సాక్షి, ఖమ్మం: కష్టసుఖాల్లో కడదాకా కలిసి ఉంటామని అగ్నిసాక్షిగా చేసే ప్రమాణం బీటలు వారుతోంది. జీవితకాలం ఒకరికి ఒకరు తోడు ఉంటామని మొదలుపెట్టే ప్రయాణం మధ్యలో నే ఆగిపోతోంది. వేదమంత్రాలు, బంధుమిత్రుల నడుమ ఒక్కటవుతున్న కొందరు తప్పటడుగులు వేస్తూ కటకటాల పాలవుతున్నారు. ఎంతో పవిత్రమైనదిగా భావించే వివాహబంధం.. తాత్కాలిక సుఖాల కోసం పక్కదారి పడుతోంది. అక్రమ సంబంధాల పేరిట అప్పటివరకు కష్ట్టసుఖాల్లో భర్తకు తోడుగా నిలుస్తున్న కొందరు మహిళలే హత్యకు వెనుకాడకపోవడం గమనార్హం. అయితే, ఇటీవల కాలంలో జిల్లాలో ఇలాంటి ఘటనలు వరుసగా చోటు చేసుకుంటుండడం ఆందోళన కలిగిస్తోంది.
ఉసురు తీస్తున్న వివాహేతర సంబంధాలు
కలిసిమెలిసి పిల్లాపాపలతో సంతోషంగా జీవించే భార్యాభర్తల నడుమ అక్రమ సంబంధాలు చిచ్చుపెడుతున్నాయి. పచ్చగా సాగుతున్న కాపురాల్లోకి ప్రవేశిస్తున్న కొందరు మాయమాటలు చెప్పో.. తాత్కాలిక వ్యామోహం ఎర చూపో లోబర్చుకుంటున్నారు. నిజం ఎన్నాళ్లో దాగదన్నట్లుగా భార్య వ్యవహారం భర్తకు తెలియగానే ప్రియుడితో కలిసి హత్యకు సిద్ధమవుతున్నారు. లేనిపోని ఆకర్షణలకు లోనై, అర్థం లేని కోరికలు, ఆడంబరాలకు పోయి కొత్త పరిచయాలకు ఆకర్షితులవుతుండగా, చివరకు హత్య చేసేందుకు కూడా వెనుకాడడం లేదు. ఫలితంగా అటు కుటుంబీకులకు దూరమై ఇటు సమాజంలో తలెత్తుకోలేని పరిస్థితి ఎదురవుతోంది.
బతికి ఉన్నంత కాలం మచ్చే
అక్రమ సంబంధాల కారణంగా హత్యలు చేయించేవారు, చేసే వారు తాము ఏదో ఘనకా ర్యానికి పాల్పడినట్లు భావిస్తుంటారని మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు. ఒకసారి తమ సంబంధానికి అడ్డుగా ఉన్న వ్యక్తిని హత్య చేయించగలిగితే ఆతర్వాత తమ వ్యవహారానికి అడ్డెవరూ ఉండరని నమ్ముతారని పేర్కొంటున్నారు. కానీ పోలీసుల దర్యాప్తులో ఏదో ఓ రోజు విషయం బయటపడుతుందని, తాము కటకటాల పాలు కాక తప్పదని హత్యకు పాల్ప డే వారు మొదట గుర్తించడం లేదు.
భర్తను భార్య హత్య చేయించినా, భార్యను భర్త హత్య చేసినా, చేయించినా శిక్ష అనుభవించక తప్పదు. ఇలాంటి కేసులు బయటపడి, కేసుల పాలైతే శిక్ష అనుభవించి బయటకు వచ్చినా సమాజంలో తలెత్తుకుని జీవించే పరిస్థితి ఉండదు. సమాజంతో మాకేం పని అనుకున్నా కుటుంబం అక్కున చేర్చుకునే అవకాశం ఉండదు. ఇక దంపతులకు పిల్లలు ఉంటే ఒకరు చనిపోయి, ఒకరు జైలుకు వెళ్తే ఆ పిల్లలను ఎవరు పోషించాలి, సమాజం నుంచి వారు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారో ఓసారి ఆలోచించగలిగితే... అనైతిక బంధాలూ ఉండవు.. ఆపై హత్యలకు తావుండదు.
►గత నెలలో జిల్లాలోని ఆరెంపులకు చెందిన ఓ యువకుడు ప్రేమ వివా హం చేసుకున్నాడు. చికెన్ వ్యర్థాలు తరలించే వాహనం డ్రైవర్‌గా పనిచేస్తుండగా ఆయన భార్యకు మరో డ్రైవర్‌తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విష యం యువకుడికి తెలియడంతో భార్యను మందలించగా, తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించి కృష్ణా జిల్లాలో మృతదేహాన్ని వేయించింది. ఇప్పటికీ సదరు యువకుడి మృతదేహం లభించలేదు.
►ఈనెల మొదట్లో ఖమ్మం రమణగుట్ట ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తిని ఆయన భార్య హత్య చేయించింది. సాగర్ కాల్వలో నెట్టి వేసి హత్యకు పాల్పడగా ఈయన మృతదేహమూ లభించలేదు. ఈ ఘటనకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు గుర్తించారు.
►ఇప్పుడు చింతకాని మండలం బొప్పారం గ్రామానికి చెందిన తాపీమేస్త్రీ షేక్ జమాల్ సాహెబ్(48)ను ఆయన భార్య తాను సంబంధం సాగిస్తున్న ఆటోడ్రైవర్‌తో కలిసి పక్కా పథకం ప్రకారం హత్య చేయించింది.
Comments
Please login to add a commentAdd a comment