నాగరాజు (ఫైల్ ఫొటో)
ఆలమూరు/అంబాజీపేట(కోనసీమ జిల్లా): వచ్చేవారం అతని భార్యకు వైద్యులు ప్రసవ తేదీని ఇచ్చారు. ఆ కుటుంబంలో మరొకరు చేరుతారన్న ఆనందం అట్టే కాలం నిలువలేదు. రోడ్డు ప్రమాదం అతనిని పొట్టన పెట్టుకోవడంతో ఒక్కసారిగా విషాదం అలముకొంది.
ఆలమూరు మండల పరిధిలోని చొప్పెల్ల లాకుల సమీపంలో జాతీయ రహదారిపై గురువారం జరిగిన ప్రమాదంలో అంబాజీపేట మండలం చిరుతపూడి గ్రామానికి చెందిన యలమంచిలి నాగరాజు (45) మృతి చెందినట్లు ఎస్సై ఎస్.శివప్రసాద్ తెలిపారు. రాజమహేంద్రవరం వైపు నుంచి రావులపాలెం ద్విచక్ర వాహనంపై వస్తున్న నాగరాజును చొప్పెల్ల లాకుల సమీపంలో రావులపాలెం నుంచి రాజమహేంద్రవరం వైపు వస్తున్న ఐసర్ వ్యాన్ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
ఉపాధి కోసం కువైట్ వెళ్లి తిరిగి వచ్చి రాజమహేంద్రవరంలోని హోటల్‌లో కుక్‌గా పనిచేస్తున్న నాగరాజు తన తల్లిని చూసేందుకు సొంత ఊరికి వస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న నాగరాజు భార్య శాకర్య కుమారి, ఐదేళ్ల కుమార్తె విషీక ఘటనా స్థలానికి చేరుకొన్నారు. ఐదేళ్ల కుమార్తె విషీక అమ్మా.. నాన్నకు ఏమైంది? ఎప్పుడు వస్తాడు? మనం ఇంటికి ఎప్పుడు వెళ్తామని అమాయకంగా అడుగుతున్న తీరు ఘటనా స్థలంలో ఉన్న ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
చదవండి: 30 ఏళ్లకే గుండెపోటు.. కారణాలేంటి?.. ఇలా చేయకపోతే డేంజర్‌లో పడినట్టే!
Comments
Please login to add a commentAdd a comment