
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి,జగద్గిరిగుట్ట(హైదరాబాద్): వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ వ్యక్తి కత్తిపోట్లకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జగద్గిరిగుట్ట పీఎస్ పరిధిలోని రిక్షాపుల్లర్స్ కాలనీలో నివాసముండే అనీల్‌కుమార్ (28) గతంలో కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయంలో శానిటరీ విభాగంలో పనిచేశాడు. అదే విభాగంలో పనిచేసే ఓ మహిళా కార్మికురాలితో పరిచయం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆమెతో తరచూ అనిల్‌కుమార్ ఫోన్‌లో మాట్లాడుతున్నాడు.
ఇది గమనించిన ఆమె కుమారుడు శ్రీరామ్ ఈ విషయమై తల్లిని నిలదీశాడు. తల్లితో అనిల్‌కుమార్‌కు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో అతన్ని ఎలాగైనా అంతమొందించాలని పథకం పన్నాడు. ఈ నేపధ్యంలో శ్రీరామ్ గురువారం మాట్లాడుకుందామని అనీల్‌కుమార్‌ను సోమయ్యనగర్‌లోని ఎంకె ఫంక్షన్ హాలు వద్దకు పిలిచాడు. అతను అక్కడికి రాగానే కర్రలతో దాడి చేసి కత్తితో ఉదరభాగంతో పొడిచాడు. ఈ దాడి నుండి తప్పించుకున్న అనిల్‌కుమార్ స్థానికుల సహాయంతో కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందుకున్న జగద్గిరిగుట్ట పోలీసులు దాడికి పాల్పడిన శ్రీరామ్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అక్రమ సంబంధం నేపధ్యంలోనే దాడికి పాల్పడినట్లు శ్రీరామ్ విచారణలో అంగీకరించినట్లు సమాచారం.