వర్గపోరాటంలో అమాయకులు బలి | Gunmen Attack On Passenger Vehicles In Pakistan | Sakshi
Sakshi News home page

పాకిస్థాన్‌లో ప్రయాణికుల వాహనాలపై కాల్పులు.. 50 మంది మృతి

Published Thu, Nov 21 2024 7:48 PM | Last Updated on Fri, Nov 22 2024 5:13 AM

Gunmen Attack On Passenger Vehicles In Pakistan

వాహనాలపై విచక్షణారహితంగా కాల్పులు 

50 మంది దుర్మరణం 

20 మందికి గాయాలు 

పాకిస్తాన్‌లోని ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రావిన్సులో దాడి 

పెషావర్‌: షియా, సున్నీ గిరిజన వర్గాల మధ్య ఏడాదికాలంగా జరుగుతున్న పోరులో తాజాగా అమాయక ప్రజలు బలయ్యారు. గురువారం ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రావిన్సులోని కుర్రం జిల్లాలో పర్వతమయ ప్రాంతాల గుండా వెళ్తున్న సాధారణ ప్రయాణికుల వాహన శ్రేణిపై సాయుధ మిలిటెంట్లు రోడ్డుకు ఇరువైపులా నిలబడి బుల్లెట్ల వర్షం కురిపించారు. దీంతో 50 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 20 మంది గాయపడ్డారు. 

ప్రాణభయంతో కొందరు వాహనాల సీట్ల కింద దాక్కుని ప్రాణాలు కాపాడుకున్నారు. మృతులంతా మైనారిటీ షియా వర్గానికి చెందిన వాళ్లేనని స్థానికులు చెబుతున్నారు. గత కొన్ని నెలలుగా ఈ ప్రాంతంలో షియా, సున్నీ గిరిజన సాయుధ ముఠాల మధ్య పరస్పర దాడులు, ఘర్షణలు జరుగుతున్నాయి. తాజాగా గిరిజన మండలి ఒకటి కాల్పుల విరమణకు పిలుపునిచ్చాక ఈ మార్గంలో ఇటీవల పౌరుల రాకపోకలు మొదలయ్యాయి.

 పౌర వాహనాలకు రక్షణగా పోలీసు వాహనం ముందుగా ఎస్కార్ట్‌గా బయల్దేరగా దానిపై తొలుత మిలిటెంట్లు కాల్పులు జరిపారు. కాల్పులు జరిపింది తామేనని ఇంతవరకు ఏ ముఠా ప్రకటించుకోలేదు. అయితే తెహ్రీక్‌–ఇ–తాలిబాన్‌ పాకిస్తాన్‌ ఉగ్రసంస్థే ఈ కాల్పులకు పాల్పడి ఉంటుందని స్థానిక పాత్రికేయులు చెబుతున్నారు. పరాచినార్‌ నుంచి పెషావర్‌కు కాన్వాయ్‌గా వెళ్తున్న 50 వాహనాలపై ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఒకే దాడిలో ఇంతమంది మరణించడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement