
చీపురుపల్లి రూరల్ : పట్టణ నడిబొడ్డున మిట్ట మధ్యాహ్నం 1.30 గంటలకు అందరూ చూస్తుండగానే దారుణం జరిగింది. ఓ వ్యక్తి పక్కనున్న మహిళపై ఒక్కసారిగా కత్తితో దాడి చేసి గొంతు కోశాడు. అనంతరం తాను కూడా పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనతో ఆందోళనకు గురైన స్థానికులు తర్వాత వారు భార్యాభర్తలని గమనించి ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే.. చీపురుపల్లి పట్టణంలోని పిల్లపేట గ్రామానికి చెందిన మామిడి వరలక్ష్మికి ఏడాదిన్నర కిందట గుర్ల మండలం తాతావారికిట్టలి గ్రామానికి చెందిన మామిడి కనకరాజు(30)తో వివాహం జరిగింది.
వీరికి తొమ్మిది నెలల బాబు ఉన్నాడు. బాబు పుట్టిన తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో వరలక్ష్మి కన్నవారి గ్రామమైన పిల్లపేటలో ఉంటోంది. భర్త కనకరాజు తాతావారి కిట్టలిలో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. కనకరాజు తాపీ మేస్త్రిగా పని చేస్తుండగా.. వరలక్ష్మి పట్టణంలోని హాట్‌చిప్స్ దుకాణంలో పని చేస్తోంది. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం 1.30 ప్రాంతంలో దుకాణంలో పని చేస్తున్న భార్య వద్దకు కనకరాజు వెళ్లి కలిసి ఉందాం ఇంటికి రమ్మని కోరగా.. వరలక్ష్మి తిరస్కరించింది.
ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా, కనకరాజు సహనం కోల్పోయి తనతో తెచ్చుకున్న కత్తితో భార్య గొంతు కోశాడు. వెంటనే అతను కూడా పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. స్థానికులు స్పందించి వారిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించగా, వైద్యులు వరలక్ష్మికి కుట్లు వేశారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కనకరాజును జిల్లా కేంద్రాస్పత్రికి తరలించగా అక్కడ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(చదవండి: భార్య , బిడ్డల్ని రంపంతో కోసి చంపేశాడు!)
Comments
Please login to add a commentAdd a comment