బాధితునికి ఇచ్చిన ఫోర్జరీ ఎఫ్‌ఐఆర్ కాపీ
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో సంచలనం రేపిన ఫోర్జరీ ఎఫ్‌ఐఆర్ (సృష్టించిన కాపీ) కేసులో రోజుకో విషయం వెలుగుచూస్తోంది. 255/2020 నంబరుతో రెండు ఎఫ్‌ఐఆర్లు బయటికి రావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ రోజు స్టేషన్‌లో జరిగిన మరో ఆసక్తికర పరిణామం పోలీసుల అనుమానాస్పద వైఖరిని బలపరిచేలా ఉందని తెలిసింది.
ఆ సమయంలో ఎఫ్‌ఐఆర్ కాపీ కోసం ఎస్సై వ్యవహరించిన తీరు అనుమానాలకు బీజం వేసిందని సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. 2020 సెప్టెంబరు 9వ తేదీన స్టేషన్‌కు వచ్చిన నల్లగొపు శ్రీనివాస్‌పై ఎఫ్‌ఐర్ నంబరు 255/2020తో ఐపీసీ సెక్షన్లు 341, 323, 506 నమోదు చేశారు. ఆ ఎఫ్‌ఐఆర్ కాపీని బాధితునికి ఇచ్చారు. అది చూసి కంగారుపడిపోయిన బాధితుడికి ఏం చేయాలో పాలుపోలేదు.
మరోవైపు అరెస్టు చేస్తున్నామని, వైద్యపరీక్షలకు సిద్ధంగా ఉండాలని అప్పటి ఎస్సై, సీఐ బాధితుడిని భయభ్రాంతులకు గురిచేశారు. బెదిరిపోయిన శ్రీనివాసరావు ఇల్లు విక్రయించేందుకు సమ్మతించాడు. దీంతో అరెస్టు చేయడంలేదని, పిలిచినపుడు కోర్టుకు రావాలని ఎస్సై, సీఐలు సూచించడంతో ఎఫ్‌ఐఆర్ కాపీతో బాధితుడు ఇంటిదారిపట్టాడు.
మళ్లీ స్టేషన్‌కి పిలిపించి.. వాసన చూసి
బాధితుడు కాపీతో సహా ఇంటికి వెళ్లడంతో కంగారుపడిపోయిన ఎస్సై అతన్ని, ఎఫ్‌ఐఆర్‌కాపీని తీసుకురావాల్సిందిగా ఓ వ్యక్తిని పురమాయించాడు. అతడు శ్రీనివాస్‌ని వెంటబెట్టుకుని స్టేషన్‌కు తీసుకొచ్చాడు. అక్కడ బాధితుడి నుంచి ఎఫ్‌ఐఆర్ కాపీని హడావుడిగా తీసుకున్న ఎస్సై దాన్ని ముక్కువద్ద పెట్టుకుని వాసన చూశాడు. ఇది చూసి శ్రీనివాసరావుకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు.
ఇంతలో ఎస్సై... ఏరా..? దీన్ని కార్బన్‌కాపీ (జిరాక్స్) తీశావా? అని అరిచాడు. ‘అలాంటిదేమీ లేదు’’ అని శ్రీనివాస్ సమాధానమిచ్చాడు. ఆ జవాబు విని ఊపిరిపీల్చుకున్న ఎస్సై.. ఒకవేళ ‘జిరాక్స్ తీసి ఉంటే కొంపలు అంటుకుపోయి ఉండేవి’’ అని వ్యాఖ్యానించాడు. ఎస్సై మాటలతో శ్రీనివాసరావు మనసులో అనుమానం బీజం నాటుకుంది. కానీ, అప్పటికే అతను ఒక కాపీని జిరాక్స్ తీసుకున్నాడు.
ఆ సమయంలో ఎస్సై కోపం చూసి.. ఆ విషయం అతనితో చెప్పలేకపోయాడు. వాస్తవానికి జిరాక్స్ తీసిన కొద్దిసేపటి వరకు ఆ కాగితాలపై కార్బన్‌పౌడర్ అంటి ఉంటుంది. తీసిన కొద్దిసేపటి వరకు దాని వాసన చూసి ఆ విషయాన్ని గ్రహించవచ్చు. కానీ, అప్పటికే జిరాక్స్ తీసి చాలాసేపు అవుతుండటంతో ఎఫ్‌ఐఆర్ కాపీపై కార్బన్ వాసనను ఎస్సై గ్రహించలేకపోయాడు. ఏడాది దాటుతున్నా.. తనను కోర్టుకు పిలవకపోవడంతో అనుమానం వచ్చిన బాధితుడు శ్రీనివాసరావు ఇటీవల ఓ లాయరును ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడింది.
ఇది చాలా తీవ్ర ఆరోపణ: సీపీ సత్యనారాయణ
ఈ కేసులో వచ్చిన ఆరోపణ చాలా తీవ్రమైనది. ఒకే నంబరుపై రెండు ఎఫ్‌ఐఆర్లు ఉండనే ఉండవు. అందులోనూ స్టేషన్‌లోనే ఎఫ్‌ఐఆర్ రద్దు అనేది పూర్తిగా అవాస్తవం. ఆ హక్కులు పోలీసులకు ఉండవు. ఘటనపై విచారణ జరుపుతున్నాం. ఫిర్యాదుదారులు, నిందితులు, సిబ్బందిని పిలిపించాం.
చదవండి: వీడొక్కడే సినిమాలో లాగా.. మహిళ కడుపులో.. అధికారులు షాక్..
Comments
Please login to add a commentAdd a comment