
నిందితులను విచారణ చేస్తున్న వన్‌టౌన్ సీఐ వెంకటరావు
విజయనగరం క్రైమ్: మద్యం మత్తులో కన్నబిడ్డను చంపేసుకున్నారు ఆ కసాయి తల్లిదండ్రులు. ఈ ఘటన స్థానిక మయూరీ కూడలి వద్ద శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత చోటుచేసుకుంది. వన్‌టౌన్ సీఐ బి.వెంకటరావు ఆదివారం వివరాలు వెల్లడించారు. స్థానిక మయూరి కూడలి వద్ద భిక్షాటన చేస్తూ ఐదేళ్లుగా సహజీవనం సాగిస్తున్న గాయత్రీదాస్, అలోక్ దాస్‌కు ఇద్దరు ఆడపిల్లలు.
పెద్దపాపకు రెండేళ్లు, చిన్నపాపకు నెలన్నర రోజులు. ఇద్దరూ ఆడపిల్లలే పుట్టారని భార్యాభర్తలు గొడవపడేవారు. ఎప్పటిలాగే శనివారం అర్ధరాత్రి తరువాత మద్యం మత్తులో గొడవ పడ్డారు. ఆ తగాదాలోనే తల్లి చేతిలో ఉన్న చిన్న పాపను లాగడంతో గట్టిగా దెబ్బలు తగిలాయి.
ఆదివారం ఉదయం 5 గంటల ప్రాంతంలో ప్రభుత్వాస్పత్రికి పాపను తీసుకువెళ్లగా.. అక్కడ వైద్యులు పాప మృతి చెందిందని చెప్పారు. దీంతో పాప మృతదేహాన్ని రైల్వేస్టేషన్ రిజర్వేషన్ బుకింగ్ కౌంటర్ వెనుక ఉన్న ఖాళీ స్థలంలో కంకరపిక్క, క్రషర్ బుగ్గిలో రెండు అడుగుల లోతు గొయ్యి తీసి కప్పేశాడు.
అనంతరం మయూరీ కూడలి వద్ద బిడ్డను నువ్వే చంపేశావంటే నువ్వే చంపేశావని ట్రాఫిక్ కానిస్టేబుల్ వద్ద వాదులాడుకున్నారు. వెంటనే ఆయన వన్‌టౌన్ పోలీసులకు సమాచారమిచ్చారు. రంగంలోకి దిగిన వన్‌టౌన్ సీఐ వెంకటరావు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment