
సాక్షి, హైదరాబాద్: రోజురోజుకి పని వత్తిడి పెరగడం.. మరోవైపు చేసిన అప్పు ఎలా కట్టాలని మనస్థాపంతో ఇంట్లో ఉరివేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ భిక్షపతిరావు తెలిపిన వివరాల ప్రకారం... బాలాజీనగర్ పాతబస్తీలో నివాసం ఉంటున్న బొల్లి అశ్వినికి బొల్లి వెంకటేష్ (31)తో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. వెంకటేష్ హిమాయత్‌నగర్‌లో ఉన్న కర్ణాటక బయోటిక్స్ అండ్ ఫార్మాస్యూటికల్ కంపెనీలో పని చేస్తున్నాడు. అశ్విని స్ధానికంగా ఓ టైలరింగ్ దుకాణంలో పని చేస్తోంది.
గురువారం భర్త వెంకటేష్ ఇంట్లో ఉన్న సమయంలోనే అశ్విని పనికి వెళ్లింది. తిరిగి సాయంత్రం 4.30 గంటలకు కుమారుడిని పాఠశాల నుంచి ఇంటికి తీసుకుని వచ్చింది. ఇంటి తలుపులు కొట్టినప్పటికి వెంకటేష్ తీయకపోవడంతో కిటికీ నుంచి చూడగా వంటగదిలో ఉన్న ఫ్యాన్‌రాడ్‌కు ఉరివేసుకుని కనిపించాడు. చుట్టు పక్కలవారి సహాయంతో తలుపులు తెరిచి వెంటనే సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వెంకటేష్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
వెంటనే అశ్విని పోలీసులకు సమాచారం అందించింది. ‘ఆర్థిక ఇబ్బందులతోనే చనిపోతున్నా... నా చావుకు ఎవరూ బాధ్యులు కారు’ అంటూ వెంకటేష్ సూసైడ్‌నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment