ఫారిన్‌ ట్రేడింగ్‌ మాయాజాలం.. రూ.152 కోట్లతో పలాయనం | Fraud In name of Foreign Trading Noble Assets Company Chennai | Sakshi
Sakshi News home page

ఫారిన్‌ ట్రేడింగ్‌ మాయాజాలం.. రూ.152 కోట్లతో పలాయనం

Published Wed, Jun 29 2022 4:38 AM | Last Updated on Wed, Jun 29 2022 7:47 AM

Fraud In name of Foreign Trading Noble Assets Company Chennai - Sakshi

పుత్తూరులో నోబల్‌ అసెట్స్‌ కార్యాలయం ఏర్పాటుచేసి ఖాళీ చేసిన అపార్ట్‌మెంట్‌

సాక్షి, చిత్తూరు, పుత్తూరు రూరల్‌ : అధిక వడ్డీల మోజులోపడి ఊళ్లకు ఊళ్లే మోసపోయిన ఘటన ఇది. గ్రామాలే కాదు.. తిరుపతి, తిరుత్తణి, చెన్నై వంటి ప్రాంతాలకు చెందిన వారు కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ.152 కోట్ల మేర చెన్నైకి చెందిన నోబెల్‌ అసెట్స్‌ సంస్థ ఈ కుచ్చుటోపి పెట్టింది. ఈ సంస్థ ఫారిన్‌ ట్రేడింగ్, షేర్‌ మార్కెట్‌ పేరుతో లాభాలు, అధిక వడ్డీలు ఎరచూపి కోట్లాది రూపాయల పెట్టుబడులు లూటీ చేసింది. ఏడాదిన్నరకు పైగా వడ్డీలు ఇవ్వక, ‘అసలు’కే ఎసరు పెట్టేసింది. పుత్తూరు, తిరుపతి, తిరుత్తణి, చెన్నై కేంద్రంగా ఉన్న సంస్థల్ని రాత్రికిరాత్రే ఖాళీచేసి ఉడాయించింది. 

ఎలా చేసిందంటే..
చెన్నై కేంద్రంగా పనిచేసే నోబెల్‌ అసెట్స్‌ సంస్థ 2018లో పుత్తూరులో కార్యాలయం ఆరంభించింది. ఈ సంస్థకు ప్రొపయిటర్‌ సి. కలైమామణి కాగా.. డైరెక్టర్లు ప్రశాంత్, సంతోష్‌. చెన్నై, తిరుత్తణి కేంద్రంగా రూ.100 కోట్ల పైబడి ఫారిన్‌ ట్రేడింగ్, షేర్‌మార్కెట్‌ వ్యాపారాలు సాగిస్తున్నామని చెప్పుకొచ్చారు. తమ సంస్థలో పెట్టుబడి పెట్టిన నగదును అంతర్జాతీయ షేర్‌మార్కెట్‌లో పెట్టుబడి పెడితే అమెరికన్‌ డాలర్, యూరప్‌ యూరోల్లో అధిక లాభాలు వస్తాయని నమ్మించారు.

వచ్చిన అధిక లాభాలు నేరుగా డిపాజిట్లు చేసిన వారికే చెల్లిస్తామని నమ్మబలికారు. ఇలా పుత్తూరుకు సమీపంలోని వేణుగోపాలపురం, తిమ్మాపురం గ్రామస్తుల నుంచి పెట్టుబడులు ఆకర్షించారు. తొలుత.. రూ.లక్ష పెట్టుబడికి నెలకు రూ.8వేలు వడ్డీ గిట్టుబాటయ్యేలా ఏర్పాట్లుచేశారు. తమ ఖాతాల్లోకి నేరుగా లాభాలు రావటంతో ఆయా గ్రామాలకు చెందిన వారు ఉత్సాహం చూపారు. దీంతో సంస్థ యాజమాన్యం తిరుపతి, తిరుత్తణిలో ఆఫీసులు ప్రారంభించి కార్యక్రమాలు మరింత విస్తృతం చేసింది.

నెలకు రూ.4.50ల వడ్డీ ఆశపెట్టి..
ముందస్తు ప్రణాళికతో సంస్థ యాజమాన్యం తమ ఏజెంట్ల ద్వారా మౌఖికంగా విస్తృతంగా ప్రచారం చేయించుకుని రూ.4.50ల వడ్డీ ఇస్తామంటూ నమ్మబలికింది. పెట్టుబడి పెట్టిన వారికి సంస్థ రూపొందించిన ఒప్పంద పత్రం (నకిలీ బాండు) ఇచ్చారు. ఇలా పుత్తూరుకు ఆనుకుని ఉన్న వేణుగోపాలపురంలో మొత్తం 300 కుటుంబాలకుగాను 100కు పైగా కుటుంబాలు పెట్టుబడులు పెట్టాయి. ప్రారంభంలో ఒక్కొక్కరి నుంచి రూ.3 లక్షలు నుంచి ఆపైన కోట్ల రూపాయల వరకు కట్టించుకున్నారు.

రెండో దశలో తిమ్మాపురంలో సుమారు 50 కుటుంబాలకుపైగా పెట్టుబడి పెట్టాయి. రెండేళ్ల వ్యవధిలోనే పుత్తూరు, వేణుగోపాలపురం, తిమ్మాపురం పరిధిలోని గ్రామస్తులు అక్షరాల రూ.12 కోట్ల పైబడి డిపాజిట్లు చేశారు. సంస్థలో పెట్టుబడి పెట్టిన వారికి నెలనెలా అధిక వడ్డీ రావడంతో జనం ఎక్కువ సంఖ్యలో మొగ్గుచూపారు. అంతే.. సంస్థ తిరుపతిలోనూ బ్రాంచ్‌ ప్రారంభించింది. ఇక్కడ రూ.40 కోట్ల వరకు జనం పెట్టుబడి పెట్టినట్లు బాధితులు చెబుతున్నారు. ఇలా డిపాజిట్లు చేసిన వారిలో అధ్యాపకులు, టీచర్లు, పోలీసులు, లాయర్లు, వ్యాపారవేత్తలు ఉన్నారు. 

రూ.కోటి 15 లక్షలు చెల్లించాం
తమిళనాడుకు చెందిన విరుదునగర్‌ జిల్లా పొసరిపట్టి గ్రామానికి చెందిన శరవణన్‌ కృష్ణస్వామికి రూ.1.15 కోట్లు చెల్లించాం. వడ్డీల పేరిట కొన్ని నెలలు చెల్లించారు. ఆ తర్వాత నుంచి ఇబ్బంది పెడుతున్నారు. నమ్మకంతో చెల్లించి మోసపోయాం.     
    – ఎం. బాలకృష్ణన్‌ లక్ష్మీ ,తిమ్మాపురం, పుత్తూరు

రూ.60 లక్షలు చెల్లించాం
రూ.60 లక్షలు చెల్లించాం. కొద్దినెలలు వడ్డీ ఇచ్చారు. తర్వాత ఆపేశారు. అందరి వద్ద అప్పులుచేసి మరీ కట్టాం. ఇప్పుడేం చేయాలో పాలుపోవడంలేదు. ఈ దిగులుతో పక్షవాతం వచ్చింది. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి.
    – వి.లక్ష్మీపతి రాధ, తిమ్మాపురం, పుత్తూరు

రూ.6 లక్షలు పెట్టాను
నా బంధువు ఒత్తిడితో రూ.6 లక్షలు పెట్టాను. వడ్డీలేదు.. అసలూ లేదు. మా ఊళ్లో కోట్లు పెట్టిన వారున్నారు. వారికి కూడా పైసా రావడంలేదు. నాతోపాటు అందరం దిక్కుతోచని స్థితిలో ఉన్నాం. 
– రమేష్, వేణుగోపాలపురం

ఇప్పటివరకు ఫిర్యాదుల్లేవు
చట్ట వ్యతిరేకంగా ఆర్థిక కార్యకలాపాలు సాగించటం నేరం. ఈ విషయంలో ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదుల్లేవు. వస్తే బాధితులకు అండగా ఉంటాం. న్యాయం జరిగేలా చూస్తాం. ఆర్థిక నేరాలకు పాల్పడే వారిని ఉపేక్షించే ప్రసక్తేలేదు.     
    – పి. పరమేశ్వర్‌రెడ్డి, ఎస్పీ తిరుపతి జిల్లా

కరోనా సాకుతో బోర్డు తిప్పేసి..
కరోనా తొలిదశ రోజుల్లో డిపాజిట్లు రాలేదు. దీంతో సంస్థ అదే అదనుగా భావించింది. ఆ సమయంలో ఆరు నెలలపాటు వడ్డీ చెల్లించలేదు. పెట్టుబడి పెట్టిన వారి నుంచి ఒత్తిడి పెరగడంతో సంస్థ తిరిగి కార్యకలాపాలు కొనసాగించింది. కానీ, రెండుమూడు నెలలు మాత్రమే వడ్డీలు చెల్లించింది. తర్వాత ముందస్తు వ్యూహంతో  మెల్లగా కార్యకలాపాలు తగ్గించింది.

ఒత్తిడి పెరిగిపోవడంతో ఏజెంట్లు ముఖం చాటేశారు. దీంతో కార్యాలయాల వద్ద జనం పెరిగారు. ఇక అంతే.. పుత్తూరు, తిరుపతి కార్యాలయాలను సంస్థ ఎత్తేసింది. ఆ తర్వాత తిరుత్తణి, చెన్నైలోనూ డిపాజిట్లు చేసివారి నుంచి ఒత్తిడి పెరగడంతో రాత్రికి రాత్రే సంస్థ కార్యాలయాలు ఖాళీచేసింది. ఏజెంట్లు, మధ్యవర్తుల మాటలు నమ్మి అప్పులు తెచ్చి మరీ మోసపోయామని బాధితులు వాపోతున్నారు. ఈ మోసంపై పోలీసులు సుమోటోగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేయాలని వారు కోరుతున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement