ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అల్వాల్: క్షణికావేశంలో భార్యపై చేయి చేసుకున్నానని మనస్తాపానికిలోనైన భర్త ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ సురేష్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అస్సాం రాష్ట్రానికి చెందిన సురేంద్రకుమార్ (35) బసంతి దంపతులు బతుకుదెరువు నిమిత్తం నగరానికి వలసవచ్చారు. సురేంద్రకుమార్ జీడిమెట్లలోని సూపర్ మార్కెట్‌లో ఉద్యోగం చేస్తుండగా అతడి భార్య బసంతి ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేసేది. ఇటీవల బసంతి ఉద్యోగం మానేసింది.
అప్పటికే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో భార్య ఉద్యోగం మానేయడంతో ఆగ్రహానికిలోనైన సురేంద్రకుమార్ ఆదివారం చేయి చేసుకున్నాడు. దీంతో మానసిక వేధనకు లోనైన అతను భార్య, కుమార్తెలను బెడ్‌రూంలో వేసి బయటి నుంచి గడియ పెట్టి హాల్‌లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బసంతి తెలిసిన వారికి ఫోన్ చేసి సమాచారం అందించింది. వారు ఇంటికి వచ్చి చూడగా అప్పటికే అతను మృతి చెంది ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment