నాగర్‌కర్నూల్: మధ్యతరగతి కుటుంబాల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొంత మంది కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతూనే ఉంటారు. అధిక వడ్డీ ఇస్తామంటూ నమ్మబలికి మధ్యతరగతి కుటుంబాలను రోడ్డుపాల చేయడం, మోసాలకు పాల్పడడం నిత్యం ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి సంఘటనే జిల్లాలో తాజాగా చోటుచేసుకుంది. గుట్టుచుప్పడు కాకుండా బాధితుల నుంచి పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేశాడు ఓ రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి. నాగర్‌కర్నూల్ మండలం గుడిపల్లి గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి హైదరాబాద్‌లో నివాసముంటున్నాడు. అయితే నాగర్‌కర్నూల్‌లో ఉంటున్న తన తమ్ముడికి ఉన్న పరిచయాలను ఆసరాగా చేసుకుని గత సంవత్సరం క్రితం ఈ మోసానికి తెరలేపాడు.
రూ.లక్షకు రూ.20వేలు వడ్డీ ఇస్తానంటూ..
అండమాన్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో రియల్‌ఎస్టేట్‌తోపాటు కాపీ తోటలు ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాలని దీనికి రూ.లక్షకు 20వేల వడ్డీ ఇప్పిస్తానని నమ్మబలికి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టించాడు. నమ్మకం కుదిరేందుకు దాదాపు నాలుగైదు నెలలు చెప్పినట్లుగానే వడ్డీని ఇప్పించాడు. అనంతరం ఇంత వడ్డీ రాదని రూ.లక్షకు రూ.9వేలకు వరకు వస్తుందని బాధితులకు చెప్పి వారిని ఒప్పించారు. ఒప్పించడంతోపాటు వారికి పరిచయం ఉన్న వ్యక్తులను కూడా ఇందులో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించాడు. దాదాపు జిల్లా వ్యాప్తంగా రూ.15కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి.
అయితే ఇటీవల డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ సదరు రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగిపై వత్తిడి తేవడంతో ఇప్పుడు, అప్పుడంటూ కొన్ని రోజులు గడిపాడు. చివరికి నాగర్‌కర్నూల్‌లో ఉన్న ఓ ప్లాట్‌ను విక్రయించి సెల్‌ఫోన్‌ను స్విచ్‌ఆఫ్ చేశాడు. దీంతో జిల్లా కేంద్రంలో ఉన్న అతని సోదరుడి వద్దకు బాధితులు వెళ్లి ఆరా తీశారు. అతని అన్న చిరునామా చెప్పాలంటూ ఒత్తిడి తేవడంతో రెండు రోజులు సమయం ఇవ్వాలని, తనని వదిలిపెట్టాలని వేడుకోగా కనికరించిన వెళ్లిపోయారు. తాజాగా అతని తమ్ముడు కూడా సెల్‌ఫోన్ స్విచ్‌ఆఫ్ చేసి ఇంట్లో నుంచి పరారయ్యాడు.
● ఇద్దరు సోదరులను నమ్మి డబ్బులు అప్పజెప్పిన బాధితులకు తిరిగి డబ్బు ఇవ్వకపోగా వారిని బెదిరించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. ఈ నెల 18న ఇద్దరు సోదరుల్లో తమ్ముడిని సదరు బాధితులు పట్టుకుని వారి సొంత ఊరైన గుడిపల్లికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నం చేశారు. అయితే తన అన్న అడ్రస్ చెబుతానని, తనకు రెండు రోజులు సమయం ఇవ్వాలని బాధితులను వేడుకోవడంతో మధ్యాహ్నం 3గంటల సమయంలో బాధితుల్లో ఒక వ్యక్తి సదురు వ్యక్తిని ఇంటి వద్ద వదిలివేయడం జరిగింది.
అనంతరం 5గంటల సమయంలో బాధితుల్లో ఒకరికి ఒక వ్యక్తిని కిడ్నాప్ చేశారంటూ తన భార్య ఫిర్యాదు చేసిందని ఫోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ రావడంతో బాధితులుంతా ఖంగుతిన్నారు. అనంతరం పోలీసులు చుట్టుపక్కల ఉన్న సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలించగా బాధితుల్లో ఒకరు సదరు వ్యక్తిని ఇంటి వద్ద దిగబెట్టడం స్పష్టంగా కనిపించినట్లు తెలిసింది. ఇదిలాఉండగా, ఈ సంఘటనపై నాగర్‌కర్నూల్ పోలీసులు విచారణ చేస్తున్నారు. కాగా ఇద్దరు సోదరులను పట్టుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.
బాధితులెవరూ ఫిర్యాదు చేయలేదు
అధిక వడ్డీ ఆశ చూపి డబ్బులు వసూలు చేసిన సంఘటనలో బాధితులు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. లక్ష్మణ్ అనే వ్యక్తి మిస్సింగ్‌పై అతని భార్య ఫిర్యాదు ఇచ్చింది. ఈ విషయంపై అన్నికో ణాల్లో విచారణ చేస్తున్నాం.
– విజయ్ కుమార్ ఎస్‌ఐ, నాగర్‌కర్నూల్
Comments
Please login to add a commentAdd a comment