతో హోటల్‌కు ఫోన్ చేసి ఆ గదికి వెళ్లి చూడాలని కోరారు. హోటల్ సిబ్బంది వెళ్లి కిటికీ ద్వారా గదిలోకి చూడగా చంద్రశేఖర్ సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని కనిపించారు. విషయాన్ని పోలీసులకు తెలప డంతో వారు హోటల్ గది తలుపులు తెరిచి మృతదేహాన్ని కిందకు దించి పోస్ట్‌మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదు. అనురాధ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఇదిలాఉండగా, గత నెల 9న మెదక్ జిల్లా మంగళపర్తి గ్రామ శివారులో కారులో హత్యకు గురైన బీజేపీ నేత కటికె శ్రీనివాస్ హత్యకేసులో చంద్రశేఖర్ ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఈ నేపథ్యం లోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. అయితే శ్రీనివాస్ హత్యతో డాక్టర్‌కు ఎలాంటి సంబంధం లేదని తూప్రాన్ డీఎస్పీ తెలిపారు. చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకునే ఇక్కడకు వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఉరివేసుకునేందుకు నైలాన్ తాడు వాడటంతోపాటు హోటల్ గదిలో నిద్రమాత్రలు, సర్జికల్ బ్లేడ్లు లభించడంతో ఈ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్నారా, లేకపోతే ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా అన్న సందేహం వ్యక్తమవుతోంది. ఒంటిపై దుస్తులు ఎందుకు లేవనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కర్ణాటక నుంచి వచ్చి....
చంద్రశేఖర్ స్వస్థలం కర్ణాటక కాగా, ఇరవై ఏళ్ల క్రితం మెదక్ వచ్చి అజంపులలో వైద్యవృత్తిలో స్థిరపడ్డారు. అనురాధ కూడా ప్రముఖ గైనకాలజిస్టు. ఆమె పేరుతోనే అనురాధ నర్సింగ్‌హోం నెలకొల్పారు. ఇద్దరూ మంచి డాక్టర్లుగా పేరు సంపాదించారు. కొంపెల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలోనూ భాగస్వామ్యం ఉంది. కాగా, మెదక్ జిల్లాలో ఏ స్థిరాస్తి కొనాలన్నా చంద్రశేఖర్ ముందుండేవారన్న పేరుంది.
అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం..
చంద్రశేఖర్ మృతిపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నాం. గదిలో 140 నుంచి 150 వరకు నిద్ర మాత్రలున్నాయి. మూడు సర్జికల్ బ్లేడ్లు కూడా లభించాయి. ఆయనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయన్న భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నాం. ఈ ఆత్మహత్య వెనుక ఇతర కారణాలున్నాయా? అనేది ఆరా తీస్తున్నాం. వెల్దుర్తి పరిధిలో నమోదైన శ్రీనివాస్ హత్య కేసులో చంద్రశేఖర్‌ను పోలీసులు పిలిచి విచారించారు.
– ఆకుల చంద్రశేఖర్, కూకట్‌పల్లి ఏసీపీ
Comments
Please login to add a commentAdd a comment