
అనంతపురం: భార్య ఆత్మహత్య చేసుకున్న 24 గంటలు గడవకనే భర్త కూడా భర్త కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన మేరకు.. సోమవారం సాయంత్రం చిన్నపొడమల గ్రామానికి చెందిన రమాదేవి (24) తాడిపత్రి సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. భార్య ఆత్మహత్యకు పాల్పడిన కొన్ని గంటలకే భర్త మంజునాథ (25) మంగళవారం తెల్లవారుజామున తాడిపత్రి రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలపై పడుకుని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఘటనలో మొండెం నుంచి తల వేరైంది. ఎడమ చెయ్యి మణికట్టు వరకు తెగింది. పెళ్లైన ఐదున్నర నెలల్లోనే దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అన్యోన్యంగా ఉండే ఇద్దరూ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో అర్థం కావడంలేదని గ్రామస్తులు అన్నారు. అయితే రమాదేవి ఆత్మహత్య అనంతరం అత్తింటి వారి అదనపు కట్నపు వేధింపులే కారణమంటూ రైల్వే పోలీసులకు మృతురాలి తల్లిదండ్రులు లక్ష్మీదేవి, రామాంజినేయులు ఫిర్యాదు చేశారు.
కొన్ని గంటలకే మంజునాథ్ కూడా ఆత్మహత్య చేసుకోవడంతో అత్త, మామ వేధింపులు తాళలేక తమ ఒక్కగానొక్క కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడంటూ రైల్వే పోలీసులకు మృతుడి తల్లిదండ్రులు ఓబుళమ్మ, బాల కుళ్లాయప్ప ఫిర్యాదు చేశారు. పరస్పర ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు జీఆర్పీ సీఐ నగేష్ తెలిపారు.