50 వేల ఎకరాలు.. డబ్బుల వర్షం కురిపిస్తానంటూ రూ. 94 లక్షలు వసూలు | Gujarat Tantrik Lures Man With Financial Prosperity Dupes Him of Rs 94 Lakh | Sakshi
Sakshi News home page

50 వేల ఎకరాలు.. డబ్బుల వర్షం కురిపిస్తానంటూ రూ. 94 లక్షలు వసూలు

Published Mon, Jul 19 2021 10:04 AM | Last Updated on Mon, Jul 19 2021 11:12 AM

Gujarat Tantrik Lures Man With Financial Prosperity Dupes Him of Rs 94 Lakh - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

గాంధీనగర్‌: కష్టపడితేనే రూపాయి సంపాదించగల్గుతాం. అలాంటిది ఏ పని చేయకుండా.. ఇంట్లోనే కూర్చని కోటీశ్వరులు కావాలనుకోవడం.. నట్టింట్లో డబ్బుల వర్షం కురవాలని కోరుకోవడం అత్యాశే అవుతుంది. ఇలా కష్టపడకుండా భారీగా డబ్బు సంపాదించాలనుకువారినే టార్గెట్‌ చేస్తారు కిలేడీలు. మన వీక్‌నెస్‌ వారికి ప్లస్‌ అవుతుంది. కల్లబొల్లి కబుర్లు చెప్పి భారీగా వసూలు చేసి పరారవుతారు. ఆ తర్వాత మనం తేరుకుని లబోదిబమన్న ప్రయోజనం శూన్యం.

సరిగా ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది గుజరాత్‌కు చెందిన ఓ వ్యక్తికి. నకిలీ తాంత్రికుడు ఒకరు నేను చెప్పినట్లు చేస్తే.. నీపై డబ్బుల వర్షం కురుస్తుంది.. ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకుంటావని నమ్మించాడు. సుమారు కోటి రూపాయలు వసూలు చేసి.. ఉడాయించాడు. పదేళ్ల నుంచి ఇలా మాయమాటలు చెప్పి.. భారీగా వసూలు చేశాడు. చివరకు నకిలీ తాంత్రికుడు తన దుకాణం ఎత్తేయడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఆ వివరాలు.. 

గుజరాత్‌ గాంధీనగర్‌కు చెందిన మహోరవాలా అనే వ్యక్తికి 2010లో నిందితుడు హితేష్‌ యాగ్యిక్‌తో పరిచయం ఏర్పడింది. నిందితుడు తనను తాను జునాగఢ్‌కు చెందిన కశ్మీర్‌ బాపు శిష్యుడిగా పరిచయం చేసుకోవడమేకాక తనకు మంత్రతంత్రాలు, జ్యోతిష్యం తెలుసని మహోరవాలాకు తెలిపాడు. తాను చెప్పిన పూజలు చేస్తే.. మహోరవాలాపై డబ్బుల వర్షం కురుస్తుందని.. ఆర్థికంగా వృద్ధిలోకి వస్తాడని ఆశపెట్టాడు. 

నకిలీ తాంత్రికుడి మాటలు నమ్మిన మహోరవాలా అతడు చెప్పినట్లు చేయసాగాడు. ఈ క్రమంలో 2016లో నిందితుడు తాను కుచ్‌ ప్రాంతంలోని రాపర్‌లో ఆశ్రమం నిర్మిస్తున్నట్లు.. దానికి ఆర్థిక సాయం చేస్తే.. మహోరవాలాకు మేలు కలుగుతుందని నమ్మించాడు. అంతేకాక కుచ్‌లో తనకు ఓ భక్తుడున్నాడని.. అతడి దగ్గర నుంచి మహోరవాలాకు 50 వేల ఎకరాల భూమి తక్కువ ధరకు ఇప్పిస్తానని నమ్మబలికాడు. దాన్ని కంపెనీలకు అమ్ముకుంటే మహోరవాలా కష్టాలు తీరతాయని.. కోట్లు సంపాదించుకోవచ్చని ప్రలోభాలకు గురి చేశాడు. నకిలీ తాంత్రికుడి మాటలు నమ్ముతూ వస్తున్న మహోరవాలా అతడికి కొంత సొమ్ము చెల్లించాడు. 

ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం నకిలీ తాంత్రికుడు మహోరవాలాకు త్వరలోనే భారీగా ధనం కలిసి వచ్చే అవకాశం ఉందని.. అందుకుగాను ఒక పూజ చేయాలని చెప్పాడు. ఈ క్రమంలో మహోరవాలా నకిలీ తాంత్రికుడి అకౌంట్‌కు 89 లక్షల రూపాయలు ట్రాన్స్‌ఫర్‌ చేశాడు. ఆ తర్వాత నిందితుడు మహోరవాలా ఇంటిని శుద్ధి చేయాలని.. అప్పుడు అతడి ఇంట్లో డబ్బుల వర్షం కురుస్తుందన్నాడు. శుద్ధి పేరుతో ఇంట్లో ఉన్న బంగారు, వెండి ఆభరణాలతో పాటు విలువైన వస్తువులతో ఉడాయించాడు నకిలీ బాబా.

ఈ సందర్భంగా బాధితుడు మహోరవాలా మాట్లాడుతూ.. ‘‘నకిలీ తాంత్రికుడికి అకౌంట్‌కు 89 లక్షల రూపాయలు ట్రాన్స్‌ఫర్‌ చేశాను. ఆ తర్వాత శుద్ధి కార్యక్రమం సందర్భంగా అతడికి లక్ష రూపాయలు విలువ చేసే మూడు స్కూటర్లతో పాటు నాలుగు లక్షల రూపాయల విలువైన బంగారు, వెండి ఆభరణాలు ఇచ్చాను. కానీ అతడు చెప్పినట్లు డబ్బుల వర్షం కురవలేదు. 2021, మార్చిలో అహ్మదాబాద్‌లో అతడిని చూశాను. నా డబ్బు గురించి అడిగితే.. ‘‘ఇప్పుడు నా ఆర్థికపరిస్థితి ఏం బాగాలేదు.. నీ డబ్బులు ఇవ్వలేనని’’ తెలిపాడు. నా ఫోన్‌ కాల్స్‌ని కట్‌ చేస్తున్నాడు. మోసపోయానని గ్రహించి నకిలీ బాబా మీద పోలీసులకు ఫిర్యాదు చేశాను అని తెలిపాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement