సాదుద్దీన్
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: రొమేనియా బాలికపై జరిగిన అఘాయిత్యానికి సంబంధించి ప్రజాప్రతినిధుల కుమారులే కీలక సూత్రధారులని నిందితుడు సాదుద్దీన్ పోలీసుల విచారణలో వెల్లడించినట్టు తెలిసింది. పబ్ దగ్గర మాటలు కలిపింది, కారులో అసభ్య ప్రవర్తన మొదలుపెట్టింది వారేనని పేర్కొన్నట్టు సమాచారం. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సాదుద్దీన్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు గురువారం కస్టడీలోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.
ఈ నేపథ్యంలోనే ఘటనకు సంబంధించిన కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. మరోవైప ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురు మైనర్లను నాలుగు రోజుల కస్టడీకి అనుమతిస్తూ జువెనైల్ జస్టిస్ కోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పోలీసులు వారిని శుక్రవారం నుంచి తమ కస్టడీలో విచారించనున్నారు.
రెండు నెలలుగా పరిచయం
వెస్ట్‌జోన్ అదనపు డీసీపీ ఇక్బాల్ సిద్ధిఖీ, బంజారాహిల్స్ ఏసీపీ మంత్రి సుదర్శన్ నేతృత్వంలోని బృందాలు సాదుద్దీన్‌ను విచారిస్తున్నాయి. ఈ సందర్భంగా పోలీసులు మైనర్లతో పరిచయం సహా మొత్తం ఘటన వివరాలను రాబట్టడంపై దృష్టిపెట్టారు. పోలీసువర్గాల సమాచారం మేరకు.. ఐదుగురు మైనర్లతో తనకు దాదాపు రెండు నెలల పరిచయమైందని సాదుద్దీన్ చెప్పాడు.
ఘటన జరిగిన రోజున తాను వక్ఫ్‌బోర్డు చైర్మన్ కుమారుడితో కలిసి ఇన్నోవా కారులో పబ్‌కు వచ్చానని.. కారును డ్రైవర్ జమీల్ నడిపాడని వివరించాడు. ఓ స్నేహితుడితో కలిసి అమ్నీషియా పబ్‌కు వచ్చిన బాలికను మొదట వక్ఫ్‌బోర్డు చైర్మన్ కుమారుడు పరిచయం చేసుకున్నాడని.. పొరుగు జిల్లాకు చెందిన కార్పొరేటర్ కుమారుడు ఆమెతో మాటలు కలిపాడని, తర్వాత తానూ అక్కడికి వెళ్లానని వివరించాడు.
తానేంటో హోదా చెప్తూ..
కాసేపటికి ఆరుగురం ఆమె వద్దకు వెళ్లి మాట్లాడటం మొదలెట్టామని.. దీంతో విసుగు చెందిన బాలిక పబ్ నుంచి బయటికి వెళ్లడంతో వెనకే వెళ్లామని సాదుద్దీన్ వివరించాడు. పబ్ బయట ఎమ్మెల్యే కుమారుడు ఆమెతో మాటలు కలిపాడని.. తన హోదా, ఇతర అంశాలు చెప్తూ ట్రాప్ చేసి, ఇంటి వద్ద దింపుతానంటూ బెంజ్ కారులో ఎక్కించుకున్నాడని తెలిపాడు. బెంజ్ కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఆమెతో అసభ్య ప్రవర్తన మొదలుపెట్టినది ఎమ్మెల్యే కుమారుడేనని, తర్వాత ఒకరొకరుగా బెంజ్‌కారులో ఉన్న నలుగురూ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారని సాదుద్దీన్ చెప్పాడు.
ఆ సమయంలో తాను వెనుక ఉన్న ఇన్నోవాలో ఉన్నానని పేర్కొన్నాడు. బాలిక ఇల్లు బంజారాహిల్స్‌లోని కాన్సూ బేకరీ సమీపంలోనే ఉందని చెప్పిందని.. అటుగా వెళ్తూనే తమ కారును కాన్సూ బేకరీ పార్కింగ్‌లోకి తీసుకువెళ్లామని వివరించాడు. అక్కడ కార్పొరేటర్ కుమారుడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలెట్టాడని తెలిపాడు.
వాంగ్మూలాలను సరిచూస్తూ..
సాదుద్దీన్‌ను విచారిస్తున్న పోలీసులు అతడిని అరెస్టు చేసినప్పుడు ఇచ్చిన ఎనిమిది పేజీల వాంగ్మూలాన్ని.. తర్వాత పట్టుబడిన మైనర్లు ఇచ్చిన వాంగ్మూలాలను సరిపోలుస్తూ దర్యాప్తు చేస్తున్నారు. ఘటన జరిగిన రోజున వివిధ ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డయిన ఫీడ్‌ను సాదుద్దీన్‌కు చూపిస్తూ కొన్ని అంశాలపై స్పష్టతకు వస్తున్నారు.
కాన్సూ బేకరీ దగ్గర బాలిక ఇన్నోవాలోకి ఎక్కిన తర్వాత అప్పటివరకు ముందు సీట్లో ఉన్న సాదుద్దీన్ వెనుక సీట్లోకి మారాడని గుర్తించారు. అంతకన్నా ముందే బాలిక బెంజ్ కారులో ఉండగానే ఆమె సెల్‌ఫోన్, కళ్లజోడును ఎమ్మెల్యే కుమారుడు లాక్కున్నాడని.. అవి తిరిగి ఇవ్వాలంటే ఇన్నోవా కారులో ఎక్కాలని బెదిరించాడని సాదుద్దీన్ వెల్లడించాడు.
బాధితురాలితో గుర్తింపు పరేడ్ కోసం
ఈ కేసులో నిందితులుగా ఉన్న వారి నుంచి రక్త నమూనాల సేకరణ, బాధితురాలి ద్వారా టెస్ట్ ఐడెంటిఫికేషన్ (టీఐ) పరేడ్ నిర్వహణకు అనుమతి కోరుతూ పోలీసులు ఆయా కోర్టుల్లో పిటిషన్లు వేశారు. న్యాయమూర్తి సమక్షంలో జైలులో జరిగే టీఐ పెరేడ్, వాహనాలతోపాటు వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన నమూనాల విశ్లేషణ, డీఎన్‌ఏ పరీక్షలు వంటివి నేర నిరూపణలో కీలకం కానున్నాయి. ఘటన సమయంలో నిందితులు ధరించిన దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పగలు ఠాణాలో.. రాత్రికి హోమ్‌లో..
గ్యాంగ్ రేప్ కేసులో ఐదుగురు మైనర్లను నాలుగు రోజులపాటు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ జువైనల్ కోర్టు గురువారం నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నుంచి పోలీసులు వారిని విచారించనున్నారు. చట్టప్రకారం వారిని పగటిపూట ఠాణాలో విచారిస్తూ.. రాత్రివేళల్లో జువైనల్ హోమ్‌కే తరలించనున్నారు. ఇప్పటికే సాదుద్దీన్ పోలీసు కస్టడీలో ఉండటంతో శుక్రవారం నుంచి ఆరుగురినీ కలిపి విచారించాలని నిర్ణయించారు. ఇక ఢిల్లీ నిర్భయ కేసు విచారణను ప్రస్తావిస్తూ.. ఈ కేసులోనూ మైనర్లుగా ఉన్న వారిని మేజర్లుగా పరిగణిస్తూ ట్రయల్ నిర్వహించేందుకు పోలీసులు అనుమతి కోరనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment