పోలీసులకు పట్టుబడ్డ కిడ్నాపర్లు
సాక్షి, జగిత్యాల: హైదరాబాద్ వ్యాపారి కిడ్నాప్ జిల్లాలో కలకలం రేపింది. అడ్తిదారుల మధ్య మక్కల డబ్బుల వివాదమే కిడ్నాప్‌కు కారణమని పోలీసులు భావిస్తున్నారు. దీంతో మరోసారి గ్యాంగ్‌స్టర్ అజీజ్ తెరపైకి రావడం కలకలం సృష్టించింది. ఏడాదిక్రితం మెట్‌పల్లి, కోరుట్ల, కథలాపూర్, మేడిపల్లి మండలాలకు చెందిన రైతుల నుంచి మక్కలు కొనుగోలు చేసిన స్థానిక అడ్తిదారులు కోరుట్లకు చెందిన ఓ అడ్తిదారు మధ్యవర్తిగా హైదరాబాద్ వ్యాపారికి అమ్మినట్లు తెలిసింది. ఈ లావాదేవీలు సుమారు రూ.3 కోట్ల వరకు సాగినట్లు సమాచారం. అడ్తిదారులకు డబ్బు చెల్లింపులో జరిగిన జాప్యానికి వ్యాపారి కిడ్నాప్‌నకు దారితీసినట్లు తెలుస్తోంది.
ఏడాదిగా వివాదం
ఏడాదిపాటు మక్కల డబ్బుకోసం ఎదురుచూసిన అడ్తిదారులు విసిగిపోయారు. మెట్‌పల్లి సబ్‌డివిజన్ పరిధిలోనే సుమారు 20 మంది అడ్తివ్యాపారులకు రూ.3 కోట్లు మేర డబ్బు రావాల్సి ఉంది. రైతుల నుంచి ఒత్తిడిరావడంతో కొంతమంది అడ్తిదారులు హైదరాబాద్ వ్యాపారి నుంచి డబ్బు రాకున్నా చెల్లింపులు చేసినట్లు తెలిసింది. డబ్బు కోసం ప్రయత్నాలు చేసిన అడ్తిదారులు చివరికి అజీజ్ గ్యాంగ్‌ను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. అతడి సహకారంతో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు వ్యాపారిని కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది.
కిడ్నాప్‌కు సుపారీయా?
వ్యాపారి కిడ్నాపునకు అజీజ్ గ్యాంగ్‌కు సుపారీ మాట్లాడుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అడ్తిదారులకు, హైదరాబాద్ వ్యాపారికి మధ్యవర్తిగా వ్యవహరించిన కోరుట్ల అడ్తిదారు అజీజ్ తనకు వ్యాపారం కోసం డబ్బు అప్పుగా ఇచ్చినట్లుగా పోలీసులకు చెబుతున్నట్లు సమాచారం. ఈ డబ్బుకోసం అజీజ్ తమపై ఒత్తిడి చేస్తే హైదరాబాద్ వ్యాపారి వద్దకు వెళ్లామని చెబుతున్నట్లు తెలిసింది. అజీజ్‌పై గతంలో కోరుట్లలో కిడ్నాప్, హత్య, పాత నోట్ల మార్పిడి, ఆర్మూర్‌లో కిడ్నాప్ కేసులు ఉండడం గమనార్హం.
పట్టుబడింది ఇలా..
హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌కు చెందిన వ్యాపారి తాట్ల నాగభూషణంను ఆర్థిక లావాదేవీల గొడవలతోనే రూ.50 లక్షల సుపారీ కుదుర్చుకొని కిడ్నాప్ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. కోరుట్లకు చెందిన వ్యాపారి నేరచరిత్ర ఉన్న అజీజ్‌ను సంప్రదించి ఎలాగైనా వ్యాపారి నుంచి డబ్బు వసూలు చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. వ్యాపారిని అజీజ్ తన కారులో కిడ్నాప్ చేసి తీసుకువస్తుండగా వ్యాపారి కుటుంబసభ్యులు గుమస్తా సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అక్కడి పోలీసులు అప్రమత్తమై వాహనం నంబరు ఆధారంగా వ్యాపారితో మాట్లాడిన ఫోన్‌నంబర్ల ఆధారంగా గుర్తించి కరీంనగర్ ఉమ్మడి జిల్లా పోలీసులను అప్రమత్తం చేశారు. కొడిమ్యాల ఎస్సై శివకృష్ణ ఆధ్వర్యంలో దొంగలమర్రి చెక్‌పోస్టు వద్ద తనిఖీలు చేస్తుండగా కిడ్నాపర్లు కారును దారి మళ్లించడంతో వెంబడించి బాధితుడు నాగభూషణంతోపాటు కోరుట్లకు చెందిన అజీజ్, హైదరాబాద్‌కు చెందిన సునిల్‌పటేల్, నిఖిల్‌సింగ్‌ను అదుపులోకి తీసుకుని సోమవారం అర్ధరాత్రి సరూర్‌నగర్ పోలీసులకు అప్పగించారు. కారు నుంచి పారిపోయిన నాగరాజును కొడిమ్యాల మండలం చెప్యాల గ్రామస్తులు మంగళవారం పోలీసులకు అప్పగించారు. హైదరాబాద్‌కు చెందిన మరో వ్యక్తి బుర్రి రాజేశ్ మాత్రం పరారీలో ఉన్నాడు. అతడికోసం ప్రత్యేక పోలీస్ బృందం గాలింపు చేపట్టింది.
అజీజ్ నేరచరిత్రపై పోలీసుల విచారణ
రాయికల్ పట్టణంలో భూ మాఫియా పేరిట గతంలో వాయిస్‌రికార్డు సోషల్ మీడియాలో కలకలం రేపింది. అప్పుడు భూ యజమాని అయిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాయికల్ మండలంలోని కొంత మందిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. తాజా విచారణలో రాయికల్‌లో వాయిస్ రికార్డులో అజీజ్ పేరు బయటకు వచ్చినట్లు సమాచారం. అజీజ్‌తోపాటు రాయికల్‌కు చెందిన మరోవ్యక్తి మధ్యవర్తిగా ఉన్నట్లు పేరు కూడా చెప్పినట్లు తెలిసింది. అజీజ్ నేరచరిత్రపై పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ వేగవంతం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment