సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: జూబ్లీహిల్స్‌లో రొమేనియా బాలికపై సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో కస్టడీకి తీసుకున్న ఎమ్మెల్యే కుమారుడు, వక్ఫ్‌బోర్డ్ చైర్మన్ కుమారుడు, పొరుగు జిల్లా కార్పొరేటర్ కుమారుడు సహా ఐదుగురు మైనర్లతో పోలీసులు ఆదివారం క్రైమ్‌సీన్ రీకన్‌స్ట్రక్షన్ నిర్వహించారు.
ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు.. పబ్, కాన్సూ బేకరీ, రోడ్ నంబర్ 44లోని పవర్‌స్టేషన్, తిరిగి పబ్ మధ్య వారిని తిప్పుతూ ప్రశ్నించారు. ఘటన జరిగిన రోజు పబ్ నుంచి ఎవరెవరు, ఏ కారులో వెళ్లారు? ఆ రోజు బాధిత బాలిక ఏ కారులో కూర్చుంది? తిరిగి వచ్చే క్రమంలో ఎలా వచ్చారు? ఏయే ప్రాంతాల్లో ఆమెపై అత్యాచారం చేశారన్న వివరాలను సేకరించి రికార్డు చేశారు.
అనంతరం మైనర్లను జువెనైల్ హోమ్‌కు తరలించారు. సోమవారం ఉదయం వీరిని ఠాణాకు తీసుకువచ్చి మళ్లీ విచారించనున్నారు. ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడు సాదుద్దీన్ మాలిక్‌తో ఇప్పటికే క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్ పూర్తి చేశారు. సాదుద్దీన్ కస్టడీ గడువు ముగియడంతో సోమవారం కోర్టులో హాజరుపర్చనున్నారు. సాదుద్దీన్ చెప్పిన వివరాలు, మైనర్లు చెప్పిన వివరాలను పోల్చి చూడనున్నారు.
రెండుసార్లు ‘గుర్తింపు’ పరేడ్
సామూహిక అత్యాచారం కేసులో ప్రధాన నిందితు డు సాదుద్దీన్, మిగతా ఐదుగురిని బాలిక గుర్తించి కన్ఫర్మ్ చేయాల్సిన ‘టెస్ట్ ఐడెంటిఫికేషన్ పరేడ్ (టీఐపీ)’ విషయంలో చిత్రమైన పరిస్థితి నెలకొంది. బాలికతో రెండు సార్లు, వేర్వేరు ప్రాంతాల్లో టీఐపీ చేయించడం అనివార్యంగా మారింది.
రెండు వేర్వేరు కోర్టుల్లో కేసు విచారణ జరుగుతుండటం.. సాదుద్దీన్ చంచల్‌గూడ జైల్లో, మైనర్లు జువెనైల్ హోంలో ఉండటమే దీనికి కారణమని పోలీసులు చెప్తున్నారు. మేజర్ అయిన సాదుద్దీన్‌కు సంబంధించి నాంపల్లిలోని పోక్సో ప్రత్యేక కోర్టులో, మైనర్లకు సంబంధించి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ సమీపంలోని జువెనైల్ జస్టిస్ కోర్టులో సోమవారం టీఐపీ పిటిషన్లను దాఖలు చేయనున్నారు.
టీఐపీ’ చేసేదిలా..
గ్యాంగ్ రేప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి శిక్ష పడాలంటే.. సాక్షులతో ‘టీఐపీ’ నిర్వహణ చాలా కీలకం. డిజిగ్నేటెడ్ న్యాయమూర్తి సమక్షంలో ఈ ప్రక్రియ జరుగుతుంది. నిందితులను పోలిన వయసు, శారీరక లక్షణాలున్న వారిని దాదాపు ఆరు నుంచి పది మందిని ఎంపిక చేస్తారు. వారి మధ్యలో నిందితులను ఉంచి.. బాధితులు, సాక్షులను పిలిచి గుర్తించాలని కోరుతారు.
నిందితుల స్థానాన్ని రెండు, మూడు సార్లు మార్చి మళ్లీ గుర్తించాలని కోరుతారు. పరేడ్‌లో పాల్గొనే బాధితులు/సాక్షులకు ముసుగు వేయడం లేదా ప్రత్యేకమైన అద్దం వెనుక ఉంచడం ద్వారా.. వారిని నిందితులు గుర్తించకుండా జాగ్రత్త పడతారు. తాజా కేసులో.. అమ్నీషి యా పబ్, కాన్సూ బేకరీ, ఇతర ప్రాంతాల్లో నిందితులను చూసిన వారితో (సాక్షులతో) కూడా టీఐపీ నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని జైళ్లలో కేవలం శనివారం మాత్రమే టీఐడీ పరేడ్‌లు జరుగుతున్నాయి. దీనికి ఏర్పాటు చేయాల్సిందిగా ముందుగా జైలు అధికారులకు లేఖ రాయాల్సి ఉంటుంది. వీలును బట్టి జువెనైల్ హోమ్‌లోనూ టీఐపీ పరేడ్ నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment