బాలికతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాలిక బంధువులు
ఉదయగిరి (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా) : ఉదయగిరి పట్టణంలో సోమవారం ఓ బాలికను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి అడవిలో చెట్టుకు కట్టేశారు. ఆ బాలికను గొర్రెల కాపరులు రక్షించి ఇంటికి చేర్చారు. ఉదయగిరి దిలావర్‌భాయి వీధికి చెందిన రషీద్, నస్రీన్‌లకు సమ్రీన్, మసీరా అనే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. స్థానిక నాగులబావి వీధిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో మసీరా ఐదో తరగతి, సమ్రీన్, ఏడో తరగతి చదువుతున్నారు.
సోమవారం మధ్యాహ్నం ఇద్దరూ కలిసి పాఠశాల నుంచి భోజనం కోసం ఇంటికి వచ్చారు. అనంతరం సమ్రీన్ ముందు వెళ్లగా, మసీరా ఇంటి నుంచి ఆలస్యంగా బయలుదేరింది. మార్గమధ్యంలో బైక్‌పై మాస్కులు ధరించిన ఇద్దరు వ్యక్తులు మసీరాను కిడ్నాప్ చేశారు. పట్టణ శివారులోని బండగానిపల్లి వైపు వెళ్లే మార్గంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి పొదల్లో ఓ చెట్టుకు బాలికను కట్టేసి వెళ్లిపోయారు.
అటవీ ప్రాంతంలో ఉన్న గొర్రెలకాపరులు బాలికను గుర్తించి కట్లు విప్పి వివరాలు తెలుసుకుని ఇంటికి చేర్చారు. అప్పటికే పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన సమ్రీన్.. చెల్లిని ఎందుకు స్కూలుకు పంపలేదని తల్లిని అడిగింది. దీంతో మసీరా పాఠశాలకు వెళ్లకపోవడం, ఇంట్లో లేకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు వెదకడం ప్రారంభించారు. అదే సమయంలో బాలిక అటవీ ప్రాంతం వైపు నుంచి ఇంటికి రావడంతో కిడ్నాప్ ఉదంతం బయటపడింది.
ఈ నేపథ్యంలో బాలిక బంధువులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాలిక నుంచి వివరాలు తెలుసుకున్న ఎస్‌ఐ జి.అంకమ్మ... నాగులబావి వీధిలోని సీసీ ఫుటేజీలు పరిశీలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment