ప్రొద్దుటూరు: కాన్పు చేసినందుకు డబ్బు ఇవ్వలేదనే అక్కసుతో బాలింతకు ఏకంగా ఎయిడ్స్ వ్యాధిని అంటకట్టింది ఒక ఎఫ్‌ఎన్‌ఓ (స్టాఫ్‌నర్స్ సహాయకురాలు). దీంతో భార్య, పసికందు తనకు వద్దని భర్త తీవ్ర ఆవేదనతో ఆస్పత్రి నుంచి వెళ్లిపోయాడు. కొద్ది సేపటి తర్వాత తీరిగ్గా వచ్చిన ఎఫ్‌ఎన్‌ఓ ఆమెకు ఎయిడ్స్ లేదని, డబ్బు ఇవ్వలేదనే కోపంతో ఆ వ్యాధి సోకినట్లు చెప్పానని తెలిపింది. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలో చోటు చేసుకుంది.
బాధితులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చాపాడు మండలం, సోమాపురం గ్రామానికి చెందిన బొజ్జ సుభాషిణి పురిటి నొప్పులు రావడంతో ఆదివారం జిల్లా ఆస్పత్రికి వచ్చింది. అదే రోజు రాత్రి ఆమె సాధారణ ప్రసవమై ఆడపిల్లకు జన్మనిచ్చింది. కొంత సేపటి తర్వాత ఎఫ్‌ఎన్‌ఓ లత వారి వద్దకు వచ్చి రూ. 2 వేలు ఇవ్వాలని అడిగింది. ప్రస్తుతానికి తన వద్ద డబ్బులు లేవని, ఉదయం భర్త రాగానే ఇస్తానని సుభాషిణి తెలిపింది. ఈ క్రమంలో సుభాషిణి, పసికందును చూసేందుకు సోమవారం ఆమె భర్త గురుప్రసాద్, అత్త జిల్లా ఆస్పత్రికి వచ్చారు. ఇంతలోనే వారి వద్దకు వచ్చిన ఎఫ్‌ఎన్‌ఓ లత మీ భార్యకు ఎయిడ్స్ ఉందని గురుప్రసాద్‌కు చెప్పింది.
భార్య, పాప వద్దని రోదిస్తూ వెళ్లిపోయిన భర్త
భార్యకు ఎయిడ్స్ ఉందని ఆమె చెప్పడంతో భర్త తీవ్ర ఆవేదనకు లోనయ్యాడు. రోదిస్తూ ఆస్పత్రిలోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కొద్ది సేపటి తర్వాత తేరుకొని నాకు భార్య, బిడ్డ వద్దని ఆస్పత్రి నుంచి వెళ్లిపోయాడు. దీంతో సుభాషిణి ఏడుస్తూ ఉండిపోయింది. కొద్ది సేపటి తర్వాత ఆమె వద్దకు వచ్చిన ఎఫ్‌ఎన్‌ఓ లత నాకు డబ్బులు ఇవ్వనందుకే నీకు ఎయిడ్స్ ఉందని చెప్పానని, ఎలాంటి వ్యాధి లేదని తెలిపింది. ఈ విషయం మీ అత్త, భర్తకు చెప్పు అని సూచించి తిన్నగా అక్కడి నుంచి జారుకుంది.
లతపై గతంలో కూడా అనేక ఆరోపణలు వచ్చాయి. కాన్పు అయిన వారి వద్ద డబ్బు డిమాండు చేస్తోందని పలు మార్లు ఆస్పత్రి ఉన్నతాధికారులకు ఫిర్యాదులు కూడా వెళ్లాయి. ఆరోపణలు వచ్చిన ప్రతిసారి అధికారులు చర్యలు తీసుకోకుండా మందలించి పంపిస్తూ వచ్చారు. సుభాషిణి గర్భం దాల్చిన నాటి నుంచి జిల్లా ఆస్పత్రిలోనే పరీక్షలు చేయించుకునేది. ఈ క్రమంలోనే ఆమెకు ఈ ఏడాది జనవరి 31 హెచ్‌ఐవీ పరీక్షలు చేయగా నెగిటివ్‌గా నిర్ధారణ అయింది. సోమవారం కూడా ఆమెకు మరోసారి పరీక్షలు చేయగా నెగిటివ్ రిపోర్టు వచ్చింది.
మా అత్తోళ్లు నన్ను వద్దంటున్నారు..ఇప్పుడేం చేయాలి
‘డబ్బులు కావాలంటే ఇస్తాం కదా.. రూ. 2 వేల కోసం నా జీవితాన్ని నాశనం చేస్తారా.. ఇప్పుడు నా పరిస్థితి ఏంటీ’ అని సుభాషిణి రోదించసాగింది. డబ్బు ఇవ్వలేదనే అక్కసుతో ఉదయం నుంచి ఎఫ్‌ఎన్‌ఓ నోటికి వచ్చినట్లు దుర్భాషలాడుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మా అత్తోళ్లు నన్ను వద్దంటున్నారని గుండె పగిలేలా విలపిస్తోంది. డబ్బు కోసం లేని జబ్బును తనకు అంట కట్టిందని ఆమె తెలిపింది. తనను, తన కుంటుంబ సభ్యులను మానసిక క్షోభకు గురి చేసిన ఎఫ్‌ఎన్‌ఓ లతపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని సుభాషిణి జిల్లా అధికారులను వేడుకుంటోంది. ఈ విషయమై ఆమె టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. లతపై కేసు నమోదు చేయాలని పోలీసులను కోరింది.
విచారణ చేసి చర్యలు తీసుకుంటాం
ఈ విషయమై ఇప్పటికే విచారణ చేశాను. బాధితురాలితో మాట్లాడి వివరాలు సేకరించాం. జనవరి 31న, ఈ రోజు హెచ్‌ఐవీ పరీక్షలు చేయగా ఆమెకు నెగిటివ్ అని రిపోర్టు వచ్చింది. జరిగిన విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాను. పూర్తి స్థాయి విచారణ చేసి చర్యలు తీసుకుంటాను.
– డేవిడ్ సెల్విన్‌రాజ్, జిల్లా ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్
Comments
Please login to add a commentAdd a comment