
సాక్షి, మహబూబ్‌నగర్: నవ వధువు.. కన్నతండ్రి చేతిలో దారుణ హత్యకు గురైన ఘటన మహబూబ్‌నగర్‌లో చోటుచేసుకుంది. శివారు ప్రాంతమైన జైన్ అలిపూర్ గ్రామంలో గత రాత్రి.. కృష్ణయ్య అనే వ్యక్తి.. తన భార్య కళమ్మ.. కన్న కూతురు సరస్వతిలపై కర్రతో విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చాడు. అనంతరం తను కూడా గుళికల మందు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
చదవండి: వివాహేతర సంబంధం: భర్త నిద్రపోతుంటే.. రాత్రి ప్రియుడితో కలిసి కారులో..
సరస్వతికి ఈ నెల 8న వివాహం జరిగింది. కాగా తనకు ఇష్టంలేని పెళ్లిచేశారని వారం క్రితం పుట్టింటికి తిరిగి వచ్చిన సరస్వతి.. అత్తారింటికి వెళ్లేందుకు ససేమిరా ఇష్టపడలేదు. తల్లి కళమ్మ కూడా కూతురికి అండగా నిలిచేది. ఈ నేపథ్యంలో వారం రోజులుగా ఇంట్లో గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ క్రమంలో గత రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చిన కృష్ణయ్య.. భార్య, కూతురుతో గొడవపడి కర్రతో విచక్షణారహితంగా దాడి చేశాడు. దాంతో ఇరువురు తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం కృష్ణయ్య కూడా గుళికల మందు తిన్నాడు. ఈ విషయాన్ని కృష్ణయ్య ఫోన్ ద్వారా బంధువులకు తెలియజేయడంతో.. బంధువులు వచ్చి ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు.. భార్య, కూతురు పరిస్థితి విషమంగా ఉండటంతో.. హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. కృష్ణయ్య కొడుకు బాలరాజు ఫిర్యాదుతో పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment