సాక్షి, తాడేపల్లిగూడెం: మెకానికల్ ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య పశ్చిమగోదావరి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. జిల్లాలోని తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లిలో గల ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో గత నెల 18న అల్లంశెట్టి రవితేజ (19) మెకానికల్ ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరంలో చేరాడు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం కేశవరాయునిపాలేనికి చెందిన రవితేజ టెక్కలిలో డిప్లొమా పూర్తి చేశాడు. ఇటీవల సంక్రాంతి పండుగ సెలవులకు ఇంటికి వెళ్లిన రవితేజ వారం రోజుల క్రితం కళాశాలకు వచ్చాడు. అప్పటి నుంచి ఎలాంటి బాధా లేకుండా చనిపోవడం ఎలా అంటూ సహచర విద్యార్థులతో చర్చించాడు.
సోమవారం ఉదయం నలతగా ఉండటంతో తల్లి అనుమతి మేరకు కళాశాల హాస్టల్‌లోనే ఉండిపోయాడు. అదే రూమ్‌లో ఉంటున్న నితిన్, వీరాస్వామి తమ రోజువారీ తరగతులకు హాజరయ్యారు. మధ్యాహ్నం 11.50 గంటల ప్రాంతంలో సహచర మిత్రుడు వీరాస్వామితో పాటు మరో నలుగురి సెల్‌ఫోన్‌లకు ‘మీకు సర్‌ప్రైజ్ ఇస్తున్నా.. నేను చనిపోవాలనుకుంటున్నా..’ అంటూ టెక్ట్స్ మెసేజ్‌ను రవితేజ పోస్టు చేశాడు. దీంతో వీరాస్వామి అతని తల్లికి ఫోన్‌చేసి మాట్లాడగా, సెలవు పెట్టి రూమ్‌లోనే ఉన్నాడని చెప్పారు. అనంతరం సహచర విద్యార్థులు, సీనియర్లతో కలిసి రవితేజ ఉన్న రూమ్ వద్దకు వెళ్లి చూశారు.
చదవండి: (‘నాన్న, చెల్లి శ్రావణి నన్ను క్షమించండి.. భరించడం నా వల్ల అవ్వట్లేదు’)
రెండు వైపులా తలుపులు వేసి ఉండటంతో విద్యార్థులు రూమ్ బద్దలుకొట్టి లోనికి ప్రవేశించారు. అప్పటికే ఫ్యాన్‌కు నైలాన్ తాడుతో ఉరివేసుకుని వేలాడుతున్న రవితేజను సహచర విద్యార్థులు, సిబ్బంది సహకారంతో తాడేపల్లిగూడెంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న తాడేపల్లిగూడెం రూరల్ సీఐ వి.రవికుమార్, ఎస్సై ఎన్.శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై సహచర విద్యార్థులు స్పందిస్తూ బాధ లేకుండా చనిపోవడం ఎలా అనే విషయమై చర్చిస్తే తాము సాధారణంగా తీసుకున్నామని, ఇలా ప్రాణాలు తీసుకుంటాడనుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కేశవరాయునిపాలెంలో విషాదం
►గుండెలవిసేలా రోదించిన తల్లిదండ్రులు
లావేరు: కేశవరాయునిపాలెం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. గ్రామానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి అల్లంశెట్టి రవితేజ (19) పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడేంలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలో సోమవారం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు అక్కడ నుంచి సమాచారం రావడంతో స్వగ్రామంలో విషాదం నెలకొంది.
చదవండి: (ఒకరు బీటెక్, మరొకరు బీఎస్సీ.. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్.. ఏ కష్టమొచ్చిందో.!)
కుటుంబ నేపథ్యం..
రేషన్ డిపో డీలరైన అల్లంశెట్టి సూరిబాబు, రాణిప్రమీల దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సాయితేజ రాజాంలోని జీఎంఆర్ కళాశాలలో బీటెక్ ఫైనలియర్ చదువుతుండగా.. చిన్న కుమారుడైన రవితేజ తాడేపల్లిగూడేంలోని ఇంజినీరింగ్ కాలేజీలో మెకానికల్ ద్వితీయ సంవత్సరం చదువుతూ అక్కడే వసతి గృహంలో ఉంటున్నాడు. సంక్రాంతి పండగకు స్వగ్రామానికి వచ్చిన రవితేజ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులుతో సరదాగా గడిపి.. తిరిగి జనవరి 18వ తేదీన తాడేపల్లిగూడేం వెళ్లిపోయాడు. రోజూ రెండుసార్లు తమకు ఫోన్ చేసి సరదాగా మాట్లాడేవాడని తల్లిదండ్రులు చెబుతున్నారు. సోమవారం ఉదయం తల్లి రాణిప్రమీలకు ఫోన్ చేసి ఒంట్లో నీరసంగా ఉందని కాలేజీకి వెళ్లకుండా హాస్టల్‌లోనే ఉండిపోతున్నానని రవితేజ చెప్పాడు.
మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో కాలేజీ యాజమాన్యం నుంచి రవితేజ ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని తల్లి రాణిప్రమీలాకు ఫోన్ వచ్చింది. దీంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా స్పృహ కోల్పోయారు. కొద్దిసేపటి తరువాత కోలుకున్న తల్లిదండ్రులు సూరిబాబు, రాణీప్రమీల, కుటుంబ సభ్యులు, కొందరు గ్రామస్తులు బయలుదేరి తాడేపల్లిగూడేం వెళ్లారు. చిన్నతనం నుంచి రవితేజ బాగా చదివేవాడని స్థానికులు చెబుతున్నారు. అందరితో ఎంతో సన్నిహితంగా ఉండేవాడంటున్నారు. లావేరు మండల వైస్ ఎంపీపీ అలుపున రమణమ్మ, వైఎస్సార్‌సీపీ నాయకులు నాయని మోహనరెడ్డి, శ్రీనివాసరెడ్డి, అలుపున గోవిందరెడ్డి, సర్పంచ్ యాగాటి ఆదినారాయణ, మాజీ సర్పంచ్ నాయని వెంకటేష్ తదితరులు మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment