సాక్షి, హైదరాబాద్: లిక్కర్ స్కామ్ మొత్తం హైదరాబాద్ నుంచే జరిగినట్టు సీబీఐకి స్పష్టమైన ఆధారాలు లభించడంతో, మనీలాండరింగ్ సైతం ఇక్కడినుంచే జరిగినట్టు భావిస్తున్న ఈడీ విచారణ వేగవంతం చేసింది. హైదరాబాద్ లింకులను ఛేదించే పనిలో పడింది. మొదట్లో అరుణ్ రామచంద్రన్ పిళ్లై వరకే ఉందని భావించినా..తర్వాత బోయినిపల్లి అభిషేక్ రావు, గండ్ర ప్రేమ్‌సాగర్‌రావు పేర్లు వెలుగులోకి వచ్చాయి.
ఆ తర్వాత ఆడిటర్ బుచ్చిబాబు పేరుతో పాటు రాబిన్ డిస్టిలరీ, మరో ఎనిమిది కంపెనీలు కూడా తెరపైకి వచ్చాయి. ఈ మేరకు దర్యాప్తు, సోదాలు కొనసాగిస్తున్న ఈడీ బృందాలు సోమవారం వెన్నమనేని శ్రీనివాసరావును అదుపులోకి తీసుకుని సుదీర్ఘంగా విచారించడం కేసులో పెద్ద మలుపు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజా పరిణామాలతో ఈ కేసులో పాత్ర ఉన్నట్టుగా అనుమానిస్తున్న ప్రముఖులు ఆందోళనకు గురవుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు వెన్నమనేని శ్రీనివాసరావు విచా రణలో మరో కొత్త పేరు వెలుగులోకి వచ్చినట్టు తెలిసింది.
దగ్గరి బంధువుకు లింకులు
ఇరవై ఏళ్లుగా లిక్కర్, పబ్‌ల వ్యాపారాల్లో ఉన్న శ్రీనివాసరావు దగ్గరి బంధువుకు ఈ స్కామ్‌లో లింకులున్నట్టుగా ఈడీ అనుమానిస్తోంది. ఆ వ్యక్తికి శ్రీనివాసరావు బినామీగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలూ విన్పిస్తున్నాయి. దీంతో ఆ వ్యక్తి ఎవరో అన్న చర్చ మొదలైంది. ఢిల్లీలో లిక్కర్ మార్టుల ఏర్పాటులో ఆయన హస్తం కూడా ఉందా? ఆయనకు సంబంధించిన డబ్బు ఏమైనా శ్రీనివాసరావు ద్వారా ఢిల్లీ వెళ్లిందా అన్న కోణంలో ఈడీ విచారిస్తున్నట్టు తెలుస్తోంది.
మరిన్ని సోదాలు, నోటీసులు?
ఇప్పటివరకు నాలుగు సార్లు జరిపిన సోదాలు, విచారణలు, స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంగా మరికొంత మంది కీలక వ్యాపారులు, నేతల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించాలని ఈడీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. పెన్‌డ్రైవ్‌లు, మెయిల్స్, సిగ్నల్.. వాట్సాప్ యాప్‌ల నుంచి రిట్రీవ్ చేసిన సందేశాలను పూర్తి స్థాయిలో విశ్లేషించి పలువురికి నోటీసులు జారీ చేయనున్నట్టు తెలిసింది. దీంతో ఈ స్కామ్ ఎటు తిరిగి ఎవరికి చుట్టుకుంటుందోనన్న జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment