హైదరాబాద్/ఘట్‌కేసర్: బీఫార్మసీ విద్యార్థినిని కిడ్నాప్ చేసి అఘాయిత్యానికి పాల్పడిన కేసులో ఆరుగురు నిందితుల్ని రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని భువనగిరి స్పెషల్ ఆపరేషన్ టీమ్(ఎస్వోటీ) కార్యాలయంలో విచారిస్తున్నారు. బాధితురాలిని గురువారం గాంధీ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన తర్వాత మెరుగైన చికిత్సకోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు చెప్తున్నారు.
రాంపల్లి ఆర్‌ఎల్ నగర్‌కు చెందిన బీఫార్మసీ విద్యార్థినిపై బుధవారం అఘాయిత్యం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసును సవాల్‌గా తీసుకున్న రాచకొండ పోలీసులు నిందితుల్ని పట్టుకోవడానికి 10 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఈ నేపథ్యంలోనే నాగారం సర్కిల్‌లోని ఓ సీసీ కెమెరాలో కనిపించిన దృశ్యాల ఆధారంగా ఆ విద్యార్థిని ఎక్కిన సెవెన్ సీటర్ ఆటోను గుర్తించారు. దాని డ్రైవర్‌తో పాటు ఈసీఐఎల్, రాంపల్లి, యంనంపేట్, ఘట్‌కేసర్ మార్గాల్లో నడిచే ఆటోల డ్రైవర్లలో అనేక మందిని అదుపులోకి తీసుకుని విచారించారు.
దీంతో పాటు ఆయా ప్రాంతాల్లోని సెల్‌ఫోన్ టవర్ల నుంచి సేకరించిన సాంకేతిక అంశాలు, నిర్దేశిత లొకేషన్లలో ఉన్న సెల్‌ఫోన్ నెంబర్ల ఆధారంగా కొందరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు యంనంపేట్ ప్రాంతానికి చెందిన వారని తెలిసింది. వీరిలో కొందరిపై గతంలోనూ కేసులు ఉన్నట్లు సమాచారం. తొలుత కిడ్నాప్ కేసు నమోదు చేసిన కీసర పోలీసులు, గురువారం బాధితురాలి నుంచి వాంగ్మూలం సేకరించడంతో పాటు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాల ఆధారంగా కిడ్నాప్, దాడి, నిర్భయ చట్టంలోని సెక్షన్ల కింద ఆరోపణలు చేర్చారు.
మొత్తం ఆరుగురు నిందితులని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆటోను స్వాధీనం చేసుకున్నారు. వీరిని ఘటనాస్థలికి తీసుకెళ్లి ప్రాథమిక క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్ నిర్వహించారు. ఈ కేసులో నిందితుల్ని శుక్రవారం అరెస్టు ప్రకటించే అవకాశం ఉంది. కాగా, బాధితురాలు తమ ఆసుపత్రికి వచ్చిన సమయంలో ఆమె స్పృహలో లేదని క్యూర్ ఆసుపత్రి వైద్యులు చెప్పారు. బాధితురాలికి అంతర్గతంగా గాయాలు ఉన్నాయని, తల, కాలిపై గాయాలు ఉన్నాయని, కర్రలు లేదా రాడ్లతో దాడి జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. బాధితురాలి ఆరోగ్యం నిలకడగా ఉందని డీసీపీ రక్షితామూర్తి తెలిపారు.
సూత్రధారి శివ?
బీ ఫార్మసీ విద్యార్థినిపై అఘాయిత్యం కేసులో యంనంపేట్‌కు చెందిన ఆటోడ్రైవర్ శివ సూత్రధారిగా తేలింది. ఇతడిచ్చిన సమాచారంతోనే మిగిలిన ఐదుగురు నిందితులు వచ్చి నేరంలో పాలుపంచుకున్నట్లు తేల్చారు. రాచకొండ పోలీసులు గురువారం రాత్రి ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు నాగారం చౌరస్తాలో శివకు చెందిన సెవెన్ సీటర్ ఆటో ఎక్కింది. విద్యార్థిని ఒంటరిగా ఉండటంతో దుర్బుద్ధి పుట్టిన శివ ఈ విషయాన్ని ఫోన్ ద్వారా తన స్నేహితులకు చెప్పి నిర్దేశిత ప్రాంతానికి రమ్మని చెప్పాడు.
కీడు శంకించిన బాధితురాలు ఫోన్ ద్వారా కుటుంబీకులకు సమాచారం ఇచ్చింది. మార్గమధ్యలో ప్రయాణికుల మాదిరిగా వాహనం ఎక్కిన ఇద్దరు స్నేహితులు బాధితురాలి నోరునొక్కి, కదలకుండా పట్టుకుని ఘట్‌కేసర్ వైపునకు తీసుకుపోయారు. యంనంపేట్ దాటిన తర్వాత ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఆ సమయానికి మరో ముగ్గురు స్నేహితులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఈ లోపు బాధితురాలి తల్లిదండ్రుల నుంచి అందిన సమాచారం మేరకు కీసర పోలీసులు రంగంలోకి దిగి బాధితురాలి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. హడావుడిని గమనించిన నిందితులు బాధితురాలిని అన్నోజిగూడ సమీపానికి తీసుకువచ్చి వదిలి పారిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment