సాక్షి, బంజారాహిల్స్( హైదరాబాద్): అరగంటలో వస్తున్నానని చెప్పాడు... అంతలోనే అనంతలోకాలకు వెళ్లాడు... ఈ హృదయవిదారక ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఫలక్‌నుమా జుబేల్‌కాలనీలో నివసించే మహ్మద్ ముజ్తాబా ఫరూక్(21) మదర్సాలో చదువుకుంటున్నాడు.
శనివారం రాత్రి 12 గంటల సమయంలో స్కూల్ ఫ్రెండ్స్ అమన్, అనస్‌తో కలిసి బంజారాహిల్స్ రోడ్డు నం. 1/12 చౌరస్తా మీదుగా పంజగుట్ట వైపు వెళ్తుండగా బైక్ అదుపు తప్పడంతో బైక్ నడుపుతున్న ఫరూక్ డివైడర్‌ను ఢీకొట్టాడు. దీంతో ఫరూక్ తల పగిలింది. వెంటనే సమీపంలోని కేర్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. రాత్రి 12 గంటల సమయంలో తండ్రి మహ్మద్ ఫరూక్ కొడుకుకు ఫోన్ చేసి ఇంటికి ఎప్పుడు వస్తున్నావంటూ అడిగాడు.
సరిగ్గా అరగంటలో ఇంట్లో ఉంటానని చెప్పిన కొడుకు చావు వార్త వినాల్సి వస్తుందని ఊహించలేదంటూ ఆయన ఆస్పత్రి వద్ద కన్నీరుమున్నీరయ్యాడు. రోడ్డు ప్రమాదంలో అనాస్ అలీకి కూడా తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బైక్ స్కిడ్ కావడం వల్లనే డివైడర్‌ను ఢీకొని ఈ ప్రమాదం జరిగిందని చికిత్స పొందుతున్న అనస్ వెల్లడించాడు. బంజారాహిల్స్ ఎస్సై ఉదయ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment