నిఘాకు చిక్కకుండా 6 నెలలు గడిపిన ఉగ్రవాది రిజ్వాన్
నగరానికే చెందిన మరో ఉగ్రవాది ఫర్హాతుల్లా ఘోరీతో సంప్రదింపులు
ఐసిస్‌లో కీలక పాత్ర.. ఏడాదిగా మోస్ట్ వాంటెడ్
పసిగట్టలేకపోయిన ఇక్కడి ఇంటెలిజెన్స్ వర్గాలు
ఇటీవల ఢిల్లీ స్పెషల్ సెల్‌కు చిక్కిన ఉగ్రవాది రిజ్వాన్
అరెస్టు విషయం తెలిసి హుటాహుటిన ఢిల్లీ వెళ్లిన అధికారులు
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ టెర్రరిస్ట్ రిజ్వాన్ అలీ.. యువతను ‘ఉగ్ర’బాట పట్టించడంలో దిట్ట.. పరారీలో ఉన్న అతడిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) రూ.3 లక్షల రివార్డు కూడా ప్రకటించింది. ఇన్నాళ్లూ తప్పించుకు తిరిగిన రిజ్వాన్‌ను.. గత శుక్రవారం ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అక్కడి ఫరీదాబాద్ సరిహద్దుల్లో పట్టుకున్నారు. అతడిని ప్రశ్నించినప్పుడు బయటికొచి్చన రెండు అంశాలు కలకలం రేపుతున్నాయి.
రిజ్వాన్ కొన్నాళ్లు హైదరాబాద్‌లో తలదాచుకున్నాడనేది ఒకటైతే.. సుదీర్ఘకాలం నుంచి పరారీలో ఉన్న గజ ఉగ్రవాది, హైదరాబాద్‌కే చెందిన ఫర్హాతుల్లా ఘోరీతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ ఉన్నాడనేది రెండో అంశం. రాష్ట్ర నిఘా విభాగానికి చెంప పెట్టులాంటి ఈ రెండు అంశాలు తెలిసిన వెంటనే ఇక్కడి నుంచి ఓ ప్రత్యేక బృందం హుటాహుటిన ఢిల్లీ వెళ్లింది.
6 నెలలు హైదరాబాద్‌లోనే..
ఢిల్లీకి చెందిన రిజ్వాన్ అలీ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత 2015–16లో ఆన్‌లైన్ ద్వారా ప్రేరణ పొంది ఐసిస్ బాటపట్టాడు. జార్ఖండ్ నుంచి వచ్చి ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో స్థిరపడిన షానవాజ్‌తో కలసి ఉగ్రవాద కార్యకలాపాలు ప్రారంభించాడు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, మహారాష్ట్రల్లో ఐసిస్ మాడ్యూల్ విస్తరణతోపాటు నిధుల సమీకరణకు పనిచేశాడు. చాలా మంది యువతను ఆన్‌లైన్ ద్వారా ఆకర్షించి ఉగ్రవాద బాటపట్టించాడు. 2023 జూన్‌లో పుణే అధికారులు షానవాజ్ నేతృత్వంలోని ఈ మాడ్యూల్ గుట్టురట్టు చేసి.. పలువురిని అరెస్టు చేశారు.
దీంతో రిజ్వాన్ అజ్ఞాతంలోకి వెళ్లి ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ ప్రాంతంలో తలదాచుకున్నాడు. అతడిని మోస్ట్ వాంటెడ్‌గా గుర్తించిన ఎన్‌ఐఏ.. పట్టిస్తే రూ.3 లక్షల రివార్డు ఇస్తామని కూడా ప్రకటించింది. ఈ ఏడాది జనవరిలో రిజ్వాన్ కదలికలను గుర్తించిన ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు.. సంభాల్‌లోని ఓ స్థావరంపై దాడి చేశారు.
కానీ తృటిలో తప్పించుకున్న రిజ్వాన్.. హైదరాబాద్‌కు మకాం మార్చాడు. మారుపేరుతో సికింద్రాబాద్ ప్రాంతంలో దాదాపు ఆరు నెలల పాటు నివసించాడు. తర్వాత కేరళ వెళ్లాడు. స్వాతంత్య్ర దిన వేడుకల నేపథ్యంలో విధ్వంసాలకు పథకం వేసి ఢిల్లీ వెళ్లాడు. ఈ క్రమంలోనే ఢిల్లీ–ఫరీదాబాద్ సరిహద్దుల్లో స్పెషల్ సెల్ పోలీసులకు దొరికిపోయాడు. వారు అతడి నుంచి తుపాకీ, తూటాలు స్వా«దీనం చేసుకున్నారు.
విచారణలో బయటపడిన కీలక అంశాలు
రిజ్వాన్‌ను విచారించిన సమయంలో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కీలక అంశాలను గుర్తించారు. హైదరాబాద్‌లోని కూర్మగూడ ప్రాంతానికి చెందిన గజ ఉగ్రవాది ఫర్హాతుల్లా ఘోరీతో రిజ్వాన్ క్రమం తప్పకుండా సంప్రదింపులు జరిపినట్టు తేల్చారు. ఘోరీ తాజా ఫొటోను సైతం రిజ్వాన్ ఫోన్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. పేలుడు పదార్థాల తయారీలో నిపుణుడైన రిజ్వాన్ దేశంలోని వివిధ నగరాలను టార్గెట్‌గా చేసుకున్నట్టు గుర్తించారు. ఫర్హాతుల్లా ఘోరీతో సంప్రదింపులు, హైదరాబాద్‌లో ఆరు నెలల పాటు ఉండటం నేపథ్యంలో.. ఘోరీ ద్వారానే ఇక్కడ ఆశ్రయం పొందినట్టు భావిస్తున్నారు.
రిజ్వాన్‌ను విచారించేందుకు..
రిజ్వాన్‌ను విచారిస్తే హైదరాబాద్‌లో ఎవరి ద్వారా, ఎప్పుడు ఆశ్రయం పొందాడో, ఎవరెవరిని కలిశాడో తెలుస్తుందని.. ప్రస్తుతం ఘోరీ కోసం పనిచేస్తున్న వారిని గుర్తించేందుకు ఆస్కారం ఉంటుందని రాష్ట్ర పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు రిజ్వాన్‌ను విచారించడంతోపాటు ఢిల్లీ స్పెషల్ సెల్ నుంచి సమాచారం తీసుకోవడం కోసం రాష్ట్రం నుంచి ఓ ప్రత్యేక బృందం ఢిల్లీ వెళ్లింది. ఇక ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఢిల్లీ పోలీసులు త్వరలో హైదరాబాద్ రానున్నట్లు తెలిసింది.
మరికొన్ని అరెస్టులు చోటు చేసుకునే అవకాశం ఉందని సమాచారం. ఆరు నెలల పాటు నగరంలో తలదాచుకున్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది కదలికలను రాష్ట్ర నిఘా విభాగాలు కనిపెట్టలేకపోవడం వైఫల్యంగానే ఉన్నతాధికారులు పరిగణిస్తున్నట్టు తెలిసింది. ఈ అంశంపై లోతుగా అంతర్గత సమీక్ష చేపట్టినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment