high interests
-
అధికవడ్డీ ఆశచూపి... రూ.15 కోట్లకు పైగా వసూలు చేసిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి
నాగర్‌కర్నూల్: మధ్యతరగతి కుటుంబాల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొంత మంది కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతూనే ఉంటారు. అధిక వడ్డీ ఇస్తామంటూ నమ్మబలికి మధ్యతరగతి కుటుంబాలను రోడ్డుపాల చేయడం, మోసాలకు పాల్పడడం నిత్యం ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి సంఘటనే జిల్లాలో తాజాగా చోటుచేసుకుంది. గుట్టుచుప్పడు కాకుండా బాధితుల నుంచి పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేశాడు ఓ రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి. నాగర్‌కర్నూల్ మండలం గుడిపల్లి గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి హైదరాబాద్‌లో నివాసముంటున్నాడు. అయితే నాగర్‌కర్నూల్‌లో ఉంటున్న తన తమ్ముడికి ఉన్న పరిచయాలను ఆసరాగా చేసుకుని గత సంవత్సరం క్రితం ఈ మోసానికి తెరలేపాడు. రూ.లక్షకు రూ.20వేలు వడ్డీ ఇస్తానంటూ.. అండమాన్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో రియల్‌ఎస్టేట్‌తోపాటు కాపీ తోటలు ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాలని దీనికి రూ.లక్షకు 20వేల వడ్డీ ఇప్పిస్తానని నమ్మబలికి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టించాడు. నమ్మకం కుదిరేందుకు దాదాపు నాలుగైదు నెలలు చెప్పినట్లుగానే వడ్డీని ఇప్పించాడు. అనంతరం ఇంత వడ్డీ రాదని రూ.లక్షకు రూ.9వేలకు వరకు వస్తుందని బాధితులకు చెప్పి వారిని ఒప్పించారు. ఒప్పించడంతోపాటు వారికి పరిచయం ఉన్న వ్యక్తులను కూడా ఇందులో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించాడు. దాదాపు జిల్లా వ్యాప్తంగా రూ.15కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ఇటీవల డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ సదరు రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగిపై వత్తిడి తేవడంతో ఇప్పుడు, అప్పుడంటూ కొన్ని రోజులు గడిపాడు. చివరికి నాగర్‌కర్నూల్‌లో ఉన్న ఓ ప్లాట్‌ను విక్రయించి సెల్‌ఫోన్‌ను స్విచ్ఆఫ్ చేశాడు. దీంతో జిల్లా కేంద్రంలో ఉన్న అతని సోదరుడి వద్దకు బాధితులు వెళ్లి ఆరా తీశారు. అతని అన్న చిరునామా చెప్పాలంటూ ఒత్తిడి తేవడంతో రెండు రోజులు సమయం ఇవ్వాలని, తనని వదిలిపెట్టాలని వేడుకోగా కనికరించిన వెళ్లిపోయారు. తాజాగా అతని తమ్ముడు కూడా సెల్‌ఫోన్ స్విచ్ఆఫ్ చేసి ఇంట్లో నుంచి పరారయ్యాడు. ● ఇద్దరు సోదరులను నమ్మి డబ్బులు అప్పజెప్పిన బాధితులకు తిరిగి డబ్బు ఇవ్వకపోగా వారిని బెదిరించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. ఈ నెల 18న ఇద్దరు సోదరుల్లో తమ్ముడిని సదరు బాధితులు పట్టుకుని వారి సొంత ఊరైన గుడిపల్లికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నం చేశారు. అయితే తన అన్న అడ్రస్ చెబుతానని, తనకు రెండు రోజులు సమయం ఇవ్వాలని బాధితులను వేడుకోవడంతో మధ్యాహ్నం 3గంటల సమయంలో బాధితుల్లో ఒక వ్యక్తి సదురు వ్యక్తిని ఇంటి వద్ద వదిలివేయడం జరిగింది. అనంతరం 5గంటల సమయంలో బాధితుల్లో ఒకరికి ఒక వ్యక్తిని కిడ్నాప్ చేశారంటూ తన భార్య ఫిర్యాదు చేసిందని ఫోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ రావడంతో బాధితులుంతా ఖంగుతిన్నారు. అనంతరం పోలీసులు చుట్టుపక్కల ఉన్న సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలించగా బాధితుల్లో ఒకరు సదరు వ్యక్తిని ఇంటి వద్ద దిగబెట్టడం స్పష్టంగా కనిపించినట్లు తెలిసింది. ఇదిలాఉండగా, ఈ సంఘటనపై నాగర్‌కర్నూల్ పోలీసులు విచారణ చేస్తున్నారు. కాగా ఇద్దరు సోదరులను పట్టుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. బాధితులెవరూ ఫిర్యాదు చేయలేదు అధిక వడ్డీ ఆశ చూపి డబ్బులు వసూలు చేసిన సంఘటనలో బాధితులు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. లక్ష్మణ్ అనే వ్యక్తి మిస్సింగ్‌పై అతని భార్య ఫిర్యాదు ఇచ్చింది. ఈ విషయంపై అన్నికో ణాల్లో విచారణ చేస్తున్నాం. – విజయ్ కుమార్ ఎస్ఐ, నాగర్‌కర్నూల్ -
రూ. 10వడ్డీ అంటే.. బయట ఐదుకు తీసుకొచ్చి మరీ ఇచ్చారు.. అప్పుడే అసలు కథ..
సాక్షి, గుంటూరు(తెనాలి): అధిక వడ్డీ ఆశ చూపి పలువురిని మోసగించిన కేసులో ఎట్టకేలకు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మండూరు గ్రామానికి చెందిన రెడ్డి వెంకాయమ్మ అలియాస్ రెడ్డి లత, ఆమె భర్త వెంకట శివకృష్ణారావుతోపాటు షేక్ హసీనా అనే మహిళను చుండూరు పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం వీరికి రిమాండ్ విధించింది. వీరిపై సెక్షన్–420, డిపాజిటర్స్ యాక్ట్, చిట్‌ఫండ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్టు చుండూరు సీఐ కళ్యాణ్‌రాజు వెల్లడించారు. అసలేం జరిగిందంటే.. మండూరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కోడలు, రియల్టరైన రెడ్డి లత పెట్టుబడి కోసం అదే గ్రామానికి చెందిన ఉయ్యూరు శ్రీలత అనే మహిళకు 20 శాతం వాటా ఆశచూపింది. శ్రీలత గ్రామంలో తనకు తెలిసిన వారిని ఆశ్రయించి వారికి రూ.10 వడ్డీ ఇస్తానని చెప్పి కొందరి నుంచి రూ.లక్షల డబ్బు వసూలు చేసింది. షేక్ హసీనా అనే మహిళ తన ఇంటి సమీపంలోని సగర కులానికి చెందిన మహిళలకు రూ.5 వడ్డీ ఆశ చూపి మరికొన్ని రూ.లక్షలు సమకూర్చింది. మొత్తం కలిపి శ్రీలత చేతులమీదుగా రూ.1.83 కోట్ల వరకు రెడ్డి లతకు అప్పగించినట్టు బాధితులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: (Hyderabad: పాతబస్తీలోని కాలాపత్తర్‌లో దారుణం.. వీడియోకాల్‌లో..) కేవలం శ్రీలత నుంచి మాత్రమే మొత్తం డబ్బులు తీసుకున్న రెడ్డి లత ఆ తర్వాత ప్లేటు ఫిరాయించింది. గొల్లుమన్న బాధితులు పురుగుమందు డబ్బాలతో ధర్నాకు దిగారు. నోట్లు, పత్రాలు లేకుండా ఇచ్చిన అప్పులు కావటంతో వీరి మొర ఎవరూ ఆలకించలేదు. ఈ నేపథ్యంలో ఈనెల 4న ఉయ్యూరు శ్రీలత పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. అప్పటికే ఈ కేసు విషయంలో పోలీసులు కూపీ లాగుతూ వచ్చారు. రెడ్డి లత, ఆమె భర్త వెంకట శివకృష్ణారావు హైదరాబాద్‌లో ఉంటున్న బంధువుకు కోటి రూపాయల వరకు బాకీ పడ్డారు. ఇటీవల ఆ బకాయిని తిరిగి చెల్లించినట్టు పోలీసులు గుర్తించారు. అలాగే కూచిపూడి లాకుల వద్ద కొంత స్థలాన్ని కూడా రెడ్డి లత కొన్నట్టు గుర్తించారు. కొద్దిరోజుల క్రితం ఆ స్థలాన్ని వేరొకరికి అమ్మేందుకు యత్నించగా, బాధితులు అక్కడకు వెళ్లి గుడిసెలు వేసుకుని ఆందోళన చేశారు. దీంతో కొనేందుకు వచ్చిన పార్టీ వెనక్కు వెళ్లిపోయింది. ఈ అమ్మకాలు, కొనుగోళ్లు అన్నీ బ్యాంకు లావాదేవీల ద్వారానే జరిగాయని తెలుసుకున్న పోలీసులు రెడ్డి లత, ఆమె భర్త వెంకట శివకృష్ణారావును, వడ్డీ ఆశతో ఈ మోసంలో పాత్రధారి అయిన హసీనాను అరెస్టు చేశారు. ఇదే కేసులో మరికొన్ని అరెస్టులు ఉంటాయని తెలుస్తోంది. ఈ కేసులో మొత్తం ఏడుగురు బాధితులు రూ.1.28 కోట్ల వరకు మోసపోయినట్టు సమాచారం. చదవండి: (మహిళా డాక్టర్ ఆత్మహత్య.. అదే కారణమా?.. మరేదైనానా?) -
ఫారిన్ ట్రేడింగ్ మాయాజాలం.. రూ.152 కోట్లతో పలాయనం
సాక్షి, చిత్తూరు, పుత్తూరు రూరల్ : అధిక వడ్డీల మోజులోపడి ఊళ్లకు ఊళ్లే మోసపోయిన ఘటన ఇది. గ్రామాలే కాదు.. తిరుపతి, తిరుత్తణి, చెన్నై వంటి ప్రాంతాలకు చెందిన వారు కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ.152 కోట్ల మేర చెన్నైకి చెందిన నోబెల్ అసెట్స్ సంస్థ ఈ కుచ్చుటోపి పెట్టింది. ఈ సంస్థ ఫారిన్ ట్రేడింగ్, షేర్ మార్కెట్ పేరుతో లాభాలు, అధిక వడ్డీలు ఎరచూపి కోట్లాది రూపాయల పెట్టుబడులు లూటీ చేసింది. ఏడాదిన్నరకు పైగా వడ్డీలు ఇవ్వక, ‘అసలు’కే ఎసరు పెట్టేసింది. పుత్తూరు, తిరుపతి, తిరుత్తణి, చెన్నై కేంద్రంగా ఉన్న సంస్థల్ని రాత్రికిరాత్రే ఖాళీచేసి ఉడాయించింది. ఎలా చేసిందంటే.. చెన్నై కేంద్రంగా పనిచేసే నోబెల్ అసెట్స్ సంస్థ 2018లో పుత్తూరులో కార్యాలయం ఆరంభించింది. ఈ సంస్థకు ప్రొపయిటర్ సి. కలైమామణి కాగా.. డైరెక్టర్లు ప్రశాంత్, సంతోష్. చెన్నై, తిరుత్తణి కేంద్రంగా రూ.100 కోట్ల పైబడి ఫారిన్ ట్రేడింగ్, షేర్‌మార్కెట్ వ్యాపారాలు సాగిస్తున్నామని చెప్పుకొచ్చారు. తమ సంస్థలో పెట్టుబడి పెట్టిన నగదును అంతర్జాతీయ షేర్మార్కెట్లో పెట్టుబడి పెడితే అమెరికన్ డాలర్, యూరప్ యూరోల్లో అధిక లాభాలు వస్తాయని నమ్మించారు. వచ్చిన అధిక లాభాలు నేరుగా డిపాజిట్లు చేసిన వారికే చెల్లిస్తామని నమ్మబలికారు. ఇలా పుత్తూరుకు సమీపంలోని వేణుగోపాలపురం, తిమ్మాపురం గ్రామస్తుల నుంచి పెట్టుబడులు ఆకర్షించారు. తొలుత.. రూ.లక్ష పెట్టుబడికి నెలకు రూ.8వేలు వడ్డీ గిట్టుబాటయ్యేలా ఏర్పాట్లుచేశారు. తమ ఖాతాల్లోకి నేరుగా లాభాలు రావటంతో ఆయా గ్రామాలకు చెందిన వారు ఉత్సాహం చూపారు. దీంతో సంస్థ యాజమాన్యం తిరుపతి, తిరుత్తణిలో ఆఫీసులు ప్రారంభించి కార్యక్రమాలు మరింత విస్తృతం చేసింది. నెలకు రూ.4.50ల వడ్డీ ఆశపెట్టి.. ముందస్తు ప్రణాళికతో సంస్థ యాజమాన్యం తమ ఏజెంట్ల ద్వారా మౌఖికంగా విస్తృతంగా ప్రచారం చేయించుకుని రూ.4.50ల వడ్డీ ఇస్తామంటూ నమ్మబలికింది. పెట్టుబడి పెట్టిన వారికి సంస్థ రూపొందించిన ఒప్పంద పత్రం (నకిలీ బాండు) ఇచ్చారు. ఇలా పుత్తూరుకు ఆనుకుని ఉన్న వేణుగోపాలపురంలో మొత్తం 300 కుటుంబాలకుగాను 100కు పైగా కుటుంబాలు పెట్టుబడులు పెట్టాయి. ప్రారంభంలో ఒక్కొక్కరి నుంచి రూ.3 లక్షలు నుంచి ఆపైన కోట్ల రూపాయల వరకు కట్టించుకున్నారు. రెండో దశలో తిమ్మాపురంలో సుమారు 50 కుటుంబాలకుపైగా పెట్టుబడి పెట్టాయి. రెండేళ్ల వ్యవధిలోనే పుత్తూరు, వేణుగోపాలపురం, తిమ్మాపురం పరిధిలోని గ్రామస్తులు అక్షరాల రూ.12 కోట్ల పైబడి డిపాజిట్లు చేశారు. సంస్థలో పెట్టుబడి పెట్టిన వారికి నెలనెలా అధిక వడ్డీ రావడంతో జనం ఎక్కువ సంఖ్యలో మొగ్గుచూపారు. అంతే.. సంస్థ తిరుపతిలోనూ బ్రాంచ్ ప్రారంభించింది. ఇక్కడ రూ.40 కోట్ల వరకు జనం పెట్టుబడి పెట్టినట్లు బాధితులు చెబుతున్నారు. ఇలా డిపాజిట్లు చేసిన వారిలో అధ్యాపకులు, టీచర్లు, పోలీసులు, లాయర్లు, వ్యాపారవేత్తలు ఉన్నారు. రూ.కోటి 15 లక్షలు చెల్లించాం తమిళనాడుకు చెందిన విరుదునగర్ జిల్లా పొసరిపట్టి గ్రామానికి చెందిన శరవణన్ కృష్ణస్వామికి రూ.1.15 కోట్లు చెల్లించాం. వడ్డీల పేరిట కొన్ని నెలలు చెల్లించారు. ఆ తర్వాత నుంచి ఇబ్బంది పెడుతున్నారు. నమ్మకంతో చెల్లించి మోసపోయాం. – ఎం. బాలకృష్ణన్ లక్ష్మీ ,తిమ్మాపురం, పుత్తూరు రూ.60 లక్షలు చెల్లించాం రూ.60 లక్షలు చెల్లించాం. కొద్దినెలలు వడ్డీ ఇచ్చారు. తర్వాత ఆపేశారు. అందరి వద్ద అప్పులుచేసి మరీ కట్టాం. ఇప్పుడేం చేయాలో పాలుపోవడంలేదు. ఈ దిగులుతో పక్షవాతం వచ్చింది. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి. – వి.లక్ష్మీపతి రాధ, తిమ్మాపురం, పుత్తూరు రూ.6 లక్షలు పెట్టాను నా బంధువు ఒత్తిడితో రూ.6 లక్షలు పెట్టాను. వడ్డీలేదు.. అసలూ లేదు. మా ఊళ్లో కోట్లు పెట్టిన వారున్నారు. వారికి కూడా పైసా రావడంలేదు. నాతోపాటు అందరం దిక్కుతోచని స్థితిలో ఉన్నాం. – రమేష్, వేణుగోపాలపురం ఇప్పటివరకు ఫిర్యాదుల్లేవు చట్ట వ్యతిరేకంగా ఆర్థిక కార్యకలాపాలు సాగించటం నేరం. ఈ విషయంలో ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదుల్లేవు. వస్తే బాధితులకు అండగా ఉంటాం. న్యాయం జరిగేలా చూస్తాం. ఆర్థిక నేరాలకు పాల్పడే వారిని ఉపేక్షించే ప్రసక్తేలేదు. – పి. పరమేశ్వర్‌రెడ్డి, ఎస్పీ తిరుపతి జిల్లా కరోనా సాకుతో బోర్డు తిప్పేసి.. కరోనా తొలిదశ రోజుల్లో డిపాజిట్లు రాలేదు. దీంతో సంస్థ అదే అదనుగా భావించింది. ఆ సమయంలో ఆరు నెలలపాటు వడ్డీ చెల్లించలేదు. పెట్టుబడి పెట్టిన వారి నుంచి ఒత్తిడి పెరగడంతో సంస్థ తిరిగి కార్యకలాపాలు కొనసాగించింది. కానీ, రెండుమూడు నెలలు మాత్రమే వడ్డీలు చెల్లించింది. తర్వాత ముందస్తు వ్యూహంతో మెల్లగా కార్యకలాపాలు తగ్గించింది. ఒత్తిడి పెరిగిపోవడంతో ఏజెంట్లు ముఖం చాటేశారు. దీంతో కార్యాలయాల వద్ద జనం పెరిగారు. ఇక అంతే.. పుత్తూరు, తిరుపతి కార్యాలయాలను సంస్థ ఎత్తేసింది. ఆ తర్వాత తిరుత్తణి, చెన్నైలోనూ డిపాజిట్లు చేసివారి నుంచి ఒత్తిడి పెరగడంతో రాత్రికి రాత్రే సంస్థ కార్యాలయాలు ఖాళీచేసింది. ఏజెంట్లు, మధ్యవర్తుల మాటలు నమ్మి అప్పులు తెచ్చి మరీ మోసపోయామని బాధితులు వాపోతున్నారు. ఈ మోసంపై పోలీసులు సుమోటోగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేయాలని వారు కోరుతున్నారు. -
గురువుగా నమ్మించి.. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో
పలమనేరు(చిత్తూరు జిల్లా): ఓంశక్తి గురువుగా ప్రజలతో పరిచయం పెంచుకుని ఆపై చీటీలు వేస్తూ.. అధిక వడ్డీ ఆశ చూపి వందలాది మంది నుంచి రూ.25 కోట్లు వసూలు చేసిన వ్యక్తి కనిపించకుండా పోయిన ఘటన చిత్తూరు జిల్లా బంగారుపాళెంలో చోటుచేసుకుంది. బాధితులు ఆదివారం పలమనేరు డీఎస్పీ గంగయ్యను కలసి ఈ మేరకు గోడు వెళ్లబోసుకున్నారు. వారి కథనం ప్రకారం.. బాపట్లకు చెందిన గండికోట ఆంజనేయులు 20 ఏళ్ల క్రితం బంగారుపాళేనికి వచ్చి నెహ్రూ వీధిలో ఓంశక్తి భక్తునిగా సేవలు చేసేవాడు. శక్తి పేరిట ఓ ఆలయాన్ని సైతం దాతల సాయంతో నిర్మించి అక్కడ నిత్యాన్నదానం చేయడం ప్రారంభించాడు. చదవండి: అమ్మాయిల సంఖ్య ‘అనంత’లోనే తక్కువ.. ఎందుకిలా? ఇలా భక్తులను పెంచుకుని వారితో మాల వేయిస్తూ ఏటా మేల్‌మరుత్తూర్ ఆదిపరాశక్తి గుడికి వందల సంఖ్యలో బస్సుల్లో తీసుకెళ్లేవాడు. ఇలా ప్రజల్లో నమ్మకం పెంచుకొని ఓంశక్తి పేరుతో చీటీల వ్యాపారం మొదలుపెట్టాడు. దీంతో పాటు అధికవడ్డీ ఇస్తానంటూ పలువురి నుంచి భారీగా డబ్బులు తీసుకున్నాడు. వారికి చెల్లని చెక్కులను అంటగట్టాడు. నాలుగు రోజుల క్రితం అతని ఇంటికి తాళం వేసి ఉండటంతో పలువురు ఆయనకు ఫోన్‌చేశారు. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఆయన సొంతూరైన బాపట్ల వెళ్లి ఆరా తీసినా ఆచూకీ దొరకలేదు. అతను ఇచ్చిన చెక్కుల్లో ఒక్కొక్కరికి ఒక్కో రకంగా పేరు రాసి మోసం చేసినట్టు గుర్తించారు. దీంతో డబ్బులు పోగొట్టుకున్నామని భావించిన బాధితులు ఆదివారం డీఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. బంగారుపాళేనికి చెందిన లీలమ్మ నుంచి రూ.97 లక్షలు, డి.కిశోర్ నుంచి రూ.50 లక్షలు, రమేష్ నుంచి రూ.34 లక్షలు ఇలా సుమారు 200 మంది నుంచి రూ.25 కోట్లకు పైగా డబ్బులు తీసుకున్నట్టు బాధితులు డీఎస్పీకి తెలిపారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని బంగారుపాళెం ఎస్ఐని డీఎస్పీ ఆదేశించారు. -
బంపరాఫర్ ! పోస్టాఫీస్‌లో వెయ్యితో ఖాతా తెరిస్తే ఐదేళ్లలో రూ.14 లక్షలు! పూర్తి వివరాలు
సాధారణంగా పోస్టాఫీస్‌కు సంబంధించిన అన్ని స్కీములు అధిక వడ్డీని అందిస్తాయనే విషయం తెలిసిందే! వినియోగదారుల పొదుపుకు అధిక మొత్తంలో లాభాలను అందించడంలో పోస్టాఫీస్ స్కీములు ఎప్పుడూ ముందుంటాయి. ఐతే తాజాగా మరొక అదిరిపోయే స్కీమ్‌ను మీకు పరిచయం చేస్తోంది. ఆ వివరాలు మీ కోసం.. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్). ఈ స్కీమ్ ద్వారా మదుపరులకు ఏకంగా 7.4 శాతం వడ్డీని అందిస్తోంది పోస్టల్‌శాఖ. ఈ స్కీమ్ రిటైర్ అయినవారికి, సేవింగ్ ఎకౌంట్ ఉన్న వారికి చాలా ప్రయోజనకరం. ఈ స్కీమ్ ద్వారా అధికమొత్తంలో తిరిగి సొమ్ము అందితుంది. ఎలాగంటే.. ►60 యేళ్ల పై వయసున్నవారు మాత్రమే ఎస్సీఎస్ఎస్లో అకౌంట్ తెరవడానికి అర్హులు. ► ఆసక్తి ఉన్నవారు 1000 రూపాయలతో ఖాతా తెరవొచ్చు. ►ఇలా మొత్తం పది లక్షల రూపాయలను ఇన్వెస్ట్ చేస్తే ఐదేళ్ల తర్వాత 7.4 శాతం వడ్డీతో కలిపి రూ. 14,28,964 లక్షలు రిటర్న్ వస్తాయి. ►ఆ లెక్కన మొత్తం ఐదేళ్లలో సుమారు రూ. 4 లక్షల 28 వేల వడ్డీ అందుతుంది. ►సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ గరిష్టంగా రూ. 15 లక్షల వరకు మదుపు చేయవచ్చు. ►అంతేకాదు మెచ్యురిటీ పీరియడ్ ఐదేళ్లయినప్పటికీ ఈ సమయాన్ని మరో మూడేళ్ల వరకు పొడిగించుకునే సదుపాయం కూడా ఉంది. ►ఎస్సీఎస్ఎస్లో వెయ్యి నుంచి లక్ష రూపాయలలోపు ఖాతా తెరవవచ్చు. ఐతే వడ్డీ విషయంలో ఎటువంటి మార్పు ఉండదు. ►ఈ పథకంలోని పెట్టుబడులకు సెక్షన్ 80 సి కింద ఆదాయపన్ను నుంచి మినహాయింపు కూడా ఉంది. ఇక ఆలస్యమెందుకు అవసరమైన డాక్యుమెంట్లతో మీ సమీపంలోని పోస్టాఫీస్‌లో వెంటనే అకౌంట్ తెరవండి... మీ విశ్రాంత జీవితానికి మరింత భద్రత పొందండి. చదవండి: అదృష్టమంటే ఇది.. రూ.2250 కి కొంటే.. ఏకంగా 374 కోట్లపైనే!! -
'కేశవరెడ్డి' ఆస్తుల అటాచ్మెంట్
హైదరాబాద్: కేశవరెడ్డి స్కూల్ యాజమాన్య ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ఆంధ్రప్రదేశ్ హోం శాఖ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రూ. 24.50 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని సీఐడీకి ఏపీ హోం శాఖ ఆదేశించింది. అధిక వడ్డీల ఆశ చూపి విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేసినట్టు ప్రముఖ విద్యాసంస్థల యజమాని నాగిరెడ్డి కేశవరెడ్డిపై ఆరోపణలు వెలువెత్తాయి. ఈ నేపథ్యంలో ఏపీ హోంశాఖ కేశవరెడ్డి స్కూల్ యాజమాన్య ఆస్తల అటాచ్మెంట్ చేయాలని సీఐడీని ఆదేశించింది. కాగా, నంద్యాల పట్టణం బాలాజీనగర్‌లో నివాసం ఉంటున్న కేశవరెడ్డికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విద్యా సంస్థలు ఉన్నాయి. వాటికి అవసరమైన పెట్టుబడుల కోసం విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి, వ్యాపారుల నుంచి డిపాజిట్లు సేకరించినట్టు గతంలో కేశవరెడ్డిపై ఆరోపణలు రావడంతో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.