సాక్షి, సిటీబ్యూరో: సోషల్ మీడియా యాప్ ఇన్‌స్ట్రాగామ్‌లో తనకు పరిచయమైన యువతిని వివాహం చేసుకోవాలంటూ వేధిస్తున్న సైబర్ శాడిస్ట్‌ను సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. తుర్కయాంజల్ ప్రాంతానికి చెందిన సంతోష్‌కుమార్ ప్రస్తుతం ఔరంగాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో క్వాలిటీ కంట్రోల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఇతడికి రెండు నెలల క్రితం ఇన్‌స్ట్రాగామ్ ద్వారా బేగంపేట్‌కు చెందిన యువతి పరిచయమైంది. కొన్ని రోజులు ఆమెతో చాటింగ్ చేశాడు. ఆపై తనను వివాహం చేసుకోవాలంటూ వేధింపులు ప్రారంభించాడు. ఓ దశలో ఆమె చిరునామా తెలుసుకున్న సంతోష్ వారి ఇంటికి వెళ్లాడు.
తానెవరో చెప్పకుండా అద్దెకు ఇల్లు కావాలంటూ ఆమె తండ్రితో మాట్లాడి ఆయన ఫోన్ నంబర్ తీసుకున్నాడు. ఇన్‌స్ట్రాగామ్ నుంచి సేకరించిన ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి అశ్లీలంగా మార్చాడు. వీటిని ఆమె తండ్రి ఫోన్‌కు పంపాడు. దీంతో షాక్‌కు గురైన బాధితురాలు నవంబర్‌లో సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన అధికారులు నిందితుడిని గుర్తించారు. శుక్రవారం అతడిని అరెస్టు చేసి జైలుకు పంపారు. సంతోష్ మరికొందరినీ ఈ పంథాలో వేధించినట్లు ఆధారాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment