సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండల్లో బుధవారం వరుస స్నాచింగ్స్‌తో సవాల్ విసిరిన సింగిల్ స్నాచర్ మొత్తం ఏడు నేరాలు చేసినట్లు తేలింది. ఉదయం అల్వాల్‌లో ప్రారంభించిన అతగాడు సాయంత్రం మేడిపల్లిలో ముగించాడు. ఈ ఏడింటిలోనూ మొదటి రెండూ విఫలం కాగా... ఆ తర్వాత అయిదింటిలోనూ కలిపి 18.5 తులాల బంగారం కొట్టేశాడు. ఉప్పల్ నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఇతడి కోసం మూడు పోలీసు కమిషనరేట్లకు చెందిన టాస్క్‌ఫోర్స్, ఎస్‌ఓటీ పోలీసులు గాలిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం ఆసిఫ్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని జిర్రా రోడ్‌లో యాక్టివా వాహనం చోరీ చేసిన ఈ స్నాచర్ బుధవారం ఉదయం తన ‘పని’ మొదలెట్టాడు.
అల్వాల్ పరిధిలోని ఇందిరానగర్‌కు చెందిన పుష్ప ఇళ్లల్లో పని చేస్తుంటారు. పనులు ముగించుకున్న ఈమె బుధవారం బుధవారం ఉదయం 10.45 గంటలకు కానాజీగూడ ప్రాంతంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆమె మెడలో ఉన్న రోల్డ్ గోల్డ్ గోలుసును బంగారంతో చేసిందిగా భావించిన స్నాచర్ వెనుక నుంచి వచ్చి లాక్కుపోవడానికి ప్రయత్నించాడు. ఇది గమనించిన ఆమె అప్రమత్తమై కేకలు వేయడంతో అక్కడ నుంచి వాహనంపై పారిపోయాడు. ఆలస్యంగా స్పందించిన ఆమె బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చదవండి: ఐదున్నర గంటలు..6 నేరాలు.. వీడు మామూలోడు కాదురోయ్!
అక్కడి నుంచి పేట్‌బషీరాబాద్ పరిధిలోని భాగ్యలక్ష్మి కాలనీకి వెళ్లిన స్నాచర్ ఉమారాణి మెడలో గొలుసు చోరీ చేయడానికి ప్రయత్నించాడు. ఈ రెండూ విఫలం కావడంతో.. రాఘవేంద్ర కాలనీ, శ్రీరాంనగర్ కాలనీ, మారేడ్‌పల్లిలోని ఇంద్రపురి రైల్వే కాలనీ, తుకారాంగేట్‌లోని సమోసా గార్డెన్స్, మేడిపల్లిలోని లక్ష్మీనగర్ కాలనీల్లో పంజా విసిరాడు. సాయంత్రం 4.30 గంటలకు ఆఖరి నేరం చేసిన స్నాచర్ అక్కడ నుంచి ఉప్పల్ వరకు వచ్చాడు.
ఈ కదలికలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఉప్పల్‌లోని ఓ గల్లీలోకి ప్రవేశించిన దుండగుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీ కెమెరాలు లేకపోవడంతో నాగోల్, హబ్సిగూడ, రామాంతపూర్ రోడ్లలోని కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇతడు ఎక్కడి వాడు? ఎక్కడ బస చేశాడు? కొన్ని నేరాలకు మధ్య సమయంలో ఎక్కడ ఉన్నాడు? అనే వివరాలను ఆరా తీస్తున్నారు.
త్వరలో పట్టుకుంటాం
బుధవారం వరుస స్నాచింగ్స్‌కు పాల్పడిన దుండగుడికి సంబంధించి కొన్ని ఆధారాలు లభించాయి. వాటి ఆధారంగా ముందుకు వెళ్తున్నాం. త్వరలోనే నేరగాడిని పట్టుకుంటాం. సైబరాబాద్, రాచకొండ పోలీసులతోనూ సమన్వయం ఏర్పాటు చేసుకుని పని చేస్తున్నాం. చాలా కాలం తర్వాత ఇలాంటి ఉదంతం చోటు చేసుకుంది. పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నాం.
– సీవీ ఆనంద్, సిటీ సీపీ
Comments
Please login to add a commentAdd a comment