మీడియా సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు
కాకినాడ క్రైం: తూర్పుగోదావరి జిల్లా లోదొడ్డిలో కొద్ది రోజుల క్రితం జీలుగుకల్లు తాగి ఐదుగురు ప్రాణాలు కోల్పోవడానికి కారకుడు టీడీపీ నేత వంతల రాంబాబు అని పోలీసులు తేల్చారు. రంపచోడవరం టీడీపీ ఇన్‌చార్జ్ వంతల రాజేశ్వరికి వరుసకు సోదరుడైన వంతల రాంబాబు జీలుగు కల్లుకుండలో గడ్డి మందును కలపడం వల్లే ఐదుగురూ మృతి చెందారని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు తెలిపారు. నిందితుడు రాంబాబును కాపాడేందుకు వంతల రాజేశ్వరి శతవిధాలా ప్రయత్నించారు. పోలీసులు రాంబాబు సహా పలువురిని విచారిస్తోన్న క్రమంలో వంతల రాజేశ్వరి అమాయకులైన గిరిజనులను ఇరికిస్తారా అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం.
నిజనిర్ధారణ కమిటీ పేరిట లోదొడ్డిలో హడావుడి చేసిన టీడీపీ నేతలు స్థానికుల ద్వారా అసలు విషయం తెలుసుకుని బిక్కముఖం వేశారు. ఈ మేరకు మంగళవారం కాకినాడలో జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు కేసు వివరాలను వెల్లడించారు. రాజవొమ్మంగి మండలం లోదొడ్డికి చెందిన పొత్తూరు గంగరాజు భార్యతో అదే గ్రామానికి చెందిన టీడీపీ నేత వంతల రాంబాబుకు వివాహేతర సంబంధం ఉంది. దీనిపై కనుమ పండుగ నాడు గంగరాజు సోదరుడు లోవరాజు, రాంబాబు మధ్య ఘర్షణ జరిగింది. తన వదినతో సంబంధం సరికాదంటూ రాంబాబును లోవరాజు హెచ్చరించడంతో ఇరువురి మధ్య వివాదం మొదలైంది.
కల్లు కుండలో గడ్డి మందు కలిపి..
గంగరాజు భార్య తనతో దూరంగా ఉండటాన్ని జీర్ణించుకోలేని రాంబాబు అతడిపై కక్ష పెంచుకున్నాడు. గంగరాజుకు చెందిన జీలుగు చెట్టు కల్లు కుండలో ఈ నెల 1 రాత్రి గడ్డి మందు కలిపాడు. ఈ విషయం తెలియని గంగరాజు మరుసటి రోజు ఉదయం చెదల సుగ్రీవు, వేము లోవరాజు, బూసరి సన్యాసిరావు, కుడే ఏసుబాబుతో కలిసి కల్లు సేవించాడు. కొద్దిసేపటికే ఐదుగురూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రికి తరలిస్తుండగా సుగ్రీవు, లోవరాజు, గంగరాజు, సన్యాసిరావు, చికిత్స పొందుతూ ఏసుబాబు మృతి చెందారు. ఈ ఘటనపై జడ్డంగి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.
మంగళవారం ఉదయం నిందితుడు వంతల రాంబాబును అరెస్టు చేసి గడ్డి మందు ఉన్న డబ్బాను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు తెలిపారు. కేసు మిస్టరీని ఛేదించిన రంపచోడవరం అదనపు ఎస్పీ కృష్ణకాంత్ పటేల్, కాకినాడ క్రైమ్ డీఎస్పీ ఎస్.రాంబాబులను అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment