
షణ్ముఖ (ఫైల్)
సాక్షి, సూర్యాపేట : కారు చక్రం కింద ఓ చిరుప్రాయం నలిగిపోయింది. ఈ విషాదకర ఘటన సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన సంక్రాంతి విజయ్‌శేఖర్, శిరీష దంపతులకు ఇద్దరు కుమార్తెలు. కాగా, విజయ్‌శేఖర్ ఇంటికి మధ్యాహ్న సమయంలో బంధువులు కారులో వచ్చారు. వారు ఇంట్లోకి వెళ్లగానే డ్రైవర్ ఎదురుగా ఉన్న చెట్టుకింద కారును రివర్స్‌లో పార్క్ చేసుకున్నాడు.
కొద్ది సేపటి తర్వాత పని నిమిత్తం శిరీష ఎదురింట్లోకి వెళ్లగా తల్లిని చిన్నకూతురు షణ్ముఖ (18నెలలు) కూడా అనుసరించింది. ఆ ఇంటి ఎదురుగానే నిలిపిన కారు వెనుక డోరు పక్కన షణ్ముక ఆడుకుంటోంది. గమనించని తల్లి శిరీష ఒక్కతే ఇంట్లోకి వెళ్లింది. ఇంతలోనే కారు డ్రైవర్ అక్కడకు వచ్చి చిన్నారిని గమనించకుండా వాహనాన్ని ముందుకు కదిలించాడు. అయితే, ఈ సమయంలో షణ్ముక వెనుక చక్రం వద్ద ఆడుకుంటూ దానికింద పడిపోయింది.
దీంతో టైరు బాలిక తలపై నుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. షణ్ముక కేకలు విన్న కుటుంబ సభ్యులు వెంటనే అక్కడికి వచ్చి కోదాడ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. అప్పటి వరకు ఆడుకుంటూ ఉన్న చిన్నారి అంతలోనే విగతజీవిగా మారడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటగా ఆ ప్రాంతమంతా విషాదం అలుముకుంది.
Comments
Please login to add a commentAdd a comment