సాక్షి,భువనగిరి: కలకాలం తోడూ నీడగా ఉంటానని ప్రమాణం చేసి తాళి కట్టిన భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆదమరచి నిద్రిస్తున్న భార్యను గొంతునులిమి కడతేర్చాడు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ దారుణ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని అర్బన్‌కాలనీకి చెందిన కొండమడుగు వెంకటాచారికి, లక్ష్మి(35)తో 15 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నాడు. వెంకటాచారి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డుగా, లక్ష్మి మరో ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది.
మరొకరితో సఖ్యతగా మెలుగుతున్నాడని..
వెంకటాచారి మరో మహిళతో సఖ్యతగా మెలుగుతున్నాడని లక్ష్మి అనుమానించింది. ఈ నేపథ్యంలోనే కొంత కాలంగా కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. నెల రోజుల క్రితం ఇదే విషయంపై దంపతులు తీవ్ర స్థాయిలో గొడవ పడడంతో లక్ష్మి పుట్టింటికి వెళ్లి ఇటీవల తిరిగి వచ్చింది. అయినా ఇద్దరి మధ్య సఖ్యత కుదరకపోవడంతో ఆదివారం రాత్రి కూడా ఘర్షణ పడ్డారు.
గొంతు నులిమి..
తరచు భార్య గొడవ పడుతుండడంతో వెంకటాచారి తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. దీంతో ఆమెను కడతేర్చాలని నిర్ణయించుకున్నాడు. ఘర్షణ అనంతరం భార్య ఆదమరచి నిద్రిస్తుండగా ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం అతడే పోలీసులకు సమాచారం ఇచ్చి స్టేషన్‌లో లొంగిపోయినట్లు తెలిసింది. కాగా, పోలీసులు సోమవారం ఉదయం ఘటన స్థలాన్ని పరిశీలించారు.
క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. లక్ష్మీ హత్యకు గురైన విషయం తెలుసుకుని బంధువులు పెద్ద సంఖ్యలో ఘటన స్థలానికి చేరుకున్నారు. పుట్టింట్లో ఉన్నా ప్రాణాలతో ఉండేవు లక్ష్మీ అంటూ కన్నీరుమున్నీరయ్యారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సుధాకర్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment