సాక్షి, హైదరాబాద్: అక్రమ మైక్రో ఫైనాన్సింగ్ వ్యవహారాలకు పాల్పడిన లోన్ యాప్స్ కేసుల్లో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఫ్రీజ్ చేసిన బ్యాంకు ఖాతాలను అడ్డదారిలో డీ–ఫ్రీజ్ చేయించి, రూ.1.18 కోట్లు దారి మళ్లించిన కేసులో సూత్రధారి అనిల్ ఎట్టకేలకు చిక్కాడు. 15 రోజుల పాటు గాలించిన ప్రత్యేక బృందం ఎట్టకేలకు కోల్‌కతాలో పట్టుకుంది. అక్కడి కోర్టులో హాజరుపరిచిన అధికారులు ట్రాన్సిట్ వారెంట్‌పై సోమవారం సిటీకి తీసుకొచ్చారని సంయుక్త పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి వెల్లడించారు.
సైబర్ క్రైమ్ ఎస్‌ఐగా అవతారమెత్తి...
గతేడాది నమోదు చేసిన లోన్ యాప్స్ కేసుల్లో సైబ ర్ క్రైమ్ పోలీసులు దాదాపు 1100 బ్యాంకు ఖా తాలను ఫ్రీజ్ చేశారు. వీటిలో నాలుగు కంపెనీలకు చెందిన ఆరింటిని డీ–ఫ్రీజ్ చేయించడానికి కోల్‌కతాకు చెందిన ఉత్తమ్ చౌదరి కొందరితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ బాధ్యతను 5 శాతం కమీషన్ ఇస్తానని ఎరవేసి నల్లమోతు అనిల్‌కుమార్‌కు అప్పగించాడు. గుంటూరుకు చెందిన అనిల్ బీటెక్ పూర్తి చేసి ముంబైలో ఉంటున్నాడు. ఆరేళ్ల క్రితం ఓ సైబర్ నేరంలో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కాడు. బ్యాంకు ఖాతాలను డీ–ఫ్రీజ్ చేయించడానికి రంగంలోకి దిగిన ఇతను కోల్‌కతాకు చెందిన సైబర్ క్రైమ్ ఎస్సైగా అవతారమొత్తాడు.
గత నెలలో విషయంలో వెలుగులోకి...
గత నెలలో గచ్చిబౌలి ఉన్న ఐసీఐసీఐ బ్యాంకు రీజినల్ మేనేజర్ ఈ విషయం గుర్తించి సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దర్యాప్తు చేసిన అధికారులు ఈ నెల 2న ఆనంద్‌ను అరెస్టు చేశారు. ఇతడి విచారణలో అనిల్ వ్యవహారం వెలుగులోకి రావడంతో అతడి కోసం ముంబై,
పశ్చిమబెంగాల్‌ల్లో గాలించారు.
ఎట్టకేలకు కోల్‌కతాలో పట్టుకుని అతని వద్ద నుంచి రూ.2 లక్షలతో పాటు 8 డెబిట్ కార్డులు, మూడు చెక్ బుక్స్, ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకొన్నారు. తనకు అందిన డబ్బును ఉత్తమ్ ఏం చేశాడనే దానిపై పోలీసుల ఆరా తీస్తున్నారు. అతడు చిక్కితేనే ఈ అంశంలో స్పష్టత వస్తుందని చెప్తున్నారు.
నకిలీ పత్రాలతో...
కోల్‌కతాలోని ఐసీఐసీఐ బ్యాంకులో ఫ్రీజ్ అయిన ఖాతాలను డీఫ్రీజ్ చేయాలంటూ నకిలీ పత్రాలతో ఆ బ్యాంకు మేనేజర్‌ను సంప్రదించాడు. దీంతో పాటు ఢిల్లీ, గుర్గావ్‌ల్లో ఉన్న మరో ఐదు ఖాతాలను డీ–ఫ్రీజ్ చేయించాడు. అలా మొత్తం రూ.1.18 కోట్లు బేగంపేటకు చెందిన ఆనంద్ జన్ను అనే వ్యక్తి ఖాతాలోకి మళ్లించి, ఆపై తన ఖాతాల్లోకి మార్చుకున్నాడు. ఈ డబ్బును డ్రా చేయడంతో పాటు తన కమీషన్ మినహాయించుకుని మిగిలింది ఉత్తమ్ చౌదరికి అందించాడు.
Comments
Please login to add a commentAdd a comment