నిర్మల్ : వివాహేతర సంబంధానికి అలవాటు పడిన మహిళ ప్రియుడితో కలిసి çకట్టుకున్నవాడిని నిర్ధాక్షిణ్యంగా చంపింది. మిస్టరీగా మారిన హత్య కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. ఈ మేరకు నిర్మల్ జిల్లా మామడ పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ ఉపేంద్రరెడ్డి బుధవారం కేసు వివరాలు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లాలోని మో ర్తాడ్‌కు చెందిన అబ్దుల్ సమద్ పైసల్ (45)ను భార్య యాస్మిన్‌బేగం, ఆమె ప్రియుడు మహ్మాద్ అథాఉల్లాలు కలిసి హత్య చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా మామడ మండలం బూరుగుపల్లి జాతీయరహదారి సమీపంలో రోడ్డు పక్కన పడవేశారు. ఈ క్రమంలో గత డిసెంబర్ 25న రహదారి పక్కన పొదల్లో మూట కనిపించగా గ్రామస్తులు విప్పి చూశారు. అందులో కుళ్లిన స్థితిలో ఉన్న శవాన్ని గుర్తించారు. స్థానిక సర్పంచ్ పోలీసులకు సమాచారం అందించగా సీఐ జీవన్‌రెడ్డి, ఎస్సై వినయ్ సంఘటన స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు ప్రారంభించారు.
క్లూస్ టీం, డాగ్‌స్క్వాడ్‌తో కొన్ని ఆధారాలు సేకరించారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని పోలీస్‌స్టేషన్‌లకు సమాచారం అందించారు. ఈ క్రమంలో తన భర్త అబ్దుల్ సమద్ పైసల్ కనిపించడం లేదని అతడిభార్య యాస్మిన్‌బేగం మోర్తాడ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అక్కడి పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. మామడ పోలీసులు ఆ దిశగా విచారణ జరిపారు. పైసల్ భార్య యాస్మిన్‌ను పిలిపించి కుళ్లిన స్థితిలో ఉన్న శవం ఫొటోల ను చూపించగా తన భర్త ఆనవాళ్లు కావని చెప్పడంతో అనుమానం వచ్చిన పోలీసులు పైసల్ అక్క, స్నేహితులను పిలి పించి శవానికి సంబంధించిన ఆనవాళ్లు చూపించారు. వారు సమద్ పైసల్‌గా గుర్తించారు. అనుమానంతో పోలీసులు యాస్మిన్‌తోపాటు ప్రియుడు మహ్మద్ అథాఉల్లాను అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారణ చేయడంతో నిజాలు బయటపడ్డాయి.
ప్రియుడి మోజులో పడి..
మోర్తాడ్‌కు చెందిన అబ్దుల్ సమద్ పైసల్ పెయింటర్‌గా పనిచేస్తుండగా, భార్య యాస్మిన్ బేగం బీడీలు చుడుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న ఆటోడ్రైవర్ మహ్మద్ అథాఉల్లాతో యాస్మిన్ బేగంకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇది తెలిసిన భర్త పద్ధతి మార్చుకోవాలని భార్యకు చెప్పడంతోపాటు కమిటీ సభ్యులకూ ఫిర్యాదు చేశాడు. కమిటీ సభ్యులు మహ్మాద్ అథాఉల్లాను హెచ్చరించి పైసల్ ఇంటికి వెళ్లరాదని సూచించారు. తమ వివాహేతర సంబంధానికి భర్త అడ్డు పడుతున్నాడని, ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు ప్రణాళిక రూపొందించారు. గతనెల 16న రాత్రి సమయంలో అబ్దుల్ సమద్ పైసల్‌ను ఇంట్లోనే కర్రతో అథాఉల్లా దాడి చేయగా అతడు స్పృహ కోల్పోయాడు.
అనంతరం యాస్మిన్ ప్రియుడితో కలిసి భర్త మెడకు తాడు బిగించి చంపివేశారు. 17న శవాన్ని ఇంట్లోనే ఉంచి కత్తితో ముక్కలు ముక్కలుగా చేసి పడేద్దామని అనుకుని కాలును తొలగించి ముక్కముక్కలుగా చేశారు. శరీరం ముక్కముక్కలుగా చేయడం ఆలస్యం అవుతుందని కిరోసిన్‌తో ముఖం ఆనవాలు ఏర్పడకుండా కాల్చివేశారు. అనంతరం శరీరాన్ని సంచులలో బ్లాంకెట్‌లో చుట్టి డిసెంబర్ 18న ఆటోలో తీసుకువచ్చి నిర్మల్ జిల్లా మామడ మండలం బూరుగుపల్లి అటవీ ప్రాంతంలో రోడ్డు పక్కన పొదలో పడేసి వెళ్లిపోయారు. మృతుడిని ఎవరూ గుర్తు పట్టకుండా దుస్తుల లోగోను తొలగించారు. హత్య చేసేందుకు వాడిన ఆటో, కత్తి, సెల్‌ఫోన్‌లు, తాడు వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు యాస్మిన్‌బేగం, మహ్మద్ అథాఉల్లాను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. హత్య కేసును ఛేదించిన సీఐ జీవన్‌రెడ్డి, ఎస్సై వినయ్, పోలీసులు శంశుల్‌హక్, రఫి, భీమన్నను ఎస్పీ విష్ణువారియర్ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment