రాజ రాజ చోర | A gang of thieves is running schools in Bhopal | Sakshi
Sakshi News home page

రాజ రాజ చోర

Published Thu, Sep 19 2024 3:49 AM | Last Updated on Thu, Sep 19 2024 3:49 AM

A gang of thieves is running schools in Bhopal

అది ఓ చిన్న పాఠశాల. విద్యార్థులు టీచర్‌ కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలోఓ వ్యక్తి తరగతి గది లోపలకు వచ్చాడు. అతడి చేతిలో కత్తెర, బ్లేడు, తాళాలు, స్క్రూడ్రైవర్‌ వంటి సరంజామా ఉంది.వెంటనే పాఠం మొదలుపెట్టాడు.

అంటే ఏవో సైన్స్‌ ప్రాక్టికల్స్‌ చెబుతున్నాడేమో అనుకోకండి. అక్కడ జరిగే సంగతి తెలిస్తే నోరెళ్లబెడతారు.

పిక్‌ పాకెటింగ్‌ ఎలా చేయాలి? దొంగతనం చేసిన తర్వాత దొరక్కుండాఎలా తప్పించుకోవాలి? తాళాలను ఎలా ఓపెన్‌ చేయాలి వంటి అంశాల్లోఅక్కడ తర్ఫీదు ఇస్తారు.

వినడానికి విడ్డూరంగా విన్నా కొన్నేళ్లుగా అక్కడ జరుగుతున్న తతంగం ఇది.  

మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌కు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖడియా, గుల్‌ ఖేడి, హుల్‌ ఖేడి అనే మూడు గ్రామాల్లో దొంగల స్కూళ్లు ఉన్నాయి. 12 సంవత్సరాల నుంచి 17 ఏళ్ల లోపు వయసున్న వారికి దొంగతనాలు, దోపిడీలు ఎలా చేయాలో అందులో శిక్షణ ఇస్తారు. అవసరమైన సందర్భాల్లో హత్యలు ఎలా చేయాలో కూడా నేర్పిస్తారు. పేద కుటుంబాలకు చెందిన పిల్లలను లక్ష్యంగా చేసుకుని ఓ దొంగల ముఠా ఈ స్కూళ్లు నడుపుతోంది. ఏడాదిపాటు సకల చోర కళల్లో శిక్షణ ఇస్తారు. 

జనం రద్దీగా ఉండే ప్రదేశాల్లో పిక్‌ పాకెటింగ్‌ ఎలా చేయాలి, బ్యాగు ఎలా లాక్కోవాలి? ఆపై ఎవరికీ చిక్కకుండా ఎలా పారిపోవాలి? బ్యాంకులను ఎలా దోచుకోవాలి? పోలీసులకు చిక్కితే వారి లాఠీ దెబ్బలను ఎలా తట్టుకోవాలి? వంటి అన్ని అంశాల్లోనూ సుశిక్షితులను చేస్తారు. ముఖ్యంగా పెద్దింటి పిల్లలు ఎలా వ్యవహరిస్తారో, వారు ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటారో కూడా వివరించి అన్ని విధాలా సన్నద్ధం చేస్తారు. ఈ శిక్షణ విజయవంతంగా పూర్తిచేసుకున్నవారు దొంగతనాల్లో గ్రాడ్యుయేట్ల కిందే లెక్క. 

అంతేకాదు.. ఏడాదిపాటు ఇచ్చే శిక్షణ కోసం రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు ఫీజుగా తీసుకుంటున్నారు. శిక్షణ పూర్తయిన తర్వాత వారిని గ్యాంగులో సభ్యులుగా చేర్చుకుంటారు. అనంతరం దేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రాక్టికల్స్‌కు పంపిస్తారు. అలా వారు కొట్టుకొచి్చన సొమ్ము ఈ దొంగల ముఠాయే తీసుకుని, వారి తల్లిదండ్రులకు ఏడాదికి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు మాత్రమే ఇస్తుంది. దీంతో ఇదేదో బాగుందని భావిస్తున్న ఆ చుట్టుపక్కల ఊళ్ల జనం నానా తిప్పలూ పడి ఫీజులు చెల్లించి తమ పిల్లలను దొంగల స్కూళ్లలో చేర్పిస్తున్నారు.

ఇలా బయటపడింది.. 
ఈ దొంగల శిక్షణ వ్యవహారం చాలాకాలంగా సాగుతున్నప్పటికీ,ఇటీవల ముంబైలో జరిగిన ఓ దొంగతనంతో వెలుగులోకి వచి్చంది. ఓ బడా పారిశ్రామికవేత్త కుటుంబ వివాహ వేడుక ముంబైలోని ఓ ఖరీదైన హోటల్‌లో ఘనంగా జరిగింది. 

ఆ హోటల్లోకి ఈ ముఠాకు చెందిన కుర్రాడు పెద్దింటి బిడ్డగా చొరబడి రూ.కోటిన్నర విలువైన నగలతో మాయమయ్యాడు. నగలు కనిపించకపోవడంతో సీసీ కెమెరాలు పరిశీలించగా దొంగతనం విషయం బయటపడింది. ఆ కుర్రాడు ఎవరా అని ఆరా తీసిన పోలీసులు చివరకు మధ్యప్రదేశ్‌లోని ఈ మూలాలుగుర్తించి అవాక్కయ్యారు.  

పోలీసులు ఏం చేయలేరా? 
నిజానికి ఆ మూడు గ్రామాల్లో దొంగల స్కూళ్లు నడుస్తున్నాయనే సంగతి స్థానిక పోలీసులకు తెలిసినా వారు ఏమీ చేయలేని పరిస్థితి. ఆ ఊళ్లోకి పోలీసులు వెళ్తే చాలు.. ఊరి జనమంతా ఏకమై అడ్డుకుంటారు. ఎవరైనా అపరిచితులు అక్కడకు వెళ్లినా వదిలిపెట్టరు. దీంతో ఒక్క దొంగను అరెస్టు చేయడానికి వెళ్లాలంటే పోలీసులు పెద్ద ఎత్తున మందీమార్బలంలో వెళ్లాల్సిందే. 

పైగా దొంగల స్కూల్‌ను మూయించే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే అది మామూలు పాఠశాలలాగే ఉంటుంది. మేం విద్యార్థులకు ట్యూషన్‌ చెబుతున్నాం.. అది కూడా తప్పా అని ప్రశ్నిస్తారు. దీంతో పోలీసులు తిరుగుముఖం పట్టడం తప్ప చేసేదేమీ ఉండదు. దేశవ్యాప్తంగా వివిధ పోలీస్‌ స్టేషన్లలో ఈ ముఠాకు చెందిన 2వేల మందికి పైగా వ్యక్తులపై దాదాపు 8వేల కేసులు నమోదయ్యాయి. 

- సాక్షి సెంట్రల్‌ డెస్క్‌  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement