క్రైంసీన్ వద్దకు సీబీఐ బృందం(ఫొటో కర్టెసీ: ఎన్డీటీవీ)
లక్నో: హాథ్రస్ ఉదంతంపై లోతుగా విచారణ చేపట్టేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) రంగంలోకి దిగింది. అత్యంత దారుణ పరిస్థితుల్లో ఆస్పత్రిలో చేరి కన్నుమూసిన పందొమిదేళ్ల దళిత యువతి మృతి కేసులో విచారణ ప్రారంభించింది. ఈ క్రమంలో సీబీఐ అధికారుల బృందం మంగళవారం మధ్యాహ్నం బాధితురాలి సొంత గ్రామానికి చేరుకుంది. డిప్యూటీ సూపరిండెంటెండ్ ఆఫ్ పోలీస్ సీమా పహుజా నేతృత్వంలో, ఫోరెన్సిక్ నిపుణులు, పోలీసు అధికారులు, బాధితురాలి సోదరుడితో కలిసి ఘటనాస్థలాన్ని పరిశీలించింది. అంతేగాక బాధితురాలి తల్లిని కూడా క్రైంసీన్ దగ్గరకు తీసుకువెళ్లి వివరాలు అడిగి తెలుసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను, అనంతరం అంబులెన్సులో ఇంటికి తరలించారు. (చదవండి: కోర్టులో హాజరైన హాథ్రస్ బాధిత కుటుంబీకులు)
కాగా ఆధిపత్య వర్గానికి చెందిన నలుగురు యువకులు బాధితురాలిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడి, నాలుక కోసి, వెన్నుముక విరిచి అత్యంత పాశవికంగా దాడి చేయడంతో ఢిల్లీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు మీడియా ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్న విషయం తెలిసిందే. తల్లితో కలిసి గడ్డి కోస్తున్న సమయంలో మెడకు దుపట్టా బిగించి లాక్కెళ్లి ఆమెను చిత్ర హింసలకు గురిచేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దేశవ్యాప్తంగా సంచలన రేకెత్తించిన ఈ ఘటనపై అన్ని వర్గాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో సెప్టెంబరు 30న యోగి ఆదిత్యనాథ్ సర్కారు ఈ కేసు విచారణకై తొలుత ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. ఏడు రోజుల్లోగా నివేదిక అందించాలని ఆదేశించింది.
ఆ తర్వాత మరో పది రోజుల పాటు సమయం కావాలని సిట్ కోరడంతో గడువును పొడిగించింది. ఇక ఈ కేసులో ఆది నుంచి పోలీసుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో దీనిని సీబీఐకి అప్పగించాల్సిందిగా డిమాండ్లు వెల్లువెత్తాయి. దీంతో ఆదివారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ, 379-డీ(సామూహిక లైంగిక దాడి), 307(హత్యాయత్నం), 303(హత్య)తో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసింది. ఘటనాస్థలి వద్ద ఆధారాలు సేకరించేందుకు నేడు ఫోరెన్సిక్ నిపుణులను తీసుకువెళ్లింది. గతంలో షిమ్లా అత్యాచారం, హత్య కేసును విచారించిన సీమా పహుజా నేతృత్వంలో దర్యాప్తు కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment