బంజారాహిల్స్ (హైదరాబాద్): మహిళా ఉద్యోగినికి జ్యూస్‌లో మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ హోంగార్డు. ఆ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి డబ్బుల కోసం డిమాండ్ చేస్తుండటంతో బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల కథనం ప్రకారం.. ఆర్‌టీఏలో పనిచేసే ఓ మహిళా ఉద్యోగి తన భర్త నుంచి విడిగా ఉంటోంది. 2018లో ఆమె ఖమ్మం జిల్లాకు బదిలీ అయ్యారు.
అక్కడ ఆమెకు ఆర్‌టీఏలో పనిచేసే హోంగార్డు స్వామి పరిచయమయ్యాడు. అతనే ఆమెకు అద్దె ఇల్లు చూపించి పిల్లలను స్కూల్‌లో జాయిన్ చేశాడు. ఆమె కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటూ నమ్మకం పెంచుకున్నాడు. ఆమె ద్వారా కుటుంబ విషయాలు అన్ని తెలుసుకున్నాడు. ఒంటరిగా ఉన్న ఆమెపై కన్నేసిన స్వామి ఓ పథకం వేశాడు. ఓ రోజు జ్యూస్ తీసుకొని ఇంటికి వచ్చాడు.
జ్యూస్ తాగిన ఆమె మత్తులోకి జారుకున్నాక అత్యాచారం చేశాడు. ఈ దృశ్యాలను తన సెల్‌ఫోన్ కెమెరాలో చిత్రీకరించాడు. విషయం బయటకు చెబితే వీడియో ఇంటర్నెట్‌లో పెడతానని బెదిరించాడు. అక్కడితో ఆగకుండా ఆమెకు వీడియో కాల్ చేస్తూ దుస్తులు తీసి చూపించాలంటూ వేధించేవాడు. తీసిన వీడియోను డిలీట్ చేయాలంటే తనకు 50 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయసాగాడు.
దీంతో అతని వేధింపులు భరించలేక ఆ మహిళ ఈ ఏడాది హైదరాబాద్‌కు బదిలీ చేయించుకుంది. జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో ఉంటోంది. అయినప్పటికి స్వామి వేధింపులు ఆగలేదు. నగరానికి కూడా వచ్చి ఆమె వీడియోను తోటి సిబ్బందికి చూపిస్తానంటూ బెదిరించసాగాడు. ఇది భరించలేక బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు స్వామిని అరెస్టు చేసి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment