సాక్షి, మేడ్చల్ జిల్లా: హైదరాబాద్ శివారు దేవరయాంజాల్‌లోని శ్రీరామచంద్ర స్వామి దేవాలయ భూముల వ్యవహారంపై ఐఏఎస్‌ల ఉన్నతస్థాయి కమిటీ నాలుగోరోజూ విచారణ కొనసాగించింది. రికార్డులు, ఫైళ్లను పరిశీలించింది. ల్యాండ్ సర్వే శాఖకు చెందిన ముగ్గురు అధికారులు, 19 మంది సర్వేయర్లు, ఎనిమిది మంది తహసీల్దార్ల ఆధ్వర్యంలోని 8 బృందాలు నిర్వహించిన సర్వే నాలుగు రోజుల అనంతరం గురువారం ముగిసింది. ఐఏఎస్‌ల కమిటీ దేవరయాంజాల్ ఆలయపూజారితో మాట్లాడి పలు అంశాలను అడిగి తెలుసుకుంది. దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ల వద్ద నుంచి ఆలయానికి సంబంధించిన పాత రికార్డులు, ఫైళ్లను స్వాధీనం చేసుకుంది.
కచ్చితమైన భూరికార్డులుగా చెప్పుకొనే 1924–25 రెవెన్యూపత్రాల్లో 1,531 ఎకరాల భూములు సీతారామస్వామి ఆలయం పేరిట ఉన్నట్లు దేవాదాయ శాఖ అధికారులు పేర్కొన్నారు. పాత రికార్డులు, నక్ష, పహాణీలు, మ్యాప్‌లను కమిటీకి అందజేశారు. ఆలయ భూముల వివాదానికి సంబంధించి అప్పట్లో వేసిన వెంకట్రాంరెడ్డి, దివాన్ కమిటీల గురించి ఆరా తీయటంతోపాటు వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు, పత్రాలు, ఫైళ్లను కమిటీ పరిశీలించింది. భూమి యజమానిగా ఉన్న శ్రీసీతారామ చంద్రస్వామి ఆలయం పేరు కాస్తా... సీతారామరెడ్డిగా, సీతారామారావుగా, సీతారామయ్యగా, సీతారాములుగా రకరకాల పేర్లతో మారి... చివరికి కబ్జాదారుల పేర్లు రికార్డుల్లోకి ఎక్కినట్లు దేవాదాయ శాఖ అధికారులు కమిటీకి వివరించారు. దేవాలయ భూములు అమ్మేందుకు వీలులేదని, వాటిని చట్టపరంగా స్వాధీనం చేసుకునేందుకు అవకాశముందని వారు అభిప్రాయపడ్డారు.
హెచ్‌ఎండీఏ అనుమతి పొందినవి మూడు మాత్రమే..
ఆలయ భూముల్లో గోదాములు, కమర్షియల్ షెడ్లు, ఫామ్‌హౌస్‌లు, కొత్తగా నిర్మిస్తున్న కట్టడాలు అన్నీ కలిపి 178 వరకు ఉన్నప్పటికీ, సర్వే లెక్కల్లో మాత్రం తేడా ఉన్నట్లు సమాచారం. తూముకుంట మున్సిపాలిటీ దగ్గర ఉన్న సమాచారం ప్రకారం 129 నిర్మాణాలు (గోదాములు, కమర్షియల్ షెడ్లు) ఉన్నప్పటికీ, ఇందులో మూడింటికి మాత్రమే హెచ్‌ఎండీఏ అనుమతులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తూముకుంట మున్సిపాలిటీ, అప్పటి పంచాయతీల్లో విధులు నిర్వహించిన ఉద్యోగులను కమిటీ విచారించింది. నివేదిక ఇవ్వాలని కోరినట్లు సమాచారం. అక్రమ నిర్మాణాలను అరికట్టని సంబంధిత ఉద్యోగులపై శాఖ పరమైన చర్యలకు కూడా కమిటీ సిఫారసు చేసే అవకాశమున్నట్లు చర్చ సాగుతోంది.
రాజకీయ పలుకుబడితోనే అక్రమ కట్టడాలు
ఆలయ భూముల్లో 2007 నుంచి ఇప్పటివరకు యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్న విషయం ఐఏఎస్‌ల కమిటీ పరిశీలనలో తేలింది. మాజీమంత్రి ఈటల రాజేందర్ సతీమణి జమునకు సంబంధించిన కట్టడాలు, రాజకీయ పలుకుడి కలిగిన వ్యక్తులతోపాటు అధికార పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధుల నిర్మాణాలు కూడా ఆలయ భూముల్లో ఉన్నట్లు కమిటీ గుర్తించింది. ఈటల, ఆయన బినామీల అక్రమ నిర్మాణాలకు సంబంధించిన వివరాలు పూర్తిస్థాయిలో సేకరించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి సమర్పించే నివేదిక సమగ్రంగా ఉండేలా అన్ని కోణాల నుంచి కమిటీ పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించింది.
ఆలయ ప్రాంగణంలో కమిటీ సభ్యులు భేటీ
ఐఏఎస్‌ల కమిటీ దేవాలయ ప్రాంగణంలో సమావేశమైంది. 8 బృందాలు నిర్వహించిన సర్వే నివేదికలతోపాటు దేవాదాయ, రెవెన్యూ, విజిలెన్స్ శాఖలు, రైతులు, కబ్జాదారులు, నిర్మాణదారుల నుంచి సేకరించిన రికార్డులు, పత్రాలు, మ్యాప్‌లను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రభుత్వానికి శనివారంలోగా నివేదిక సమర్పించే అవకాశముండటంతో మదింపు కోసం కమిటీ అన్ని రికార్డులను పరిశీలించి తుది సమాలోచనలు చేసింది.
పత్రాలు అందజేసిన కబ్జాదారులు
ఐఏఎస్‌ల ఉన్నత స్థాయి కమిటీకి కబ్జాదారులు, రైతులు తమ భూరికార్డులు, గోదాములు, కమర్షియల్ షెడ్లకు సంబంధించిన పత్రాలను చూపించారు. 1953లో ఈ భూములను కొనుగోలు చేసినట్లు పలువురు వివరణ ఇచ్చారు. గోదాములు, షెడ్లు నిర్మించుకోవటానికి గ్రామ పంచాయతీ నుంచి తీసుకున్న అనుమతి పత్రాలు, చెల్లిస్తున్న పన్నులు, భూమి శిస్తుకు సంబంధించిన పాత వివరాలను కూడా కమిటీకి చూపించారు.
పాత రికార్డుల పరిశీలన.. ఆక్రమణలపై ఆరా
Published Fri, May 7 2021 5:07 AM | Last Updated on Fri, May 7 2021 5:09 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment