సాక్షి, హైదరాబాద్(నల్లకుంట): అతి వేగంగా వెళుతున్న బైక్ అదుపుతప్పి ఇద్దరు యువకుల డివైడర్‌ను ఢీకొని మృతి చెందిన సంఘటన శుక్రవారం తెల్లవారు జామున నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నల్లకుంట ఎస్‌హెచ్‌ఓ రవి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డికి చెందిన నస్కంటి రాజు గౌడ్ కుమారుడు నస్కంటి భవన్(20), నిర్మల్ జిల్లాకు చెందిన మాలేపు రోషన్(20) రాంనగర్‌లోని సన్ డిగ్రీ కళాశాలలో బీబీఏ ఫైనల్ ఇయర్ చదువుతూ స్థానిక పద్మా నిలయం హాస్టల్‌లో స్నేహితులు పాలడుగు రాజు, సూర్య, రాజేశ్, రాహుల్ రెడ్డి, గణేష్, అనీష్‌లతో కలిసి రెండు వేర్వేరు గదుల్లో ఉంటున్నారు.
గురువారం రాత్రి ముషీరాబాద్‌లోని ఓ సినిమా థియేటర్‌లో సెకండ్ షో సినిమా చూసేందుకు స్నేహితులంతా కలిసి నాలుగు బైక్‌లపై వెళ్లారు. సినిమా వదిలిన తర్వాత బైక్‌లో పెట్రోల్ పోయించుకునేందుకు ఓయూ వడ్డెర బస్తీ సమీపంలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్‌కు వెళ్లారు. పెట్రోల్ పోయించుకున్న అనంతరం హాస్టల్‌కు బయలు దేరారు. తెల్లవారు జామున 2 గంటల సమయంలో భవన్, మాలేపు రోషన్ ఒక బైక్‌పై వెళుతుండగా మిగిలిన స్నేహితులు మరో మూడు వాహనాలపై బయలు దేరారు. భవన్ వాహనాన్ని నడుపుతుండగా రోషన్ వెనుక కూర్చున్నాడు. బైక్ బ్రేకులు సరిగా పడడంలేదని నెమ్మదిగా పోవాలని భవన్‌కు మరో స్నేహితుడు సూచించాడు.
అయినా అతను పట్టించుకోకుండా అతి వేగంగా ఎన్‌ఫీల్డ్ వాహనంపై అడిక్‌మెట్ ఫ్లై ఓవర్‌పైకి చేరుకున్నారు. ఒక్కసారిగా బైక్ అదుపు తప్పి ఫ్లై ఓవర్‌పై ఉన్న ఫుట్ పాత్‌ను ఢీకొట్టింది. దీంతో భవన్, రోషన్ ఎగిరి రోడ్డుపై పడ్డారు. ఇద్దరి తలకు, కాళ్లు చేతులకు తీవ్రమైన గాయాలు కావడంతో అక్కడికక్కడ మృతి చెందారు. నల్లకుంట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృత దేహాలను గాంధీ మార్చురీకి తరలించారు. మృతుల స్నేహితుడు పాలడుగు రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు శుక్రవారం పోస్టుమార్టం అనంతరం మృత దేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఎస్సై ప్రసాద్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
సూర్యను దింపి బైక్ ఎక్కిన రోషన్
పెట్రోల్ పోయించుకునేందు వెళ్లిన సమయంలో భవన్ బైక్‌పై మరో స్నేహితుడు సూర్య ఉన్నాడు. పెట్రోల్ పోయించుకున్న తర్వాత భవన్ బైక్‌పై నేను వెళతాను నీవు వేరే బైక్‌పై రమ్మని రోషన్ చెప్పాడు. దీంతో సూర్య మరో స్నేహితుడి బైక్‌పై రావడంతో అతని ప్రాణాలు దక్కాయి. రోషన్ మాత్రం ప్రాణాలు కోల్పోయాడు.
Comments
Please login to add a commentAdd a comment