
మీర్జాపూర్/ఉత్తరప్రదేశ్: మూడు తరాల పాతదైన ఓ ఇల్లు కూలి 5 మంది మరణించిన ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో చోటు చేసుకుంది. బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఇంటి పైకప్పు కూలడంతో ఇంట్లో ఉన్న 5 మంది నిద్రలోనే కన్ను మూశారు. మరణించిన వారిని మోటార్ మెకానిక్ ఉమాశంకర్ (50), ఆయన భార్య గుడియా (48), కుమారులు శుభమ్ (22), సౌరభ్ (18), కూతురు సంధ్య (20)లుగా గుర్తించారు.
కాగా, మరొక కుమర్తె వారణాసిలో చదువుతోంది. ప్రమాద సమయంలో ఆమె ఇంట్లో లేకపోవడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ ఏడాది నవంబర్‌లో ఆమె పెళ్లి చేయాలని కుటుంబం నిర్ణయించుకున్న నేపథ్యంలో ఈ ఘటన జరగడం గమనార్హం. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ విషయంపై విచారం వ్యక్తం చేశారు. మరణించిన ఒక్కొక్కరి తరఫున రూ. 2లక్షల నష్టపరిహారం అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.