హిమాయత్‌నగర్: నిరుద్యోగులకు డేటా ఎంట్రీ ఉద్యోగాలు ఇస్తామంటూ పంజాగుట్ట కేంద్రంగా నడుస్తున్న ఓ నకిలీ కాల్ సెంటర్‌పై హైదరాబాద్ సైబర్‌క్రైం పోలీసులు, వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. దాదాపు రెండేళ్లుగా మోసానికి పాల్పడుతున్న ప్రధాన నిర్వాహకుడు గడగోని చక్రధర్, సహకారులు గణేష్, శ్రావణ్‌లతో పాటు మరో 32మంది టెలికాలర్స్(వీరిలో అమ్మాయిలు 11మంది)ని అరెస్టు చేసినట్లు సైబర్ క్రైం డీసీపీ స్నేహా మెహ్రా తెలిపారు.
వారివద్ద నుంచి 14 ల్యాప్‌టాప్‌లు, 148 సెల్‌ఫోన్‌లు, రూ.1లక్షా 3వేలు నగదు, బీఎండబ్ల్యూ, ఫార్చునర్, ఇన్నోవా, మహేంద్ర కారులను స్వాదీనం చేసుకున్నట్లు చెప్పారు. శనివారం బషీర్‌బాగ్‌లోని సైబర్ క్రైం కార్యాలయంలో టాస్క్ ఫోర్స్ ఓఎస్‌డీ రాధాకిషన్‌రావు, సైబర్‌క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్, టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్లు రఘునా«థ్, శ్రీనాథ్‌రెడ్డిలతో కలసి స్నేహా మెహ్రా వివరాలను వెల్లడించారు.
ప్రతి 45రోజులకు సిమ్‌లు మార్పు
డబ్బులు వసూలు చేసిన తర్వాత ప్రతి 45 రోజులకోసారి ఫోన్ నెంబర్లను చక్రధర్‌గౌడ్ మార్చేసేవాడు. ఫేక్ కేవైసీల ఆధారంగా వందల కొద్దీ సిమ్‌లను అనంతపురం వాసి కృష్ణమూర్తి నుంచి కొనుగోలు చేసేవాడు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ నగరానికి చెందిన ఇద్దరు వ్యక్తులకు డేటా ఎంట్రీ జాబ్ ఇస్తానంటూ మాయమాటలు చెప్పి వారి నుంచి రూ.2500 చొప్పున వసూళ్లు చేసి ఉద్యోగం ఇవ్వలేదు. దీంతో ఆ ఇద్దరూ సైబర్‌క్రైం పోలీసుల్ని ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి మొత్తం నిర్వాకాన్ని వెలికితీశారు. వెస్ట్‌జోన్ టాస్క్ ఫోర్స్, సైబర్‌క్రైం పోలీ సులు ఈ కాల్‌సెంటర్ గుట్టును రట్టు చేసినట్లు టాస్క్ ఫోర్స్ ఓఎస్‌డీ రాధాకిషన్‌రావు తెలిపారు.
రెండేళ్లు..6వేల మంది బాధితులు
నగరంలోని బాచుపల్లిలో స్థిరపడ్డ సిద్దిపేటకు చెందిన గడగోని చక్రధర్‌గౌడ్‌కు గతంలో కాల్‌సెంటర్‌లలో పనిచేసిన అనుభవం ఉండటంతో 2021లో పంజాగుట్టలో రూ.1లక్షా 30వేల విలువ గల ఫ్లాట్‌ను తీసుకుని కాల్‌సెంటర్‌ను ప్రారంభించాడు.
ఏపీ, తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన నిరుద్యోగులకు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు ఇస్తానంటూ వల వేశాడు. ఆయా రాష్ట్రాలకు చెందిన నిరుద్యోగులతో మాట్లాడేందుకు ఆ రాష్ట్రాలకు చెందిన వారినే టెలీకాలర్స్‌గా రూ.15వేల జీతానికి నియమించుకున్నాడు. ఈ రెండేళ్లలో ఒక్కో బాధితుడి నుంచి రూ.3వేల నుంచి రూ.5వేల వరకు దాదాపు 6వేల మంది నుంచి వసూలు చేశారని గుర్తించారు. కొంతమంది నుంచి పెద్దమొత్తంలో కూడా వసూళ్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment