సాక్షి, గుంటూరు(తెనాలి): అధిక వడ్డీ ఆశ చూపి పలువురిని మోసగించిన కేసులో ఎట్టకేలకు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మండూరు గ్రామానికి చెందిన రెడ్డి వెంకాయమ్మ అలియాస్ రెడ్డి లత, ఆమె భర్త వెంకట శివకృష్ణారావుతోపాటు షేక్ హసీనా అనే మహిళను చుండూరు పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం వీరికి రిమాండ్ విధించింది. వీరిపై సెక్షన్–420, డిపాజిటర్స్ యాక్ట్, చిట్‌ఫండ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్టు చుండూరు సీఐ కళ్యాణ్‌రాజు వెల్లడించారు.
అసలేం జరిగిందంటే..
మండూరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కోడలు, రియల్టరైన రెడ్డి లత పెట్టుబడి కోసం అదే గ్రామానికి చెందిన ఉయ్యూరు శ్రీలత అనే మహిళకు 20 శాతం వాటా ఆశచూపింది. శ్రీలత గ్రామంలో తనకు తెలిసిన వారిని ఆశ్రయించి వారికి రూ.10 వడ్డీ ఇస్తానని చెప్పి కొందరి నుంచి రూ.లక్షల డబ్బు వసూలు చేసింది. షేక్ హసీనా అనే మహిళ తన ఇంటి సమీపంలోని సగర కులానికి చెందిన మహిళలకు రూ.5 వడ్డీ ఆశ చూపి మరికొన్ని రూ.లక్షలు సమకూర్చింది. మొత్తం కలిపి శ్రీలత చేతులమీదుగా రూ.1.83 కోట్ల వరకు రెడ్డి లతకు అప్పగించినట్టు బాధితులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.
చదవండి: (Hyderabad: పాతబస్తీలోని కాలాపత్తర్‌లో దారుణం.. వీడియోకాల్‌లో..)
కేవలం శ్రీలత నుంచి మాత్రమే మొత్తం డబ్బులు తీసుకున్న రెడ్డి లత ఆ తర్వాత ప్లేటు ఫిరాయించింది. గొల్లుమన్న బాధితులు పురుగుమందు డబ్బాలతో ధర్నాకు దిగారు. నోట్లు, పత్రాలు లేకుండా ఇచ్చిన అప్పులు కావటంతో వీరి మొర ఎవరూ ఆలకించలేదు. ఈ నేపథ్యంలో ఈనెల 4న ఉయ్యూరు శ్రీలత పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. అప్పటికే ఈ కేసు విషయంలో పోలీసులు కూపీ లాగుతూ వచ్చారు. రెడ్డి లత, ఆమె భర్త వెంకట శివకృష్ణారావు హైదరాబాద్‌లో ఉంటున్న బంధువుకు కోటి రూపాయల వరకు బాకీ పడ్డారు. ఇటీవల ఆ బకాయిని తిరిగి చెల్లించినట్టు పోలీసులు గుర్తించారు. అలాగే కూచిపూడి లాకుల వద్ద కొంత స్థలాన్ని కూడా రెడ్డి లత కొన్నట్టు గుర్తించారు.
కొద్దిరోజుల క్రితం ఆ స్థలాన్ని వేరొకరికి అమ్మేందుకు యత్నించగా, బాధితులు అక్కడకు వెళ్లి గుడిసెలు వేసుకుని ఆందోళన చేశారు. దీంతో కొనేందుకు వచ్చిన పార్టీ వెనక్కు వెళ్లిపోయింది. ఈ అమ్మకాలు, కొనుగోళ్లు అన్నీ బ్యాంకు లావాదేవీల ద్వారానే జరిగాయని తెలుసుకున్న పోలీసులు రెడ్డి లత, ఆమె భర్త వెంకట శివకృష్ణారావును, వడ్డీ ఆశతో ఈ మోసంలో పాత్రధారి అయిన హసీనాను అరెస్టు చేశారు. ఇదే కేసులో మరికొన్ని అరెస్టులు ఉంటాయని తెలుస్తోంది. ఈ కేసులో మొత్తం ఏడుగురు బాధితులు రూ.1.28 కోట్ల వరకు మోసపోయినట్టు సమాచారం.
చదవండి: (మహిళా డాక్టర్ ఆత్మహత్య.. అదే కారణమా?.. మరేదైనానా?)
Comments
Please login to add a commentAdd a comment