యువతిని కిడ్నాప్ చేయించిన గాయత్రి
గచ్చిబౌలి (హైదరాబాద్): తన భర్తతో సంబంధం ఉందని అనుమానించింది. కోపంతో రగిలిపోతూ విచక్షణ కోల్పోయింది. తోటి యువతి అనే ఆలోచన ఏమాత్రం లేకుండా పాశవికంగా వ్యవహరించింది. పిన్నీ అని పిలిచే ఆ యువతిని పథకం ప్రకారం ఇంటికి పిలిపించి ఆమెపై లైంగిక దాడి చేయించేందుకు ప్రయత్నించింది. దాన్ని వీడియో కూడా చిత్రీకరించింది.
దాదాపు 45 నిమిషాల పాటు ఈ ఘోరం చోటు చేసుకుంది. సంచలనం సృష్టించిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీసులు.. ప్రధాన నిందితురాలు సహా ఆరుగురిపై ‘అత్యాచారం’ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. బాధితురాలు, పోలీసుల కథనం ప్రకారం ఈ అమానుష ఘటన వివరాలిలా ఉన్నాయి.
సంబంధం లేదని తేల్చిన పోలీసులు
శ్రీకాకుళం జిల్లా పాలకొండకు చెందిన యువతి (26) అశోక్‌నగర్‌లోని హాస్టల్‌లో ఉంటూ ఓ ఇన్‌స్టిట్యూట్‌లో సివిల్ సర్వీసెస్ పరీక్షలకు కోచింగ్ తీసుకుంటోంది. కొండాపూర్ శ్రీరాంనగర్ కాలనీ బీ–బ్లాక్‌లో నివసించే శ్రీకాంత్ ఈమె సహ అభ్యర్థి. గతేడాది జరిగిన ఆన్‌లైన్ క్లాసుల నేపథ్యంలో వీరికి పరిచయమైంది. ఇతడు తొమ్మిదేళ్ల క్రితం గాయత్రిని (36) ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
గాయత్రి, శ్రీకాంత్‌లను పిన్ని, బాబాయ్ అని పిలిచే బాధిత యువతి గతేడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు వారి ఇంట్లోనే ఉంది. అప్పట్లో గాయత్రి ఆమెతో బాగానే ఉండేది. షాపింగ్‌లకూ తీసుకెళ్లేది. కానీ తర్వాత అనుమానం పెంచుకుంది. ఈ నేపథ్యంలో ఆ యువతి వారి ఇంట్లో నుంచి బయటకొచ్చేసింది. అనుమానం వీడని గాయత్రి ఏప్రిల్ 22న ఆ మేరకు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీంతో గాయత్రితో పాటు శ్రీకాంత్‌ను, ఆ యువతిని పిలిచి కౌన్సెలింగ్ చేశారు. శ్రీకాంత్, ఆ యువతి మధ్య ఎలాంటి సన్నిహిత సంబంధం లేదని తేల్చి పంపారు. భార్య అనుమానాల నేపథ్యంలో శ్రీకాంత్ ఆమెనే మరోసారి రిజిస్టర్ మ్యారేజ్ కూడా చేసుకున్నాడు. అయినా ఆమెలో అనుమానం పోలేదు.
సమస్య పరిష్కరించుకుందామని పిలిపించి ..
సదరు యువతిని భయభ్రాంతులకు గురి చేయాలని, దారుణంగా హింసించాలని గాయత్రి పథకం వేసింది. దీనికోసం గతంలో తన వద్ద డ్రైవర్లుగా పని చేసి ప్రస్తుతం మసీద్‌బండలోని పాన్‌షాపులో పని చేసే మస్తాన్(25), ముజాహిద్‌లతో (25) పాటు వీరి స్నేహితులైన అయ్యప్ప సొసైటీకి చెందిన విష్ణు (22) మనోజ్ (22), కడపకు చెందిన మౌలాలిలతో కలిసి రంగంలోకి దిగింది.
గత గురువారం బాధిత యువతికి ఫోన్ చేసి కొండాపూర్‌కు వస్తే మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకుందామంది. దీంతో ఆమె తన తల్లిదండ్రులు, ఇద్దరు న్యాయవాదులతో మధ్యాహ్నం 3 గంటలకు గాయత్రి ఇంటి వద్దకు వెళ్లింది.
ఒంటరిగా ఇంటికి తీసుకెళ్లి ..
గాయత్రి ఇండిపెండెంట్ హౌస్‌కు సమీపంలో ఉన్న ఓ హోటల్ వద్దకు వెళ్లిన వీళ్లు ఆ విషయం ఆమెకు ఫోన్ చేసి చెప్పారు. దీంతో బయటకు వచ్చిన గాయత్రి మిగిలిన వారిని హోటల్ వద్దనే ఉంచి యువతిని తనతో తీసుకువెళ్లింది. అప్పటికే ఇంట్లో ఉన్న ఐదుగురు యువకులతో కలిసి యువతి నోట్లో గుడ్డలు కుక్కింది. వివస్త్రను చేసింది. సామూహిక లైంగిక దాడి చేయించేందుకు ప్రయత్నించింది. ఓ యువకుడు యువతి జననాంగంపై దాడి చేసి దారుణంగా హింసించాడు.
దీంతో బాధితురాలికి తీవ్ర రక్తస్రావమైంది. ఈ ఘోరాన్ని గాయత్రి తన సెల్‌ఫోన్‌లో రికార్డు చేసింది. అంతసేపూ బయటే వేచి చూస్తున్న యువతి తల్లిదండ్రులు, న్యాయవాదులు ఆమె రాకపోవడంతో ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. ప్రధాన గేటు దాటి, నాలుగు పెంపుడు శునకాలను తప్పించుకుని లోనికి వెళ్లడానికి దాదాపు 20 నిమిషాలు పట్టింది. అప్పటికి గాయత్రి సహా ఆరుగురూ ఇంటి వెనుక ఉన్న నిచ్చెన సాయంతో గోడ దూకి పారిపోయారు.
అది కూడా అత్యాచారమే..
ఈ దారుణాన్ని యువతి తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు అదేరోజు గచ్చిబౌలి పోలీసుస్టేషన్‌కు తీసుకువెళ్లి ఫిర్యాదు చేయించారు. అయితే మహిళ జననాంగంపై దాడి చేయడం కూడా అత్యాచారమే అని చట్టం చెబుతోందని పోలీసులు తెలిపారు.
ఈ నేపథ్యంలో ఆరుగురిపైనా అత్యాచారం, నిర్భంధం, మహిళ ఆత్మ గౌరవానికి భంగం కలిగించడం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. గాయత్రి సహా పరారీలో ఉన్న నిందితులను శనివారం అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
నా కూతురికి ఏ శిక్ష వేసినా ఆనందమే
ఓ ఆడపిల్లపై పాశవికంగా దాడి చేసిన నా కూతురుకు ఏ శిక్ష వేసినా ఆనందమే. ఆమె ఏ తప్పు చేసినా శ్రీకాంత్ గుడ్డిగా ప్రోత్సహిస్తుంటాడు. అతని ప్రోద్బలంతోనే గాయత్రి ఆ యువతిపై ఆ విధంగా దాడి చేసి ఉండవచ్చు. శ్రీకాంత్‌ను కూడా అరెస్టు చేయాల్సిన అవసరం ఉంది.
– కృష్ణవేణి, గాయత్రి తల్లి
Comments
Please login to add a commentAdd a comment